అగ్రరాజ్యం అమెరికాలో తొలి Omicron మరణం..!

ABN , First Publish Date - 2021-12-21T16:07:52+05:30 IST

ప్రపంచ దేశాలను కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ మరోసారి భయం గుప్పిట్లోకి నెట్టేసింది.

అగ్రరాజ్యం అమెరికాలో తొలి Omicron మరణం..!

వాషింగ్టన్: ప్రపంచ దేశాలను కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ మరోసారి భయం గుప్పిట్లోకి నెట్టేసింది. శరవేగంగా ప్రబలుతున్న ఈ వేరియంట్ ఇప్పటికే 90 దేశాల వరకు పాకింది. అటు ఒమైక్రాన్ మరణాలు కూడా నమోదవుతున్నాయి. బ్రిటన్‌లో ఇప్పటివరకు 12 మంది కొత్త వేరియంట్ కారణంగా మృత్యువాత పడ్డారని అక్కడి అధికారులు తెలిపారు. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో తొలి మరణం నమోదైంది. టెక్సాస్ రాష్ట్రం హర్రిస్ కౌంటీలో సోమవారం ఓ వ్యక్తి ఒమైక్రాన్‌తో చనిపోయినట్లు కౌంటీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా,  దీనిపై యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) వెంటనే స్పందించేందుకు నిరాకరించింది. ఇక మృతిచెందిన వ్యక్తి వయసు 50-60 ఏళ్ల మధ్య ఉంటుందని ఆరోగ్యశాఖ పేర్కొంది. 


కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో తీవ్రమైన కోవిడ్ లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు చనిపోయినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కౌంటీ న్యాయమూర్తి లీనా హిడాల్గో కూడా దేశంలో సంభవించిన తొలి ఒమైక్రాన్ మరణంపై ట్వీట్ చేశారు. అందరూ టీకా తీసుకుని మహమ్మారి నుంచి రక్షణ పొందాలని ఈ సందర్భంగా ఆమె ప్రజలను కోరారు. డిసెంబర్ 18తో ముగిసిన వీక్లీ సీక్వెన్సింగ్ డేటా ప్రకారం యూఎస్ కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్‌లలో 73 శాతం ఒమైక్రాన్ వేరియంట్‌‌ది అని సీడీసీ సోమవారం తెలియజేసింది. ఇక డిసెంబర్ ప్రారంభంలో ప్రపంచంలోనే ఒమైక్రాన్ మొదటి మరణం బ్రిటన్‌లో నమోదైంది. ఇప్పటి వరకు 12 మంది ఈ వేరియంట్‌తో మరణించగా, 104 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారని ఆ దేశ ఉప ప్రధాని డొమినిక్ రాబ్ సోమవారం మీడియాకు వెల్లడించారు. 

Updated Date - 2021-12-21T16:07:52+05:30 IST