ఆంబులెన్స్‌ ఆలస్యం.. మహిళ మృతి

ABN , First Publish Date - 2021-05-09T05:13:19+05:30 IST

ఆంబులెన్స్‌ సేవలు ఆలస్యమై ఒకరి ప్రాణం పోయింది.

ఆంబులెన్స్‌ ఆలస్యం.. మహిళ మృతి

  ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన

ఆత్మకూరు, మే 8:
ఆంబులెన్స్‌ సేవలు ఆలస్యమై ఒకరి ప్రాణం పోయింది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు, ఆత్మకూరు పట్టణంలోని వడ్లపేటకు చెందిన బీబీ(39) అనే మహిళ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను శనివారం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స నిర్వహించిన వైద్యులు, పరిస్థితి విషమంగా ఉందని, కర్నూలుకు తీసుకెళ్లాలని ఉదయం 7.30 గంటల సమయంలో సూచించారు. అప్పటి నుంచి అంబులెన్సు కోసం 11 సార్లు టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసినా, సిబ్బంది స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 9.26 నిమిషాలకు ఆంబులెన్స్‌ సిబ్బంది ఫోన్‌ చేశారని, అప్పటికే బీబీ మృతిచెందారని కంటతడి పెట్టారు. సకాలంలో అంబులెన్సు వచ్చుంటే తను ప్రాణాలతో ఉండేదని అన్నారు. కాసేపు ఆసుపత్రిలో ఆందోళన చేశారు. అంబులెన్స్‌ సిబ్బంది నిర్లక్ష్యం గురించి కలెక్టర్‌కు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించామని, స్పందిచకపోవడంతో చేసేది లేక మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లామని అన్నారు.


నిర్లక్ష్యం కారణంగానే..

108 ఆంబులెన్స్‌ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మా వదిన మృతిచెందింది. ఆంబులెన్స్‌ కోసం మేము ఫోన్‌ చేసిన వెంటనే స్పందించి ఉంటే గంటన్నరలోగా కర్నూలుకు తీసుకెళ్లి బతికించుకునేవాళ్లం. ఆత్మకూరులో ఓ చోట ఆంబులెన్స్‌ను ఆపి సిబ్బంది దర్జాగా ఉన్నారు. ఫోన్‌ చేసినా ఆసుపత్రి వద్దకు రాలేదు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు ఫోన్‌ చేసినా ఫలితం లేకపోయింది. ఆత్మకూరు ఎస్‌ఐకి కూడా ఫిర్యాదు చేశాము.
- ఫరూక్‌, మృతురాలి బంధువు


108  సిబ్బంది స్పందించనందుకే..
ఫోన్‌ చేసిన వెంటనే 108 సిబ్బంది స్పందించి ఉంటే మా కోడలు బతికేది. ఉదయం 7.30 గంటలకు 108కి అనేకమార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు. ప్రభుత్వం ఆంబులెన్స్‌లు అందుబాటులో ఉంటాయని చెబుతోంది. కానీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
 - నిజామొద్దీన్‌, మృతురాలి బంధువు

 విచారించి చర్యలు తీసుకుంటాం
ఆత్మకూరులో 108 ఆంబులెన్స్‌ సేవల జాప్యంపై విచారిస్తాం. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు ఎక్కువగా ఉండటం వల్ల జిల్లాలోని 57 ఆంబులెన్స్‌ సర్వీసులు రద్దీగా ఉన్నాయి. ఆత్మకూరు డివిజన్‌ పరిధిలోని ఆంబులెన్స్‌లు శనివారం ఉదయం ఎన్ని సర్వీసులు నడిచాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లాయి అనే వివరాలను జీపీఎస్‌ ద్వారా పరిశీలిస్తాం. సిబ్బంది ఎక్కడైనా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటే తప్పక చర్యలు తీసుకుంటాం.
 - చంద్రమౌళి, 108 జిల్లా ఆర్డినేటర్‌, కర్నూలు


Updated Date - 2021-05-09T05:13:19+05:30 IST