ప్రజాస్వామ్యం గుట్టు అంబేడ్కర్‌కు ఆనాడే తెలుసు!

ABN , First Publish Date - 2022-08-17T06:27:56+05:30 IST

‘ఆజాదీ కా అమృతోత్సవ్’ సందర్భంగా ప్రజాస్వామ్యంలో వారసత్వ రాజకీయాల గురించి చర్చ జరుగుతున్నది. నిజానికి అనేక మూడో ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య విరుద్ధంగా...

ప్రజాస్వామ్యం గుట్టు అంబేడ్కర్‌కు ఆనాడే తెలుసు!

‘ఆజాదీ కా అమృతోత్సవ్’ సందర్భంగా ప్రజాస్వామ్యంలో వారసత్వ రాజకీయాల గురించి చర్చ జరుగుతున్నది. నిజానికి అనేక మూడో ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య విరుద్ధంగా, వంశ పారంపర్యత దశాబ్దాలుగా పాతుకుపోయి ఉన్నది. వాజపేయీ, మోదీ బ్రహ్మచారి ప్రధానులు గానీ, బీజేపీలోనూ డజన్ల కొద్దీ పాలక కుటుంబాలు ఉన్నాయి. వారు ఇతర పార్టీల కుటుంబాల్నీ ఆకర్షిస్తున్నారు. కాబట్టి ఇది వ్యక్తిగత స్వార్థం వల్ల అంటే సరిపోదు. దీనికి వెనక చారిత్రక, రాజకీయ ప్రాతిపదిక ఏమిటో చూడాలి.


మన దేశంలో ఆధునిక ప్రజాస్వామ్య భావనలూ, వ్యవస్థలూ బ్రిటిష్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం చేతనే ప్రభావితమైనాయన్నది విదితమే. నేడు ఏ చర్చ జరిగినా అంబేడ్కర్‌ని ఉటంకించటం సర్వసాధారణం. కాబట్టి ఈ అంశంపై అంబేడ్కర్ ఏమన్నారో చూద్దాం: ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పైకి కన్పించినట్టు అత్యుత్తమమైనదేమీ కాదు. తస్మాత్ జాగ్రత్త!’ అని ఆయన హెచ్చరించారంటే నమ్మగలరా? అంతేకాదు. ‘జాతీయవాదం’ తమకు సామాజిక ఆర్థిక సమానత్వాన్ని ఇవ్వదని, అలాంటి ‘జాతీయ రాజ్యం’ యాజమాన్య వర్గాల ఆధిపత్యంతో కూడి, శ్రామికవర్గాల పాలిటి శత్రువుగా మారుతున్నదనీ, ఆ వర్గాలు ‘జాతీయవాదం’ పేరిట అత్యంత నీచమైన దోపిడీకి బలవుతున్నారని, ‘జాతీయవాదం’ కోసం సర్వస్వాన్ని త్యాగం చేయటం పాపమని ఆయన ఎత్తి చూపారు. తనే స్థాపించిన ‘భారత కార్మిక సమాఖ్య’ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ‘ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ వర్కర్స్ స్టడీ క్యాంప్’ (1943 సెప్టెంబరు 8–17) ముగింపుగా అంబేడ్కర్ చేసిన ప్రసంగంలో ఆయన ఈ మాటలు చెప్పారు.


వర్గం, కులం – ఈ రెండింటిలో పీడితుల సమీకరణకు ఏది ప్రాతిపదిక? ఈ విషయంలో అంబేడ్కర్ అనేక ప్రయోగాలు చేసారు. ఆలిండియా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ (1942) ఏర్పాటు తెల్సినంతగా 1956 అక్టోబరులో ఆ ఫెడరేషన్ రద్దు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపన నిర్ణయాలు అంబేడ్కరే తీసుకొన్నారని అంతగా తెలియవు. పై రెంటికీ మధ్య ఆగష్టు 1936లో ‘ఇండిపెండెంట్ లేబర్ పార్టీ’ (ఐ.ఎల్.పి) ఏర్పడిందనీ, దానిపై బ్రిటనులో ఒక అధికారపార్టీగా ఉన్న లేబర్ పార్టీ ప్రభావం, లేబర్ –ఫేబియన్ సోషలిజం, కీనేసియన్ ఎకనామిక్స్ ముద్ర ఉండేవనీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఆనాటి రాజకీయ పూర్వరంగం ఇదీ: రష్యా విప్లవం (1917) తర్వాత సోషలిజం భావన, ఆ ప్రాబల్యం వల్ల హిట్లరు సైతం ‘నేషనల్ సోషలిజం’ పేరిట అమల్లోపెట్టిన ఫాసిస్టు జాతీయ భావజాలం చర్చలో ఉన్నవి. బ్రిటిష్ లేబర్ పార్టీ (ఒక దశలో 50శాతం ఓట్లతో) ఫేబియన్ సోషలిజంతో ఉండేది. అప్పటికే రెండో ప్రపంచ యుద్ధం మొదలవటంతో వారేకాక బ్రిటిష్ పాలకవర్గాలు మొత్తం ఫాసిస్ట్ వ్యతిరేక శిబిరంలో ఉండేవి. అంబేడ్కర్ మార్క్సిస్టు కాదు. కానీ ఆయనపైనా ఈ ప్రభావాలుండేవి.


