కార్మిక బాంధవుడు అంబేడ్కర్

ABN , First Publish Date - 2022-05-01T06:10:05+05:30 IST

మన దేశంలో కార్మికులకు హక్కులు కల్పించింది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. ఆయన లేకుంటే ఈ దేశంలో కార్మిక చట్టాలే లేవు. ఆయన చేసిన కృషి, త్యాగాలను మేడే సందర్భంగా ఈ దేశ కార్మికలోకం, కమ్యూనిస్టులు గుర్తు చేసుకోవాలి...

కార్మిక బాంధవుడు అంబేడ్కర్

మన దేశంలో కార్మికులకు హక్కులు కల్పించింది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. ఆయన లేకుంటే ఈ దేశంలో కార్మిక చట్టాలే లేవు. ఆయన చేసిన కృషి, త్యాగాలను మేడే సందర్భంగా ఈ దేశ కార్మికలోకం, కమ్యూనిస్టులు గుర్తు చేసుకోవాలి. పని గంటలను 12 నుంచి ఎనిమిదికి తగ్గించాలని 1942 నవంబరు 27న ఢిల్లీలో తన అధ్యక్షతన నిర్వహించిన నాలుగో భారత కార్మిక సదస్సులో అంబేడ్కర్ తొలిసారి ప్రతిపాదించారు. 1945 నవంబరు 27, 28 తేదీల్లో జరిగిన ఏడో సదస్సు... కర్మాగారాల్లో వారానికి 48 గంటల పని విధానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 1923 నాటి కార్మికుల పరిహార చట్టం, ప్రసూతి ప్రయోజనాల చట్టం, 1943 నాటి కర్మాగారాల చట్టాలలో కార్మికులకు అనుకూలంగా సవరణలు తీసుకొచ్చేందుకు వివిధ స్థాయిల్లో అంబేడ్కర్ చర్యలు చేపట్టారు. పరిశ్రమల్లో రోజుకు 12 గంటల పని విధానాన్ని వ్యతిరేకించారు. బ్రిటన్ తరహాలో వారానికి 48 గంటల పని విధానాన్ని తీసుకొచ్చారు. కార్మికులకు ప్రయోజనం చేకూర్చేలా అంబేడ్కర్ కృషితో వచ్చిన నిబంధనలు, మారిన లేదా తెచ్చిన చట్టాలు ఇవీ... పనిగంటలు ఎనిమిదికి తగ్గింపు, లింగభేదం లేకుండా సమాన పనికి సమాన వేతనం, వేతన చెల్లింపు చట్టం, కనీస వేతనాల చట్టం, ఉద్యోగుల వేతన సవరణ చట్టం, భారత కర్మాగారాల చట్టం, భారత కార్మిక సంఘ చట్టం, కార్మికుల పరిహార చట్టం, కార్మికుల రక్షణ చట్టం, ప్రసూతి ప్రయోజనాల చట్టం, కార్మిక రాజ్య బీమా(ఈఎస్ఐ) చట్టం, మహిళలు, బాల కార్మికుల రక్షణ చట్టం, బొగ్గు గనుల కార్మికుల భవిష్య నిధి, బోనస్ చట్టం, మహిళా కార్మికుల సంక్షేమ నిధి, బొగ్గు గనుల్లో భూగర్భ పనుల్లో మహిళల నియామకంపై నిషేధం పునరుద్ధరణ, వేతనంతో కూడిన సెలవులు, సామాజిక భద్రత. కార్మికుల కోసమే పార్టీ పెట్టిన తొలి భారతీయ నాయకుడు ఆయనే. 1936 ఆగస్టులో అంబేడ్కర్ ‘ఇండిపెండెంట్ లేబర్ పార్టీ(ఐఎల్‌పీ)’ని స్థాపించారు. తమది కార్మికుల పార్టీ అని ఐఎల్‌పీ ప్రకటించుకొంది. ప్రభుత్వ, ప్రైవేట్ అసంఘటిత కార్మికులందరికీ ఎన్నో హక్కులు, భద్రతను కల్పించింది డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్. కాబట్టి మేడే సభల్లో ఆయన చిత్రపటాన్ని పెట్టి, కార్మికుల ప్రయోజనాలకు ఆయన చేసిన కృషి గురించి కార్మిక లోకం, కమ్యూనిస్టులు స్మరించుకోవాలి. 

జేరిపోతుల పరశురామ్

కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి


Updated Date - 2022-05-01T06:10:05+05:30 IST