ltrScrptTheme3

అంబరాన సిరి సంబరం

Oct 19 2021 @ 23:23PM
సిరిమానుపై అర్చకుడు వెంకటరావు, ఉత్సవాన్ని వీక్షిస్తున్న భక్తులు

నిర్ణీఈత సమయానికే కదిలిన సిరిమాను 

 అధిక సంఖ్యలో భక్తుల రాక 

పట్టు వసా్త్రలు సమర్పించిన మంత్రులు


విజయనగరం ఇలవేల్పు.. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లమ్మ సిరిమాను ఉత్సవం అంబరాన్ని తాకింది. అశేష జనవాహిని జైజై పైడిమాంబ నామస్మరణ మధ్య మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మూడులాంతర్ల వద్దనున్న చదురుగుడి నుంచి సిరిమాను కదిలింది. ఆ సమయంలో ఆలయానికి చుట్టూ ఉండే అంబటి సత్తర్వు జంక్షన, గంటస్తంభం, కోట జంక్షన ప్రాంతాలు భక్తులతో కిక్కిరిశాయి. సిరిమాను దాదాపు రెండున్నర గంటల సమయంలో మూడు పర్యాయాలు కోట శక్తికి నమస్కరించి తిరిగి చదురుగుడికి చేరుకుంది.  

(విజయనగరం-ఆంధ్రజ్యోతి/ విజయనగరం రూరల్‌)

ఓవైపు భక్తుల జయజయధ్వానాలు...మరోవైపు ఆకాశం నుంచి చినుకు పూల జల్లుల నడుమ పైడితల్లి సిరిమానోత్సవం కన్నుల పండువగా ముగిసింది. సిరిమానును తనివితీరా తిలకించి... పూలు, పండ్లు విసిరి భక్తులు పులకించిపోయారు. అమ్మవారి పరివారం పాలధార, బెస్తవారి వల, అంజలి రథం, మాలధారణ చేసిన భక్తులు ముందుకు కదలగా... మధ్యాహ్నం 3.30 గంటలకు సిరిమాను ఊరేగింపు ప్రారంభమైంది. 5.30 గంటలకు ముగిసింది. సిరిమానును అధిష్టించిన అర్చకుడు బంటుపల్లి వెంకటరావు అక్షింతలు చల్లి భక్తులను ఆశీర్వదించారు. సిరిమాను దాదాపు రెండున్నర గంటల సమయంలో మూడు పర్యాయాలు కోట శక్తికి నమస్కరించి తిరిగి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పూజారి బంటుపల్లి వెంకటరావు హుకుంపేట నుంచి ఉల్లివీధి, కన్యకాపరమేశ్వరి ఆలయం, గంటస్తంభం మీదుగా మూడు లాంతర్ల వద్ద ఉన్న చదురుగుడికి చేరుకున్నారు. సిరిమాను రథం కూడా అదే సమయంలో హుకుంపేట నుంచి బయలుదేరి ఆలయానికి వచ్చింది. దీంతో అనుకున్న సమయానికే 3.30 గంటలకు సిరిమాను ఊరేగింపు ప్రారంభమైంది. ఈ ఏడాది మరింత వైభవంగా సాగింది. కోట బురుజుపైనుంచి పూసపాటి వంశీయులైన అశోక్‌ గజపతిరాజు, అదితి గజపతిరాజుతో పాటు, దేవదాయశాఖాధికారులు సిరిమానోత్సవాన్ని తిలకించారు. డీసీసీబీ కార్యాలయం నుంచి మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య తదితరులు ఊరేగింపును వీక్షించారు. ప్రారంభంలో సిరిమాను లాగే తాడు ఊడిపోయింది. వెంటనే నిర్వాహకులు సరిచేసి ఊరేగింపును కొనసాగించారు.

కరోనా ఆంక్షలు ఉన్నా..

ఉత్సవంలో కరోనా నిబంధనలు పెద్దగా కనిపించలేదు. విధులు నిర్వహించే అధికారులు, పోలీసులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, భక్తులు ఏమాత్రం భౌతికదూరం పాటించలేదు. మాస్క్‌లు ధరించలేదు. శానిటైజర్‌ వాడలేదు. సిరిమానోత్సం వీక్షించేందుకు ఎవరూ రావద్దని జిల్లా అధికార యంత్రాంగం ముందుగానే విజ్ఞప్తి చేసింది. కరోనా నేపథ్యంలో భక్తులంతా గూమిగూడితే ఇబ్బందని చెప్పింది. అయినా భక్తులంతా పోలీసు ఆంక్షలను దాటుకుని, విజయనగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సిరిమాను తిరిగే ప్రధాన మార్గానికి చేరుకున్నారు. ఊహించని విధంగా భక్తులు రావడంతో పోలీసులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారిని నియంత్రించగలిగారు. 

కానరాని మాన్సాస్‌ మాజీ చైర్‌పర్సన్‌

గత ఏడాది పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం రోజున హడావిడి చేసిన సంచయిత మంగళవారం ఎక్కడా కనిపించలేదు. అప్పట్లో మాన్సాస్‌ చైర్‌పర్సన్‌ హోదాలో కోట బురుజు పైనుంచి అమ్మవారిని దర్శించుకున్నారు. అదే చోట కూర్చున్న పూసపాటి వంశీయులు ఆనందగజపతి రాజు సతీమణి సుధాగజపతి, కుమార్తె ఊర్మిళాగజపతిలను అగౌరవపరిచారు. కూర్చున్న స్థలాన్ని ఖాళీ చేయించారు. హైకోర్టు తీర్పుతో మాన్సాస్‌ చైర్మన్‌గా మళ్లీ అశోక్‌ గజపతిరాజు బాధ్యతలు చేపట్టడంతో సంచయిత మాజీ అయ్యారు. మాజీ చైర్మన హోదాలో అయినా అమ్మవారిని దర్శించుకునేందుకు రాకపోవటం గమనార్హం. 

పైడిమాంబకు ప్రత్యేక పూజలు 

ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు కుటుంబ సమేతంగా అమ్మవారిని మంగళవారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సునీలా గజపతిరాజు, అదితి ఆయన వెంట ఉన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు కూడా ఆలయాన్ని సందర్శించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని,  సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నట్లు వారు తెలిపారు. అంతకుముందు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువసా్త్రలను సమర్పించారు. కలెక్టర్‌ సూర్యకుమారి, జేసీ కిషోర్‌కుమార్‌, ఆర్‌డీవో భవానీ శంకర్‌, ఆలయ పూజారులు మంత్రులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

 సిరిమానోత్సవ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ కంట్రోల్‌ రూంను కలెక్టర్‌ సూర్యకుమారి మంగళవారం ఉదయం సందర్శించారు. అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. భక్తుల దర్శనాలు, క్యూలైన్ల పరిశీలన తదితర అంశాలపై జేసీ, ఆర్‌డీవోలతో మాట్లాడారు.  

 కరోనా నివారణ చర్యల్లో భాగంగా మంగళవారం పైడిమాంబ ఆలయం పరిసర ప్రాంతాల్లో కరోనా టీకా వేశారు. ఎంతో మంది భక్తులు ముందుకొచ్చి కరోనా టీకాలు వేయించుకున్నారు. 108, 104 వాహనాల ద్వారా వైద్య ఆరోగ్యశాఖ ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.