పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసి తీరుతాం : అమిత్ షా

ABN , First Publish Date - 2022-05-06T01:22:17+05:30 IST

పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమల్లోకి రాబోదని పశ్చిమ బెంగాల్ అధికార

పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసి తీరుతాం : అమిత్ షా

కోల్‌కతా : పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమల్లోకి రాబోదని పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ (తృణమూల్ కాంగ్రెస్) వదంతులను ప్రచారం చేస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. కోవిడ్-19 మహమ్మారి ప్రభంజనం ముగిసిన తక్షణం ఈ చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. గురువారం ఆయన సిలిగురిలో జరిగిన పశ్చిమ్ బంగో సమ్మాన్ సమావేశ్‌లో మాట్లాడారు.


ముఖ్యమంత్రి మమత బెనర్జీ చొరబాట్లను కోరుకుంటున్నారని అమిత్ షా ఆరోపించారు. ‘‘మమత దీదీ చొరబాట్లను కోరుకుంటున్నారు. కానీ టీఎంసీ జనాలు జాగ్రత్తగా వినాలి. CAA గతంలో, వర్తమానంలో వాస్తవం. అది భవిష్యత్తులో కూడా వాస్తవం’’ అని చెప్పారు. బెంగాల్‌కు వచ్చిన శరణార్థులు పౌరసత్వం పొందకూడదని మమత కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలం పెరిగినందుకు హర్షం వ్యక్తం చేశారు. శాసన సభలో బీజేపీ బలం ముగ్గురి నుంచి 77 మందికి చేరడానికి అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. టీఎంసీ అరాచకాలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఆయన రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటిస్తారు. 


బెంగాల్ గురింరి ఆందోళన అక్కర్లేదు : మమత 

ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, మమత బెనర్జీ స్పందిస్తూ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలోని జహంగీర్‌పురి, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌లలో ఏం జరుగుతోందో చూడాలన్నారు. అంతేకానీ పశ్చిమ బెంగాల్ గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. విభజనను సృష్టించడమే బీజేపీ పని అన్నారు. హోం మంత్రిగా ఆయన ఏం సాధించారని ప్రశ్నించారు. ఈద్ రోజు కూడా హింసకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. 


‘‘మిస్టర్ అమిత్ షా, మీరు హోం మంత్రి కాబట్టి నాకు గౌరవం ఉంది. నేను ఎలా నడచుకోవాలో మీరు చెప్పకండి, రాష్ట్రాన్ని పాలించాలని బీఎస్ఎఫ్‌ని అడగకండి. ఆవుల అక్రమ రవాణా, చొరబాట్లను నిరోధించవలసిన బాధ్యత మీది. సరిహద్దుల్లో శాంతిని కాపాడవలసిన కర్తవ్యం మీది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


దేశ ప్రజాస్వామిక వ్యవస్థను నలగ్గొట్టి, అణచివేసే పనులు చేయవద్దని హెచ్చరించారు. నిప్పుతో చెలగాటం ఆడవద్దని హితవు పలికారు. దీటైన సమాధానంతో జనం ప్రతీకారం తీర్చుకుంటారని హెచ్చరించారు. CAA బిల్లుకు కాలదోషం పట్టిందని, ఆ బిల్లును ప్రభుత్వం పార్లమెంటుకు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. ప్రజల హక్కులు అణచివేతకు గురికావాలని తాను కోరుకోవడం లేదన్నారు. మనమంతా కలిసికట్టుగా ఉండాలన్నారు. ఐకమత్యమే బలమని చెప్పారు. రాజకీయాల్లోకి బీఎస్ఎఫ్‌ను చొప్పించడం కోసం అమిత్ షా నేడు రాష్ట్రానికి వచ్చారని ఆరోపించారు. 


ప్రతిపక్షాల ఐకమత్యం గురించి అడిగినపుడు మమత స్పందిస్తూ, అంతా అయిపోయిందని అనుకోవద్దన్నారు. మంచి జరుగుతుందని భావిస్తున్నానని చెప్పారు. ప్రతిపక్షాలు సమైక్యంగా ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. శక్తిమంతంగా, ధైర్యంగా యుద్ధం చేయాలన్నారు. 


మత హింస బాధితుల కోసం CAA

CAA 2019లో ఆమోదం పొందింది. 2019 డిసెంబరు 12న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లలో మతపరమైన హింసకు గురై, భారత దేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పారశీకులు, క్రైస్తవులకు భారత పౌరసత్వం మంజూరు చేయడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అనంతరం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం కోవిడ్-19 మహమ్మారి విజృంభించింది. ఈ చట్టాన్ని అమలు చేయవలసి ఉంది. 2014 డిసెంబరు 31న లేదా అంతకుముందు భారత దేశానికి వచ్చినవారికి ఈ చట్టం వల్ల ప్రయోజనం లభిస్తుంది.


Read more