ఈ నేపథ్యంలోంచి అంబేడ్కర్ ప్రసంగం మొదట్లోనే ఇలా అన్నారు: ‘సుదీర్ఘమైన, రక్తపాతంతో కూడిన పోరాటం తర్వాత, నిరంకుశ సార్వభౌములను తొలగించి, ఆ స్థానంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అని పిలువబడే వ్యవస్థ ఏర్పడింది. ఇది ప్రభుత్వ వ్యవస్థల్లో అత్యుత్తమమైనదనీ, అందరికీ స్వేచ్ఛ, ఆస్తి హక్కులు, సౌఖ్యం కొనితెస్తుందనీ భావించారు. ఐతే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విశ్వవ్యాప్తంగా ఆమోదించబడి శతాబ్దం కూడా గడవకముందే దానిపై తిరుగుబాటు జరగడం ఆశ్చర్యకరం’. యూరపులో ఫ్యూడలు వ్యతిరేక విప్లవాల ఫలితంగా (పార్లమెంటరీ) ప్రజాస్వామ్యం ఏర్పడిందని, ‘అలాటి యూరపులోనే తిరుగుబాటు’ ఆ శతాబ్దిలోపే వచ్చిందని చెప్తూ, ఎందుకొచ్చిందో వివరించారు: ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసింది ‘కాంట్రాక్ట్ స్వేచ్ఛ’ (Freedom of contract) అన్న భావన. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఆర్థిక అసమానతలను విస్మరించింది. కాంట్రాక్టులో ఉన్న పార్టీలు(పక్షాలు) అసమానులైతే, వారిపై ఆ కాంట్రాక్ట్ స్వేచ్ఛ ఫలితాలెలా ఉంటాయో పట్టించుకోలేదు. కాంట్రాక్ట్ స్వేచ్ఛ బలవంతులకు బలహీనులను మోసం చేసే అవకాశం ఇచ్చినా ఫర్వాలేదన్నట్టు వదిలేసింది. ఫలితంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్వేచ్ఛకోసం నిలబడే క్రమంలో పేదల, అణగారిన, వంచిత వర్గాల పట్ల ఆర్థిక అన్యాయాలను పెంచుకొంటూ పోయింది’. ఇది చెప్పింది ఫ్యూడలు వ్యతిరేక విప్లవాల, యూరపు అనుభవాల గురించి. కానీ మనదేశంలో అలాంటి విప్లవాల ఫలితంగా కాక, వలస పాలకులకూ దేశీ (దళారీ) పాలక వర్గాలకూ మధ్య కుదిరిన ‘అధికార మార్పిడి రాజీ’ ఫలితంగా 1947లో ‘అర్ధరాత్రి స్వతంత్రం’ వచ్చింది. అటు సామ్రాజ్యవాదులతో ఇటు దేశీ పాలకవర్గాలతో కుదుర్చుకొన్న మన ‘డబుల్ కాంట్రాక్ట్ వ్యవస్థ’లో 75 ఏళ్లు దొర్లిపోయాయి. ఈ మధ్యలో నానాటికీ మరింత వేగంగా, దారుణంగా బిలియనీర్ల సంఖ్యా, పేదరికమూ, అంతరాలూ పెరిగిపోయాయి. అంబేడ్కర్ ఇలా అంటారు: ‘అన్ని రాజకీయ సమాజాలూ రెండు వర్గాలుగా–పాలకులు, పాలితులుగా– విడిపోయి ఉంటాయి. ఈ చెడు ఇక్కడితో ఆగిపోతే బాగుండును.  దురదృష్టమేమిటంటే పాలకులు ఎల్లవేళలా పాలకవర్గం నుండే తీసుకోబడతారు. పాలితవర్గం ఎప్పటికీ పాలకవర్గంగా ఎదగదు. ఈ విభజన ఇలా దొంతరలుగా ఘనీభవించిపోతుంది. ప్రజలు తమను తాము పరిపాలించుకోరు. పాలకులకే వదిలేసిన ప్రభుత్వం తమదని మర్చిపోతారు. అందువల్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏనాడూ ‘ప్రజల యొక్క, ప్రజల చేత ప్రభుత్వం’ కాదు; అందుకే అది ‘ప్రజల కోసం’ ప్రభుత్వమూ కాదు. ప్రజాదరణ గల ప్రభుత్వం అంటూ ఎన్ని హంగులూ ఆర్భాటాలూ ఉన్నా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నిజానికి వంశ పారంపర్య పాలకవర్గం ద్వారా వంశ పారంపర్య పాలితవర్గంతో కూడిన ప్రభుత్వమే. రాజకీయ జీవనాన్ని ఇలా దుర్మార్గంగా నిర్మించటం వల్లే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఘోరంగా విఫలమైంది’.


