అమెజాన్‌ ‘స్మార్ట్‌ కామర్స్‌’

ABN , First Publish Date - 2022-05-19T06:42:17+05:30 IST

స్థానిక దుకాణాలను డిజిటల్‌ దుకాణాలుగా మార్చాలని అమెజాన్‌ నిర్ణయించింది. ‘స్మార్ట్‌ కామర్స్‌’ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది.

అమెజాన్‌ ‘స్మార్ట్‌ కామర్స్‌’

కోటి చిన్న దుకాణాల డిజిటలీకరణ లక్ష్యం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): స్థానిక దుకాణాలను డిజిటల్‌ దుకాణాలుగా మార్చాలని అమెజాన్‌ నిర్ణయించింది. ‘స్మార్ట్‌ కామర్స్‌’ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. అమెజాన్‌ వార్షిక సదస్సు ‘సంభవ్‌’లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2025 నాటికి కోటి స్థానిక దుకాణాలను డిజిటల్‌ స్టోర్లుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమెజాన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఇండియా, ఎమర్జింగ్‌ మార్కెట్స్‌) అమిత్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇప్పటికే 1.5 లక్షల స్థానిక దుకాణాలు అమెజాన్‌ డాట్‌ఇన్‌ను వినియోగించి ఆన్‌లైన్‌ విక్రయాలు చేస్తున్నాయని చెప్పారు. స్మార్ట్‌ కామర్స్‌ ద్వారా మరిన్ని దుకాణాలు తమ సాధారణ విక్రయాలను ఆన్‌లైన్‌ చేయగలుగుతాయన్నారు.. ఎంత చిన్న దుకాణమైనా అమెజాన్‌ షాపింగ్‌ ఇన్నోవేషన్స్‌, లాజిస్టిక్స్‌, డిజిటల్‌ పేమెంట్స్‌ సేవలను అందించగలవని అగర్వాల్‌ చెప్పారు. రానున్న కొద్ది వారాల్లో డిజిటలైజ్‌ బిల్లింగ్‌, ఇన్వెంటరీ మేనేజిమెంట్‌ వంటి వాటి కోసం అమెజాన్‌ సరికొత్త సొల్యూషన్లను విడుదల చేయనుంది. 


రెండేళ్ల క్రితం.. 

2020లో జరిగిన అమెజాన్‌ సంభవ్‌లో కోటి ఎంఎస్‌ఎంఈలను డిజిటలైజ్‌ చేయాలని అమెజాన్‌ నిర్ణయించింది. తద్వారా 1000 కోట్ల  డాలర్ల ఎగుమతులను భారత్‌ నుంచి చేయాలని, 2025 నాటికి 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 40 లక్షల ఎంఎస్‌ఎంఈలను డిజిటలైజ్‌ చేసినట్లు అమెజాన్‌ ఇండియా కంట్రీ మేనేజర్‌ మనీశ్‌ తివారీ తెలిపారు.  

Updated Date - 2022-05-19T06:42:17+05:30 IST