ప్రపంచంలోనే భారత ప్రవాసులకు అత్యంత సురక్షితమైన దేశం UAE: భారత రాయబారి

ABN , First Publish Date - 2022-01-27T15:16:40+05:30 IST

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో భారత 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

ప్రపంచంలోనే భారత ప్రవాసులకు అత్యంత సురక్షితమైన దేశం UAE: భారత రాయబారి

అబుదాబి: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో భారత 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అటు అబుదాబిలోని భారత ఎంబసీలో కూడా కరోనా నిబంధనల మధ్య చాలా తక్కువ మంది సమక్షంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. రాయబార కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం అంబాసిడర్ సంజయ్‌ సుధీర్‌ మాట్లాడారు. యూఏఈలోని భారత ప్రవాసులతో పాటు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే యూఏఈ భారత ప్రవాసులకు అత్యంత సురక్షితమైన దేశంగా ఆయన పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా రాయబారి గుర్తు చేశారు. కరోనా విపత్కరపరిస్థితుల్లోనూ యూఏఈ, భారత్ కలిసి పని చేసిన తీరు అమోఘం అని కొనియాడారు. అటు పెట్టుబడుల విషయంలోనూ ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. 


"రెండు నెలల క్రితం యూఏఈలో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టాను. యూఏఈలో భారతదేశం, భారతీయులకు సేవ చేయడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలలో వేగవంతమైన, సానుకూల పరివర్తనతో ముందుకు వెళ్తున్నాయి. మహమ్మారి సమయంలోనూ రెండు దేశాల మధ్య పరస్పర సహకారం మంచి పరిణామం. ఆరోగ్యం, ఆహార భద్రత, ఆధునాతన సాంకేతికతలు వంటి కొత్త సహకార రంగాలను అన్వేషించాము." అని సంజయ్‌ సుధీర్‌ చెప్పుకొచ్చారు. అలాగే యూఏఈలో ఉన్న 34 లక్షల మంది ప్రవాసీయుల భద్రత, సంక్షేమం భారత ప్రభుత్వ కర్తవ్యమని ఈ సందర్భంగా రాయబారి గుర్తు చేశారు. అటు దుబాయ్ ఎక్స్‌పో 2020లో కూడా భారత్ పెద్ద ఎత్తున పాల్గొందని రాయబారి పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. అబుదాబి, దుబాయిలతో పాటు జెడ్డా, రియాద్‌, కువైత్‌, మస్కట్‌లో కూడా బుధవారం భారత 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రవాసీలు ఘనంగా నిర్వహించారు.  


Updated Date - 2022-01-27T15:16:40+05:30 IST