‘కార్మిక వర్గాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవించవలసి వస్తే, దానిని వారి ప్రయోజనం కోసం మార్చడానికి సాధ్యమైనంత ఉత్తమ మార్గాలను రూపొందించాలి. శ్రామికవర్గం పాలకవర్గంగా మారాలి. కార్మిక పార్టీని రాజకీయ పార్టీగా నిర్వహించాలి. లేబర్ ప్రభుత్వం లైసెజ్ ఫెయిర్ (స్వేచ్ఛావిపణి) ప్రభుత్వం కారాదు. తప్పనిసరిగా ప్రభుత్వ అదుపు ఉండే వ్యవస్థగా ఉండాలి. దానికి తగ్గట్టు కార్మిక వర్గాల్ని పాలక తరగతి స్థాయికి పెంచాలి; ప్రభుత్వాన్ని కైవసం చేసుకోవాలనే ఆశయం పెంచుకోకపోవడం కార్మికవర్గం తమపై తాము చేసుకున్న నేరం’ అని అన్నారాయన. ఈ మాటలు కార్ల్ మార్క్స్ ‘కమ్యూనిస్ట్ మానిఫెస్టో’ను గుర్తు చేస్తాయి. శ్రామిక వర్గాల్లో ప్రతి ఒక్కరూ రూసో సామాజిక ఒప్పందం, మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, జాన్ స్టువర్ట్స్ మిల్ ఆన్ లిబర్టీ వంటి ఆధునిక రాజకీయ రచనల్ని చదవాలనీ, కానీ వారు రాజుల రాణుల మాయ కథల మత్తుకి బానిసలైనారనీ చెప్పారు. ఇవి 1943లో ఆయన ఎంతో ఆలోచించి చేసిన ఒక కీలకోపన్యాసంలో వివరించిన భావనలు. 


ఇన్ని చెప్పిన ఆయన అలాంటి ప్రభుత్వంలోనే ఎందుకు చేరారు? ఆ చర్చ వేరే. భారత రాజ్యాంగ రూపశిల్పిగా చెప్పబడే అంబేడ్కర్ తాను రాజ్యాంగంలో అనేక విషయాల్ని ఇష్టం లేకపోయినా, కిరాయి రచయితగా ('hack'గా) రాసానని 1953 సెప్టెంబరు 2నాడు రాజ్యసభలో అన్నారు. అప్పుడే మళ్లీ ఎవరో రెట్టిస్తే ‘ఈ రాజ్యాంగాన్ని తగులబెట్టటానికి నేను మొదటివాడిగా ఉంటాను. ఇది నాకక్కరలేదు. ఇది ఎవరికీ సూట్ కావటం లేదు’ అని ఆ సభలోనే కోపంగా అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, వంశపారంపర్య పాలనలపై ఆయన అభిప్రాయాల్ని మరోసారి లోతుగా చర్చించాల్సిన సందర్భం ఇది.

ఎమ్. జయలక్ష్మి

రిటైర్డ్ ఏజీఎం, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్

Updated Date - 2022-08-17T06:27:56+05:30 IST