Modi Leadership : మోదీపై ప్రజలకు గట్టి నమ్మకం : అమిత్ షా

ABN , First Publish Date - 2022-05-12T00:31:13+05:30 IST

సర్వతోముఖాభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం

Modi Leadership : మోదీపై ప్రజలకు గట్టి నమ్మకం : అమిత్ షా

న్యూఢిల్లీ : సర్వతోముఖాభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. మోదీ నాయకత్వంపై ప్రజలకు గట్టి నమ్మకం ఉందని, ఆయనను వారు తమ మనసు లోతుల నుంచి ప్రేమిస్తున్నారని తెలిపారు. Modi @ 20: Dreams Meet Delivery పుస్తకావిష్కరణ సభలో ఆయన బుధవారం మాట్లాడారు. 


మోదీ (Narendra Modi) నాయకత్వంపై భారతీయులకు గొప్ప నమ్మకం ఉందని, వారు తమ మనసు లోతుల నుంచి ఆయనను ప్రేమిస్తున్నారని Amit Shah చెప్పారు. ఆయన ఎటువంటి కుటుంబ నేపథ్యం లేకుండానే దేశ నాయకునిగా ఎదిగారని, ఇది చాలా ముఖ్యమైన విషయమని తెలిపారు. ఆయన నాయకత్వంలో బీజేపీ (BJP) అన్ని ప్రాంతాలకు విస్తరించిందన్నారు. అంతేకాకుండా పార్టీపై ప్రచారమైన అనేక ప్రతికూల అంశాలు పటాపంచలయ్యాయన్నారు. బీజేపీ అంటే హిందీ మాట్లాడేవారి పార్టీ అని, కేవలం పట్టణ ప్రాంతాల్లోనే దీనికి పలుకుబడి ఉందని, రైతుల పార్టీ కాదని జరిగిన ప్రచారాలను ఆయన నాయకత్వంలో తిప్పికొట్టగలిగినట్లు తెలిపారు. 


మోదీ ప్రభుత్వం ప్రజలు ఇష్టపడటం కోసం కాకుండా, వారికి శ్రేయస్సు కలిగించే నిర్ణయాలను ఎటువంటి రాజకీయ ఆలోచనలు లేకుండా తీసుకుంటుందని చెప్పారు. అద్భుతాలు, కుటుంబ నేపథ్యం, రాజకీయ ప్రాపకం వంటివేవీ లేకుండానే 2014లో మోదీకి భారీ స్థాయిలో ప్రజా తీర్పు వచ్చిందన్నారు. 2019లో మరోసారి ప్రజాతీర్పు వచ్చిందన్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయమని తెలిపారు. మోదీని తమ నాయకునిగా ప్రజలు ఆమోదించారని దీనినిబట్టి స్పష్టమవుతోందన్నారు. వారు ఆయనను తమ మనసు లోతుల నుంచి ప్రేమిస్తున్నట్లు వెల్లడవుతోందన్నారు. ఆయన ప్రజల నమ్మకాన్ని సాధించారని చెప్పారు. 


అటు పార్టీ కోసం, ఇటు ప్రభుత్వం కోసం సమాన స్థాయిలో గొప్ప అంకితభావంతో పని చేస్తున్న ఏకైక నేత మోదీయేనని తెలిపారు. ఆయన నాయకత్వంలో బీజేపీ ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా, అత్యధిక రాష్ట్రాల్లో పని చేస్తున్న పార్టీగా  ఎదిగినట్లు తెలిపారు. 


Modi @ 20: Dreams Meet Delivery పుస్తకాన్ని బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సంకలనం చేసింది. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత దేశ ప్రధాన మంత్రిగా 20 ఏళ్ళ నుంచి అమలు చేస్తున్న పరిపాలన విధానాన్ని ఈ పుస్తకంలో వివరించారు. అమిత్ షా, అజిత్ దోవల్, సుధా మూర్తి, నందన్ నీలేకని, అరవింద్ పనగారియా, సుబ్రహ్మణ్యం జైశంకర్, లతా మంగేష్కర్, పీవీ సింధు, నృపేంద్ర మిశ్రా వంటివారు రాసిన వ్యాసాలను దీనిలో పొందుపరిచారు. 


Read more