అమెరికా అమ్మాయి.. రాజాం అబ్బాయి.. వివాహ బంధంలో ఒక్కటైన ప్రేమ జంట!

ABN , First Publish Date - 2022-06-16T00:51:54+05:30 IST

ప్రేమకు జాతి కులమతాలేవీ అడ్డురావంటూ మరో ప్రేమ జంట తాజాగా వివాహం బంధంలో ఒక్కటైంది.

అమెరికా అమ్మాయి.. రాజాం అబ్బాయి.. వివాహ బంధంలో ఒక్కటైన ప్రేమ జంట!

రాజాం: ప్రేమకు జాతి కులమతాలేవీ అడ్డురావంటూ మరో ప్రేమ జంట తాజాగా వివాహం బంధంలో ఒక్కటైంది. అమెరికా అమ్మాయి మోర్గాన్‌ బ్రింక్‌... విజయనగరం జిల్లా రాజాం అబ్బాయి కందుల కిరణ్‌ల వివాహం బుధవారం రాజాంలో కన్నులపండువగా జరిగింది. భారత సంస్కృతి సంప్రదాయాలపై  అభిమానం పెంచుకున్న ఆమె ఇండియాకు వచ్చి మనసైన వాడితో తాళి కట్టించుకుంది. పెద్దలు నిర్ణయించిన సుముహూర్తాన హిందూ సంప్రదాయం ప్రకారం మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ఆలుమగలయ్యారు. స్థానికులను అబ్బురపరుస్తున్న ఈ వివాహ వేడుక పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజాం పట్టణంలోని అగ్రహారం వీధికి చెందిన కందుల కామరాజు రెండో కుమారుడు కిరణ్‌ భోపాల్‌లోని నిట్‌లో బీటెక్‌ చదువుకున్నాడు. రెండేళ్ల పాటు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసిన కిరణ్‌ 2015లో ఉన్నత చదువు కోసం అమెరికాకు వెళ్లాడు. ఓహియో రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్‌ సిమ్సినిటిలో ఎంఎస్‌లో చేరాడు. అదే యూనివర్సిటీలో బీబీఏ (బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌) చదువుతున్న మోర్గాన్‌ బ్రింక్‌తో పరిచయం ఏర్పడింది.  వారి పరిచయం పెరిగి స్నేహంగా మారి చివరకు ప్రేమగా వికసించింది. చదువు పూర్తయ్యాక ఆ యువ ప్రేమికులు మిచిగాన్‌ రాష్ట్రంలో డెట్రాయిట్‌ సిటీలో వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగాలు చేశారు. తమ బంధానికి పరిపూర్ణత ఇస్తూ వివాహం చేసుకోవాలనుకున్నారు. 


అయితే... హిందూ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వివాహ పద్ధతులు తెలుసుకున్న మోర్గన్ ఇండియాలోనే పెళ్లికి ఆసక్తి చూపింది. ఆమె మొదట తన నిర్ణయాన్ని తల్లిదండ్రులు టీనా బ్రింక్‌, ఎరిక్‌ బ్రింక్‌లకు చెప్పడంతో వారూ సరేనన్నారు. ఇక కందుల కామరాజు కుటుంబం కూడా వీరి ప్రేమకు అంగీకారం తెలిపింది. అయితే..  కరోనా సంక్షోభం కారణంగా రెండేళ్లుగా వాయిదా పడుడూ వస్తున్న వారి వివాహం తాజాగా బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.



Updated Date - 2022-06-16T00:51:54+05:30 IST