Student Visa లకు అధిక ప్రాధాన్యం: యూఎస్ దౌత్యాధికారిణి

ABN , First Publish Date - 2021-10-29T23:53:54+05:30 IST

కరోనా నేపథ్యంలో విధించిన ప్రయాణ ఆంక్షలను తొలగిస్తున్నట్లు ఇటీవల అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే.

Student Visa లకు అధిక ప్రాధాన్యం: యూఎస్ దౌత్యాధికారిణి

కోల్‌కతా: కరోనా నేపథ్యంలో విధించిన ప్రయాణ ఆంక్షలను తొలగిస్తున్నట్లు ఇటీవల అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న విదేశీయులు నవంబర్ 8 నుంచి తమ దేశానికి రావచ్చని శ్వేతసౌధం వెల్లడించింది. దీంతో భారత్‌ సహా పలు దేశాల వారికి అమెరికా వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో వీసాల జారీ విషయమై ఆ దేశ దౌత్యాధికారిణి ఒకరు బుధవారం కీలక ప్రకటన చేశారు. త్వరలోనే వీసా దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుందని, స్టూడెంట్ వీసాలకు అమెరికా తొలి ప్రాధాన్యం ఇవ్వనుందని ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ)తో భేటీ అయిన కోల్‌కతాలోని యూఎస్ కాన్సుల్ జనరల్ మెలిందా పవేక్ పేర్కొన్నారు. "అమెరికా ప్రయాణ ఆంక్షలను తొలిగిస్తున్నట్లు ప్రకటించిన దరిమిలా వీసాల కోసం నవంబర్ 1వ తేదీ నుంచి అపాయింట్‌మెట్స్ ప్రారంభమవుతాయి. స్టూడెంట్ వీసాలకే ప్రాధాన్యం ఉంటుంది" అని ఆమె అన్నారు.


2021లో ఇప్పటికే 62వేల మంది భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం వీసాలు మంజూరు చేసిందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక నవంబర్ 8తో ఆంక్షలన్ని తొలగిపోనున్నాయి కనుక అప్పటి నుంచే అన్ని వీసాల దరఖాస్తులు ప్రారంభమవుతాయని పవేక్ చెప్పుకొచ్చారు. అటు కాన్సుల్ అధికారులు సైతం ఇదే విషయాన్ని ధృవీకరించారు. వచ్చే నెల నుంచి అన్ని రకాల వీసాలకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదిలాఉంటే.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఆగస్టు వరకు ఇప్పటికే 50 శాతం కోలుకుందని, ఈ ఏడాది చివరి నాటికి 2019 ప్రీ-కోవిడ్ స్థాయికి చేరుకుంటుందని ఐసీసీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.     

Updated Date - 2021-10-29T23:53:54+05:30 IST