అట్టహాసంగా ప్రారంభమైన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) వేడుకలు

Dec 6 2021 @ 12:18PM

ఎన్నారై డెస్క్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) వేడుకలు డిసెంబర్ 5న ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. మూడు వారాలపాటు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్టు వెల్లడించారు. డిసెంబర్ 26 తారీకున రవీంద్ర భారతిలో గ్రాండ్ ఫినాలే నిర్వహించనన్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాతృభూమి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆటా ప్రతినిధులు చెప్పారు. ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల మరియు ప్రెసిడెంట్ ఎలెక్ట్,ఆటా వేడుకలు చైర్ మధు బొమ్మినేని గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటా వేడుకలు కార్యక్రమానికి కో-చైర్ గా అట్లాంటాకి చెందిన అనిల్ బొద్దిరెడ్డి మరో కో-చైర్ గా న్యూ జెర్సీకి చెందిన శరత్ వేముల వ్యవహరిస్తున్నారు. ఆటా 17వ మహాసభలు వాషింగ్టన్ డీసీలో జులైలో 1-3 తేదీలలో నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే సేవ కార్యక్రమాలు, వేడుకలను మూడు వారల పాటు డిసెంబర్  5 నుంచి 26 వరకు నిర్వహిస్తున్నారు.


ఇందులో భాగంగానే.. మహిళా సాధికారత కోసం వరంగల్ జిల్లా మహిళలకు కుట్టు మెషిన్‌లో ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతోంది. విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి ఆటా ప్రతినిధులు కుట్టు మెషిన్‌లు ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా..నల్గొండలోని మహిళల కోసం క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు ఉభయ రాష్ట్రాల్లో కంటి పరీక్షల క్యాంపులను నిర్వహించి పేదలకు ఉచితంగా మందులు పంపిణి చేయనున్నారు. వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ స్కూల్లలో మౌలిక సౌకర్యాలను కల్పించనున్నారు.


డిసెంబర్ 10న అనాథ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అంతేకాకుండా పలు సాంస్కృతిక కార్యక్రమానుల నిర్వహించబోతున్నట్టు ఆటా ప్రతినిధులు వెల్లడించారు. అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకునేప్పుడు పాటించవలసిన నియమాలు తెలియపరిచేందుకు.. అమెరికన్ కన్సుల్టే ప్రతినిధులు మరియు తెలంగాణ విద్యాశాఖ అధికారులతో కార్యక్రమం నిర్వహించబోతున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాలలో ఇండియాలో ఉన్న ప్రవాసులు మరియు ప్రజలు విరివిగా పాలుపంచుకోవాలని ఆటా కార్యవర్గ సభ్యులు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే.. కొవిడ్ సమయంలో 600 పైగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వ ఆసుప్రతులలో ఆటా ప్రతినిధులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. 


Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.