అంబులెన్స్‌ లేక అగచాట్లు

ABN , First Publish Date - 2022-06-29T06:28:10+05:30 IST

కంభం ప్రభుత్వ వైద్యశాలలో అంబులెన్స్‌ సౌకర్యం లేకపోవడంతో కంభం, బేస్తవారపేట, అర్థవీడు మండలాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అంబులెన్స్‌ లేక అగచాట్లు
మూలనపడిన అంబులెన్‌

కంభం, జూన్‌ 28 : కంభం ప్రభుత్వ వైద్యశాలలో అంబులెన్స్‌ సౌకర్యం లేకపోవడంతో కంభం, బేస్తవారపేట, అర్థవీడు మండలాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి అంబులెన్స్‌ పదేళ్ల క్రితం ప్రమాదానికి గురై మూలన పడింది. అప్పటి నుంచి మరమ్మతులు చేయలేదు. దీంతో  క్షతగాత్రులను కంభం ప్రభుత్వ వైద్యశాల నుంచి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు, గుంటూరు, కర్నూలు తదితర వైద్యశాలలకు తరలించడానికి ఎన్నో వ్యయప్రయాసలు ఎదుర్కోవలసి వస్తున్నదని రోగులు పేర్కొంటున్నారు. అర్థవీడు, బేస్తవారపేట లోయల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు, ఒంగోలు, కర్నూలు తదితర ప్రాంతాలకు తరలించాల్సి వస్తోంది. అంబులెన్స్‌ లేకపోవడంతో ప్రత్యామ్నాయం చూపే లోపు పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కంభం వైద్యశాల 50 పడకల వైద్యశాలగా మారినా అంబులెన్స్‌ సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పటికైనా అంబులెన్స్‌ వచ్చేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-06-29T06:28:10+05:30 IST