నేడు నిర్మల్‌కు అమిత్‌ షా రాక

ABN , First Publish Date - 2021-09-17T05:08:22+05:30 IST

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా శుక్రవారం నిర్మల్‌ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఈ మేరకు హోంమంత్రి పర్యటనకు సంబంధించి భారీ ఎత్తున భద్రత చర్యలు చేపట్టారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో అమిత్‌ షా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వెయ్యి ఉరుల మర్రి వద్ద గల పోరాట యోధుల స్మారక స్తూపానికి అమిత్‌ షా నివాళులు అర్పించనున్నారు.

నేడు నిర్మల్‌కు అమిత్‌ షా రాక
నిర్మల్‌ జిల్లా కేంద్రం సమీపంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్న దృశ్యం

కేంద్ర హోంమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం

ఎస్పీజీ బలగాలతో పటిష్ఠ భద్రత

భారీ జన సమీకరణలో బీజేపీ నాయకులు

నిర్మల్‌, సెప్టెంబరు 16 (ఆంధ్ర జ్యోతి) : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా శుక్రవారం నిర్మల్‌ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఈ మేరకు హోంమంత్రి పర్యటనకు సంబంధించి భారీ ఎత్తున భద్రత చర్యలు చేపట్టారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో అమిత్‌ షా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వెయ్యి ఉరుల మర్రి వద్ద గల పోరాట యోధుల స్మారక స్తూపానికి అమిత్‌ షా నివాళులు అర్పించనున్నారు. ఆ తరువాత ఎల్ల పెల్లి క్రషర్‌ రోడ్డు సమీపంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఇందుకోసం బీజేపీ శ్రేణులు పది రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి వస్తుండడంతో అధికార యంత్రాంగం కూడా సీరియస్‌గానే తీసుకుంటోంది. పార్టీ వర్గాలు సైతం అమిత్‌ షా సభకు దాదాపు లక్ష మందిని సమీకరించనున్నట్టు ప్రకటించారు. దీంతో అటు బీజేపీ వర్గాలు, ఇటు అధికార యంత్రాంగమంతా వారం రోజుల నుంచి అమి త్‌ షా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో తలమునకలవుతోంది. ఇక్కడి ఎల్లపెల్లి క్రషర్‌ రోడ్డు సమీపంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభాస్థలికి సమీపంలోనే హెలిప్యాడ్‌ను కూడా నిర్మించారు. ఇప్పటికే నిర్మల్‌ పట్టణంలో అమిత్‌ షాకు స్వాగతం పలుకుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా భారీ ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్‌లు, బ్యానర్‌లను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లు, అన్ని మార్గాలు కాషాయమయమైపోయాయి. అమిత్‌ షా పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున జన సమీకరణపై దృష్టి పెట్టారు. ఇప్పటికే మండల, గ్రామస్థాయిల్లో పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించిం చారు. పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులంతా నిర్మల్‌లోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. లక్ష మందికి తగ్గకుండా అమిత్‌ షా సభకు జనం హాజరయ్యేట్లు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా అమిత్‌ షా పాల్గొనే బహిరంగ సభా వేదికనే కాకుండా ఆయన పర్యటించే మార్గాన్ని అంతా గురువారమే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సభా వేదిక ప్రాంగణమంతా వర్షం వచ్చినా తడిచిపోకుండా ఏర్పాటు చేశారు. సభా వేదికకు సంబంధించి నాగ్‌పూర్‌ నుంచి ప్రత్యేకంగా సామగ్రిని తెప్పించారు. ఈ సభా వేదిక శత్రు దుర్భేద్యంగా ఏర్పాటైంది. ఎస్పీజీ, సీఆర్‌పీఎఫ్‌ దళాలు భద్రత చర్యల్లో పాల్గొంటున్నాయి. దీంతో పాటు స్థానికంగా 350 మందికిపైగా పోలీసు అధికారులు, సిబ్బంది భద్రత చర్యల్లో నిమగ్నమయ్యారు. గురువారం భద్రతకు సంబంధించి నాలుగు హెలికాప్టర్‌ల ద్వారా ఏరియల్‌ సర్వే కూడా నిర్వహించారు.

అమిత్‌షా పర్యటన షెడ్యూల్‌ ఇలా..

మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్మల్‌కు రాక

మొదట తెలంగాణ సాయుధ పోరాట వీరుల స్మారక స్తూపానికి నివాళి రాక

అక్కడి నుంచి నేరుగా బహిరంగ సభాస్థలికి

గంటన్నర పాటు కొనసాగనున్న బహిరంగ సభ

సాయంత్రం హెలికాప్టర్‌లో తిరిగి ఢిల్లీకి పయనం

Updated Date - 2021-09-17T05:08:22+05:30 IST