థర్డ్‌వేవ్ ముప్పు:సెప్టెంబర్ నెలాఖరుకి మళ్లీ ఆంక్షలు

ABN , First Publish Date - 2021-09-03T20:10:51+05:30 IST

కరోనా థర్డ్ వేవ్‌కు అవకాశాలు ఉండటంతో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ నెలాఖరు..

థర్డ్‌వేవ్ ముప్పు:సెప్టెంబర్ నెలాఖరుకి మళ్లీ ఆంక్షలు

ముంబై: కరోనా థర్డ్ వేవ్‌కు అవకాశాలు ఉండటంతో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ నెలాఖరు నుంచి తిరిగి ఆంక్షలు అమలు చేసే ఆలోచనలో ఉంది. నైట్ కర్ఫ్యూ విధించడం కానీ, పండుగలు, పబ్లిక్ మీటింగ్‌లకు హాజరయ్యే వారి సంఖ్యను సవరించడం కానీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ముంబై గార్డియన్ మినిస్టర్ అస్లాం షేఖ్ దీనిపై మాట్లాడుతూ, కరోనా కేసులు పెరుగుతూపోతే ఈ నెలాఖరు నాటికి తిరిగి ఆంక్షలు అమల్లోకి తెస్తామని చెప్పారు. ప్రజలు కోవిడ్ నిబంధనలను సక్రమంగా పాటిస్తే కేసులు పెరిగే అవకాశాలు ఉండవని అన్నారు.


థర్డ్ వేవ్ వస్తే కేసుల సునామీనే...

కోవిడ్ థర్డ్ వేవ్‌ అంటూ వస్తే మహారాష్ట్రలో 60 లక్షల కేసులు చూడాల్సి వస్తుందని థాకరే సర్కార్ హెచ్చరించింది. మొదటి వేవ్‌లో 20 లక్షల మంది కరోనా బారినపడితే, రెండో వేవ్‌లో 40 లక్షల కేసులు నమోదయ్యాయని, థర్డ్ వేవ్‌ వస్తే కేసులు 60 లక్షలకు పెరిగే అవకాశాలు ఉండవచ్చని ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపో అన్నారు. వీరిలో 12 శాతం మందికి చికిత్స సమయంలో ఆక్సిజన్ సపోర్ట్ అవసరం ఉంటుందని, సాధ్యమైనంత త్వరగా 100 శాతం వ్యాక్సినేషన్‌కు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.


కాగా, నెలాఖరు నుంచి తిరిగి ఆంక్షలు విధించే విషయంలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆరోగ్య, ఇతర శాఖలకు చెందిన వైద్యులు, అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్‌తో సీఎం త్వరలో సమావేశం కానున్నారు.

Updated Date - 2021-09-03T20:10:51+05:30 IST