అంబరాన ‘శంబర’ం

ABN , First Publish Date - 2022-01-26T04:49:13+05:30 IST

శంబర పోలమాంబ సిరిమానోత్సవం మంగళవారం వైభవంగా సాగింది. స్వల్పసంఖ్యలో భక్తులు.. పోలీసు భద్రత నడుమ సిరిమాను ముందుకు కదిలింది. సంప్రదాయబద్ధంగా వేడుక జరిగింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో భక్తుల సంఖ్యను తగ్గించడానికి అధికారులు ముందు నుంచే ప్రకటనలు ఇవ్వడం ఫలితమిచ్చింది.

అంబరాన ‘శంబర’ం
గ్రామ వీధుల్లో తిరుగుతున్న సిరిమాను(ఇనసెట్‌) సిరిమాను అధిష్టించిన భాస్కరరావు

కరోనా నిబంధనలతో భక్తులు స్వల్పంగా హాజరు

కాలినడకన శంబరకు చేరిక

పటిష్ట భద్రత నడుమ ఉత్సవం

రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం

సాలూరు/రూరల్‌/ మక్కువ, జనవరి 25: శంబర పోలమాంబ సిరిమానోత్సవం మంగళవారం వైభవంగా సాగింది. స్వల్పసంఖ్యలో భక్తులు.. పోలీసు భద్రత నడుమ సిరిమాను ముందుకు కదిలింది. సంప్రదాయబద్ధంగా వేడుక జరిగింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో భక్తుల సంఖ్యను తగ్గించడానికి అధికారులు ముందు నుంచే ప్రకటనలు  ఇవ్వడం ఫలితమిచ్చింది. గతంలో ఎన్నడూ లేనంత తక్కువగా భక్తులు హాజరయ్యారు. ఊరేగింపు ఆలస్యంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం2 గంటలకు ప్రారంభిస్తామని ఈవో లక్ష్మీనగేష్‌ చెప్పారు. కానీ నాలుగు గంటలకు సిరిమాను కదలింది. తొలుత గ్రామ వీధుల్లో అమ్మవారి ఘటాలను ఊరేగించారు. వాటికి భక్తులు పూజలు చేశారు. అనంతరం సిరిమానును జన్ని భాస్కరరావు (జగది) అధిరోహించారు. సిరిమానోత్సవం పూర్తిగా పోలీసుల కనుసన్నల్లో సాగింది. కొన్నిచోట్ల వారే అధికంగా కనిపించారు. వీధుల్లో భక్తుల సందడి తగ్గింది. ఊరేగింపునకు ముందు జన్ని పేకాపు భాస్కరరావు (జగది)ను చదురు గుడి నుంచి సాడేపు కుటుంబీకులు భుజాలపై  తీసుకొచ్చారు. ఆయన కాలు కింద మోయకుండా సిరిమానుపై కూర్చుండబెట్టారు. అదే సమయానికి మంగళ వాయిద్యాల మధ్య ఘటాలు సిరిమాను దగ్గరకు చేరుకున్నాయి. అనంతరం సిరిమాను, ఘటాలు తొలుత గిరడ వారింటికి వెళ్లాయి. ఆ కుటుంబీకులు పూజలు చేశాకకుప్పిలి, పూడి వారిళ్లకు సిరిమాను వెళ్లింది. ఆ కుటుంబీకులు కూడా సిరిమానుకు పూజలు చేశారు. ఘటాలు దక్షిణ దిక్కుగా.. సిరిమాను తూర్పు దిక్కుగా వెళ్లాయి. ఘటాలు, సిరిమాను మళ్లీ పణుకు వీధిలో కలిశాయి. అక్కడ పొడిపిరెడ్డి కుటుంబీకులు, తీళ్ల వారి వారసులుగా అక్యాన కుటుంబీలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సిరిమాను వెనకకు వచ్చి గొల్లవీధి, కొత్తవీధి మీదుగా పెద్దమ్మ గుడి వద్దకు చేరింది. అక్కడ భక్తుల నుంచి పూజలు అందుకుంది. మళ్లీ వెనుతిరిగి నడివీధికి చేరుకొని.. ఆగిపోయింది. అక్కడ సాడేపు కుటుంబీలు మళ్లీ జన్ని పేకాపు రామారావును సిరిమాను పైనుంచి దించి భుజాలపై చదురుగుడికి తీసుకు వెళ్లారు. 

పకడ్బందీగా ఏర్పాట్లు

సిరిమానోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓఎస్డీ ఎన్‌.సూర్యచంద్రరావు, డీఎస్సీ సుభాష్‌, సాలూరు సీఐ లెంక అప్పలనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు రోప్‌పార్టీతో పాటు భారీగా మోహరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఐటీడీఏ పీవో రోణంకి కూర్మనాథ్‌, సబ్‌ కలెక్టర్‌ భావ్న పర్యవేక్షణలో అధికారులు ఏర్పాట్లు చేశారు. 600 మంది పోలీసులు భద్రత విధుల్లో పాల్గొన్నారు. భక్తుల రద్దీని తగ్గించే క్రమంలో ప్రత్యేక బస్సులను నడపలేదు. శంబరకు వచ్చే ఆరు మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు రాకుండా పోలీసులు నిరోధించారు.

కాలినడకన భక్తులు

 భక్తుల రద్దీని నియంత్రించడానికి బస్సులు, ఆటోలు తదితర ప్రయాణికుల వాహనాలను పోలీసులు నిలువరించారు. వాహన సౌకర్యం లేక మక్కువ, మామిడిపల్లి తదితర ప్రాంతాల వరకు ఆటోలు, బస్సులు, జీపుల్లో భక్తులు చేరుకున్నారు. అక్కడి నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న శంబరకు కాలినడకన చేరుకున్నారు.  అమ్మవారి దర్శనానికి మంగళవారం ఉదయం స్వల్పసంఖ్యలోనే భక్తులు వచ్చారు. క్యూలైన్లు అన్నీ ఖాళీగా కనిపించాయి. సిరిమానోత్సవ సమయానికి కూడా శంబర వీధుల్లో సందడి అంతంత మాత్రంగానే ఉంది.

వైద్యశాఖ సేవలు

సిరిమానోత్సవానికి వచ్చే భక్తుల కోసం వైద్య ఆరోగ్యశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. వనంగుడి, చదురుగుడికి వెళ్లే మార్గాలతో పాటు గ్రామంలోని మరో మూడు చోట్ల వైద్య శిబిరాలు నిర్వహించారు. అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆక్సిజన్‌ సిలిండర్‌, 108 వాహనాలు, ఫీడర్‌ అంబులెన్స్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచారు.  మందులను అందుబాటులో ఉంచారు. అమ్మవారిని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు దర్శించుకున్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సాలూరు ఎమ్మెల్యే ఆర్పీభంజ్‌దేవ్‌ పూజలు చేశారు. 


Updated Date - 2022-01-26T04:49:13+05:30 IST