ఆ మూడింటి నుంచి అస్సాంకు విముక్తి కల్పిస్తాం : అమిత్ షా

ABN , First Publish Date - 2021-01-24T23:58:14+05:30 IST

అస్సాంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని కేంద్ర

ఆ మూడింటి నుంచి అస్సాంకు విముక్తి కల్పిస్తాం : అమిత్ షా

కోక్రజార్ : అస్సాంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా పేర్కొన్నారు. మరికొద్ది నెలల్లో శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమిత్ షా ఆదివారం అస్సాంలోని కోక్రజార్‌, నలబరిలలో జరిగిన సభల్లో మాట్లాడారు. అస్సాంను వరదలు, హింస, చొరబాట్లు లేని రాష్ట్రంగా చూడాలనుకుంటే బీజేపీ కూటమికి ఓట్లు వేయాలని కోరారు. కాంగ్రెస్ కూటమికి ఓటు వేస్తే చొరబాట్లు పెరుగుతాయని హెచ్చరించారు. 


రాష్ట్రంలోని సహజసిద్ధ స్థానిక జాతుల రాజకీయ, సాంస్కృతిక సంక్షేమం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గట్టిగా కృషి చేస్తున్నారని అమిత్ షా చెప్పారు. బోడోలాండ్ ఒప్పందానికి ఓ ఏడాది పూర్తయిందని చెప్తూ, గత డిసెంబరులో బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (బీటీసీ) ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. ఈ ప్రాంతం ఇక సౌభాగ్యవంతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బోడో ప్రాంతంలో రోడ్ నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు రూ.500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇకపై బోడోలాండ్ అభివృద్ధి పథంలో నడవడం ప్రారంభమవుతుందని, గరిష్ఠ స్థాయిలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. బీటీఆర్ ఒప్పందం కుదిరినపుడు ప్రధాని మోదీ తనతో మాట్లాడుతూ, తిరుగుబాట్లపై చర్చించి, పరిష్కరించాలని చెప్పారని గుర్తు చేసుకున్నారు. నేడు మొదటిసారి బోడోలు, బోడోయేతరులు కలిసికట్టుగా ఉండటాన్ని చూస్తున్నామన్నారు. వీరిని విడదీసినవారికి ఇదే సరైన సమాధానమని చెప్పారు. గత ఏడాది డిసెంబరులో జరిగిన బీటీసీ ఎన్నికల్లో బీజేపీ, యూపీపీఎల్ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 


చొరబాట్లను ఆపే సత్తా బీజేపీకే

కోక్రజార్ తర్వాత నలబరిలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ, చొరబాట్లు లేని అస్సాంగా చేయగలిగిన సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేయడం, అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తుండటం వంటివాటిని ఉదాహరణగా చూపించారు. చొరబాట్లను కాంగ్రెస్ ఆపగలదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, చొరబాట్లకు  తలుపులు బార్లా తెరుస్తుందన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని కాంగ్రెస్ విమర్శిస్తుందని, అయితే కేరళలో ముస్లిం లీగ్‌తోనూ, అస్సాంలో మౌలానా బద్రుద్దీన్ అజ్మల్‌ నేతృత్వంలోని ఆలిండియా యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్‌తోనూ పొత్తు పెట్టుకుందని గుర్తు చేశారు. ‘‘మాకు ఐదేళ్ళు ఇవ్వండి. మీకు మేము హింస రహిత, చొరబాట్ల రహిత, వరదల రహిత అస్సాంను ఇస్తాం’’ అని అమిత్ షా చెప్పారు. 


బోడోలాండ్ ఒప్పందం

బోడోలాండ్ ఒప్పందంపై గత ఏడాది జనవరి 27న సంతకాలు జరిగాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్‌కు చెందిన నాలుగు గ్రూపులు, అప్పటి బీటీసీ చీఫ్ హగ్రమ మొహిలరీ సంతకాలు చేశారు. 


Updated Date - 2021-01-24T23:58:14+05:30 IST