అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న Omicron.. తొలి మరణంతో ఉలిక్కిపడ్డ అమెరికన్స్..!

ABN , First Publish Date - 2021-12-22T19:39:46+05:30 IST

క్రిస్మస్‌ పండుగ ముంగిట.. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ అమెరికాను వణికిస్తోంది. గత వారంలో నమోదైన 6.50 లక్షల కేసుల్లో 73 శాతం ఒమైక్రాన్‌వే కావడం గమనార్హం. ఏడు రోజుల్లో ఏకంగా ఆరు రెట్లు కేసులు పెరిగాయని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) పేర్కొంది. న్యూయార్క్‌, ఆగ్నేయ రాష్ట్రాల్లో 90 శాతంపైగా కేసులు ఒమైక్రాన్‌వేనని చెప్పింది.

అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న Omicron.. తొలి మరణంతో ఉలిక్కిపడ్డ అమెరికన్స్..!

న్యూయార్క్‌: క్రిస్మస్‌ పండుగ ముంగిట.. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ అమెరికాను వణికిస్తోంది. గత వారంలో నమోదైన 6.50 లక్షల కేసుల్లో 73 శాతం ఒమైక్రాన్‌వే కావడం గమనార్హం. ఏడు రోజుల్లో ఏకంగా ఆరు రెట్లు కేసులు పెరిగాయని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) పేర్కొంది. న్యూయార్క్‌, ఆగ్నేయ రాష్ట్రాల్లో 90 శాతంపైగా కేసులు ఒమైక్రాన్‌వేనని చెప్పింది. దక్షిణాఫ్రికా, యూకే, డెన్మార్‌లలోని పరిస్థితులను చూశాక.. తమ దేశంలో అనూహ్య వ్యాప్తి ఆశ్చర్యం కలిగించడం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. 3 నుంచి 8 వారాల్లో లక్షలాది మంది ఒమైక్రాన్‌ బారినపడే ప్రమాదం ఉందని మిన్నెసోటా వర్సిటీలోని సెంటర్‌ ఫర్‌ ఇన్ఫెక్షియస్‌ డిసీజ్‌ రీసెర్చ్‌ అండ్‌ పాలసీ విభాగం డైరెక్టర్‌ మైఖేల్‌ ఓస్టర్‌హామ్‌ హెచ్చరించారు.


దీంతో ఫెడరల్‌ ప్రభుత్వ వైద్య వసతులను సిద్ధం చేస్తోంది. 50 కోట్ల యాంటీజెన్‌ టెస్టు పరికరాలను కొనుగోలు చేయాలని చూస్తోంది. ఏడు రాష్ట్రాలకు వైద్య బృందాలను పంపుతోంది. కాగా, అగ్రరాజ్యంలో ఒమైక్రాన్‌తో తొలి మరణం నమోదైంది. టెక్సాస్‌ కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి కొత్త వేరియంట్‌తో మృతి చెందాడు. ఇతడు టీకా పొందలేదు. ఇక అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి ఇటీవల విమానంలో ప్రయాణించిన శ్వేతసౌధ ఉద్యోగి ఒకరికి కొవిడ్‌ సోకింది. ఈ నేపథ్యంలో బైడెన్‌కు  టెస్టులు చేయగా.. నెగెటివ్‌ వచ్చింది.

Updated Date - 2021-12-22T19:39:46+05:30 IST