రష్యాకు భారత్ దూరమవాలి : అమెరికా దౌత్యవేత్త

ABN , First Publish Date - 2022-04-09T19:39:49+05:30 IST

సుదీర్ఘ చరిత్రగల అలీన విధానం నుంచి భారత్ దూరమవాలని

రష్యాకు భారత్ దూరమవాలి : అమెరికా దౌత్యవేత్త

వాషింగ్టన్ : సుదీర్ఘ చరిత్రగల అలీన విధానం నుంచి భారత్ దూరమవాలని తాము కోరుతున్నట్లు అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వెండీ షెర్మన్ విదేశీ వ్యవహారాల కమిటీకి తెలిపారు. రష్యాతో జీ77 భాగస్వామ్యం నుంచి భారత్ వైదొలగితే బాగుంటుందన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సౌభాగ్యం, భద్రతలకు ముఖ్యమైన అనేక విజయాలతో ముందుకెళ్తున్న భారత్-అమెరికా మధ్య రక్షణ రంగంలో వాణిజ్యాన్ని పెంచుకోవడానికి గొప్ప అవకాశాలు ఉన్నాయన్నారు. 


ఇటీవల జరిగిన కంగ్రెషనల్ హియరింగ్‌లో విదేశీ వ్యవహారాల కమిటీ సమక్షంలో వెండీ షెర్మన్ మాట్లాడుతూ, భారత దేశంతో అమెరికాకు చాలా ముఖ్యమైన సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారత దేశమని చెప్పారు. భారత్-అమెరికా మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని తెలిపారు. క్వాడ్‌ దేశాల కూటమిలో భారత్ ఉందన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంత సౌభాగ్యం, భద్రతల కోసం చాలా ముఖ్యమైన అనేక విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రష్యాతో సుదీర్ఘ చరిత్రగల అలీన జీ77 భాగస్వామ్యం నుంచి భారత్ దూరమవాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. 


రష్యాపై ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి విడి భాగాలను పొందడం, వాటిని మార్చుకోవడం కష్టమవుతుందని భారత్‌కు చెప్పినట్లు తెలిపారు. అమెరికాతో రక్షణ సంబంధాలను భారత్ పెంచుకుందని, రక్షణ రంగ ఉత్పత్తుల అమ్మకాలు, ఉమ్మడిగా ఉత్పత్తి చేయడానికి ప్రయత్నాలు పెరిగాయన్నారు. భవిష్యత్తులో ఈ సంబంధాలు మరింత పెరగడానికి గొప్ప అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. 


క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డయలాగ్ (క్వాడ్)లో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఉన్నాయి. 

Updated Date - 2022-04-09T19:39:49+05:30 IST