రష్యా-ఉక్రెయిన్ యుద్ధం : ఆపదలో ఆదుకుంటున్న ఇండియన్ రెస్టారెంట్

ABN , First Publish Date - 2022-03-03T00:04:00+05:30 IST

జీవనోపాధి వెతుక్కుంటూ ఉక్రెయిన్ వెళ్ళిన భారతీయుడు సంక్షోభంలో

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం : ఆపదలో ఆదుకుంటున్న ఇండియన్ రెస్టారెంట్

కీవ్ : జీవనోపాధి వెతుక్కుంటూ ఉక్రెయిన్ వెళ్ళిన భారతీయుడు సంక్షోభంలో ఉన్న ఆ దేశవాసులను మానవత్వంతో ఆదుకుంటున్నారు. ఈ ఏడాది జనవరిలో ఆయన కీవ్ నగరంలో ‘సాథియా’ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభమవడంతో నగరవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ సమయంలో వారికి తన చేతనైనంత సాయం చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. తన రెస్టారెంట్‌ను వసతి గృహంగా మార్చేశారు. 


ఉక్రెయిన్‌లోని స్థానిక మీడియా కథనాల ప్రకారం, గుజరాత్‌లోని వడోదరకు చెందిన మనీష్ దవే 2021 అక్టోబరులో జీవనోపాధి కోసం ఉక్రెయిన్ వెళ్ళారు. ఈ ఏడాది జనవరిలో ‘సాథియా’ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఇంతలోనే యుద్ధం రావడంతో నగరవాసులు తినడానికి ఆహారం, ఉండటానికి వసతి కరువై ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో నిరాశ్రయులైనవారికి చేతనైనంతగా సాయపడాలని మనీష్ నిర్ణయించుకున్నారు. 


బేస్‌మెంట్‌లో నిర్వహిస్తున్న తన రెస్టారెంట్‌ను వసతి గృహంగా మార్చేశారు. ప్రస్తుతం ఆ రెస్టారెంట్‌లో దాదాపు 125 మంది ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో బాలలు, గర్భిణులు కూడా ఉన్నారు. వీరికి ఉచితంగా ఆహారాన్ని కూడా ఆయన అందిస్తున్నారు. 


అమెరికన్ మీడియాతో మనీష్ దవే మాట్లాడుతూ, అంతా సజావుగానే జరిగేదని, అకస్మాత్తుగా యుద్ధం ముంచుకొచ్చిందని చెప్పారు. ఎక్కడ చూసినా కాల్పుల మోతలు, క్షిపణి దాడులతో నగరం దద్దరిల్లుతోందన్నారు. ప్రజలంతా భయంతో వణికిపోతున్నారని చెప్పారు. వరుసగా పేలుళ్ళు సంభవించడంతో తాను తన రెస్టారెంట్‌ను వసతి గృహంగా మార్చేశానని చెప్పారు. తన కస్టమర్లలో అత్యధికులు విద్యార్థులేనని, అందువల్ల మొదట విద్యార్థులకు ఆశ్రయం ఇచ్చానని చెప్పారు. అవసరంలో ఉన్నవారెవరైనా వసతి కోసం, ఆహారం కోసం తనను సంప్రదించవచ్చునని ట్విటర్ ద్వారా ఆహ్వానించానని చెప్పారు. 


ఆయన ఇచ్చిన ట్వీట్‌లో, తనకు సాద్యమైనంత వరకు ఉచిత వసతి, ఆహారం అందజేయడానికి ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు. కష్టకాలంలో ఉక్రెయిన్‌కు అండగా నిలుద్దామని ప్రకటించారు.  దీంతో ఆయనకు సంఘీభావంగా చాలా మంది ముందుకు వచ్చారు. కూరగాయలు, ఆహార ధాన్యాలు, బియ్యం వంటివాటిని విరాళంగా ఇస్తున్నారు. మనీష్ కృషిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 


Updated Date - 2022-03-03T00:04:00+05:30 IST