డ్రాగన్‌ కంపెనీలపై అమెరికా గుస్సా

ABN , First Publish Date - 2020-08-08T06:17:05+05:30 IST

ఆర్థికంగా చైనాను కట్టడి చేసేందుకు అమెరికా మరిన్ని చర్యలు చేపట్టింది. నాస్‌డాక్‌, న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజీల్లో తమ షేర్లను నమోదు (లిస్టింగ్‌) చేసిన చైనా కంపెనీలు.. తమ ఆడిట్‌ ప్రమాణాలు పాటించాలని అమె రికా స్పష్టం చేసింది...

డ్రాగన్‌ కంపెనీలపై అమెరికా గుస్సా

  • ఆడిట్‌ ప్రమాణాలు పాటిస్తేనే లిస్టింగ్‌

వాషింగ్టన్‌: ఆర్థికంగా చైనాను కట్టడి చేసేందుకు అమెరికా మరిన్ని చర్యలు చేపట్టింది. నాస్‌డాక్‌, న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజీల్లో తమ షేర్లను నమోదు (లిస్టింగ్‌) చేసిన చైనా కంపెనీలు.. తమ ఆడిట్‌ ప్రమాణాలు పాటించాలని అమె రికా స్పష్టం చేసింది. లేకపోతే ఆ కంపెనీల షేర్లను డీలిస్ట్‌ చేస్తామని హెచ్చరించింది. అమెరికన్‌ కంపెనీలకు వర్తించే ఆడిట్‌ నిబంధనలను చైనా కంపెనీలు పాటిస్తేనే కొత్తగా మార్కెట్లో లిస్టయ్యేందుకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. అమెరికా ప్రభుత్వ తాజా నిర్ణయంతో యూఎస్‌ స్టాక్‌ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్‌ ద్వారా పెద్ద మొత్తంలో నిధులు సమీకరించాలనుకునే చైనా కంపెనీలకు  దారులు మూసుకుపోయినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే నాస్‌డాక్‌, న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్సేంజ్‌ల్లో లిస్టయిన అలీబాబా వంటి చైనా దిగ్గజ కంపెనీలు 2022 నాటికల్లా అమెరికా ఆడిట్‌  ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది.  లేని పక్షంలో ఈ కంపెనీల షేర్లను డీలిస్ట్‌ చేస్తామని ట్రంప్‌ సర్కార్‌ స్పష్టం చేసింది.  


ప్రకంపనలు  

మరోవైపు భారత్‌ తరహాలోనే చైనాకు చెందిన టిక్‌టాక్‌, వియ్‌చాట్‌ యాప్‌లను నిషేధిస్తున్నట్టు ట్రంప్‌ సర్కార్‌ ప్రకటించింది. దీంతో శుక్రవారం చైనా స్టాక్‌ మార్కెట్‌ తీవ్ర ఆటుపోట్లకు లోనైంది. వియ్‌చాట్‌ యాప్‌ మాతృసంస్థ టెన్సెంట్‌ హోల్డింగ్‌ కంపెనీ షేర్లు కుప్పకూలాయి. ఒక దశలో ఈ కంపెనీ షేర్లు పది శాతానికి పైగా నష్టపోయాయి. దీంతో టెన్సెంట్‌ మార్కెట్‌ క్యాప్‌ 4,600 కోట్ల డాలర్లు (సుమారు రూ.3.45 లక్షల కోట్లు) తుడిచి పెట్టుకుపోయింది. డాలర్‌తో చైనా కరెన్సీ యువాన్‌ మారకం రేటు కూడా రెండు వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది.


మూల్యం తప్పదు : ట్రంప్‌ 

చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలపైకి  కరోనాను ఎగదోసిన చైనా అందుకు మూల్యం చెల్లించక తప్పదన్నారు. వచ్చే నాలుగేళ్లలో ఔషదాలు, వైద్య పరికరాల కోసం చైనా, ఇతర దేశాలపై ఆదారపడటాన్ని తగ్గించేస్తామన్నారు. 


ఆగని చైనా ఎగుమతులు 

అమెరికాతో వాణిజ్య యుద్ధం, ఇతర ఉద్రికత్తలు కొనసాగుతున్నప్పటికీ చైనా ఎగుమతులకు మాత్రం బ్రేక్‌ పడడం లేదు. జులై నెలలో చైనా ఎగుమతులు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 7.5 శాతం పెరిగాయి. ఇదే సమయంలో అమెరికాకు ఎగుమతులు 12.5 శాతం పెరగటం గమనార్హం. 

Updated Date - 2020-08-08T06:17:05+05:30 IST