అంబులెన్స్‌లను ఆపొద్దు : ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ABN , First Publish Date - 2021-05-11T21:20:08+05:30 IST

సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపివేయవద్దని తెలంగాణకు సర్కార్‌‌ను హైకోర్టు ఆదేశించింది. సరిహద్దుల్లో

అంబులెన్స్‌లను ఆపొద్దు : ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపివేయవద్దని తెలంగాణకు సర్కార్‌‌ను హైకోర్టు ఆదేశించింది. సరిహద్దుల్లో అంబులెన్స్‌ నిలిపివేతపై ఆదేశాలేమైనా ఉన్నాయా? అని సూటిగా ప్రశ్నించింది. అయితే లిఖిత పూర్వకంగా ఎలాంటి ఆదేశాలూ లేవని ఏజీ హైకోర్టుకు నివేదించారు. అయితే మౌఖిక ఆదేశాలేమైనా ఉన్నాయా? అని మరో ప్రశ్న వేసింది. ఈ విషయాన్ని సీఎస్‌ను అడిగి చెబుతామని ఏజీ పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీకి కూడా ఎంతో మంది పేషెంట్లు ఎన్నో రాష్ట్రాల నుంచి వస్తుంటారని, అలా అని ఢిల్లీలో అంబులెన్స్‌లను ఆపేస్తున్నారా? అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఆపడమేంటని అసహనం వ్యక్తం చేసింది. 


గతంలో తాము సూచించినట్లు మొబైల్ టెస్టులను కూడా చేయలేకపోయారని, కానీ ఇప్పుడేమో అంబులెన్స్‌లను మాత్రం ఆపేస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్ అనేది ఓ మెడికల్ హబ్ అని, ఆరోగ్యం కోసం ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారని పేర్కొంది. ప్రజలను ఇక్కడికి రావొద్దని చెప్పడానికి ప్రభుత్వానికి ఏం అధికారం ఉందని నిలదీసింది. హాస్పిటల్ లో వైద్యం కోసం వచ్చే వారిని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నిచింది. కేర్, అపోలో ఆస్పత్రిలో అంతర్జాతీయ రోగులు కూడా ఉంటారని, అలాగని వారిని కూడా అడ్డుకుంటారా? అని చురకలంటించింది. అయితే ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్నాటక నుంచి ఆర్‌ఎంపీ ప్రిస్క్రిప్షన్‌తో ఇక్కడికి వస్తున్నారని ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

Updated Date - 2021-05-11T21:20:08+05:30 IST