కరోనా సోకి ప్రాణాల కోసం పోరాడుతుంటే.. వీళ్లు మాత్రం దోచేస్తున్నారు..!

ABN , First Publish Date - 2021-05-09T19:47:30+05:30 IST

‘ఇష్టం ఉంటే ఎక్కండి లేదా వదిలేయండి ’ అంటూ

కరోనా సోకి ప్రాణాల కోసం పోరాడుతుంటే.. వీళ్లు మాత్రం దోచేస్తున్నారు..!

  • మూడు కి.మీ.లకు రూ. 4 వేలు
  • ప్రైవేట్‌ అంబులెన్స్‌ నిర్వాహకుల నయా దందా
  • కరోనా కష్టకాలంలో అడ్డగోలు దోపిడీ  
  • ఆక్సిజన్‌ ఉంటే ఒక రేటు... లేకుండా మరో రేటు

హైదరాబాద్/మంగళ్‌హాట్‌ : కరోనా సోకి ప్రాణాల కోసం పోరాడుతున్న రోగులను కొందరు ప్రైవేట్‌ అంబులెన్స్‌ నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నారు. కిలో మీటర్‌కు రూ. వెయ్యి చొప్పున వసూలు చేస్తూ రోగి బంధువులకు చుక్కలు చూపిస్తున్నారు. అమీర్‌పేట్‌ నుంచి కింగ్‌కోఠికి అంబులెన్స్‌లో వచ్చేందుకు అయ్యే ఖర్చు ఎక్కువలో ఎక్కువ రూ. వెయ్యి. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో రూ.5వేలు వసూలు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ‘ఇష్టం ఉంటే ఎక్కండి లేదా వదిలేయండి ’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రికి ప్రైవేట్‌ అంబులెన్స్‌లలో వచ్చిన రోగి బంధువులు రూ.వేలు సమర్పించుకోవడం గమనార్హం. 


అమీర్‌పేట్‌కు చెందిన ఓ వృద్ధురాలికి ఆయాసం అధికంగా ఉండడంతో కొవిడ్‌ పరీక్షల నిమిత్తం ప్రైవేట్‌ అంబులెన్స్‌లో కింగ్‌కోఠి ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆక్సిజన్‌ పెట్టినందుకు రూ. 5 వేలు వసూలు చేయడంతో సదరు వృద్ధురాలి బంధువులు చేసేది లేక డబ్బులు చెల్లించారు. మల్లేపల్లి నుంచి కింగ్‌కోఠి ఆస్పత్రికి మధ్య దూరం కేవలం 3 కి.మీ. ఓ కొవిడ్‌ రోగి పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్‌లో తీసుకువచ్చినందుకు రూ. 4 వేలు తీసుకున్నారు. అదే ఆక్సిజన్‌ లేకుండా రోగిని తీసుకువచ్చేందుకు రూ. 2500 నుంచి రూ. 3 వేలు అడుగుతున్నారు. ఆక్సిజన్‌ ఉంటే ఒక రేటు, లేకపోతే మరో రేటుగా విభజించి వసూళ్లకు పాల్పడుతున్నారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 35 నుంచి 45 మంది ప్రైవేట్‌ అంబులెన్స్‌లలోనే వచ్చారు. ఇక గాంధీ, సరోజినీ దేవి ఇలా అన్ని ఆస్పత్రుల వద్దా పరిస్థితి ఇలానే ఉందని, కొవిడ్‌ రోగి అనగానే అడ్డగోలుగా డబ్బులు అడుగుతున్నారని రోగి సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-05-09T19:47:30+05:30 IST