శాంతి భద్రతలు మరింత బలోపేతం

ABN , First Publish Date - 2022-04-05T09:59:45+05:30 IST

దేశంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడానికి క్రిమినల్‌ ప్రొసీజర్‌(ఐడెంటిఫికేషన్‌) బిల్లు ఉపయోగపడుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు.

శాంతి భద్రతలు మరింత బలోపేతం

క్రిమినల్‌ ప్రొసీజర్‌ బిల్లుపై అమిత్‌ షా

ది క్రూరమైన బిల్లు: ప్రతిపక్షాలు

లోక్‌సభలో మూజువాణి ఓటుతో బిల్లు పాస్‌ 


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4: దేశంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడానికి క్రిమినల్‌ ప్రొసీజర్‌(ఐడెంటిఫికేషన్‌) బిల్లు ఉపయోగపడుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. నేరస్థులు, నేర సంబంధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి భౌతిక, జీవ సంబంధమైన నమూనాలను పోలీసులు సేకరించి, భద్రపరిచేందుకు ఈ బిల్లు అనుమతిస్తుందన్నారు. సోమవారం లోక్‌సభలో క్రిమినల్‌ ప్రొసీజర్‌(ఐడెంటిఫికేషన్‌) బిల్లుపై చర్చ సందర్భంగా అమిత్‌షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లులోని పలు నిబంధలు క్రూరంగా ఉన్నాయని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ పరిశీలనకు పంపాలని డిమాండ్‌ చేశాయి. చట్టంలోని నిబంధనలు చాలా అస్పష్టంగా ఉన్నాయని.. రాష్ట్రాలు, పోలీసులు దుర్వినియోగం చేసే అవకాముందని పేర్కొన్నారు. ఇక, మూజువాణి ఓటుతో ఈబిల్లు పాస్‌ అయింది. 


పెట్రో ధరలపై భగ్గు..

పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై పార్లమెంట్‌ ఉభయసభల్లో సోమవారం గందరగోళం చెలరేగింది. రాజ్యసభ పలుసార్లు వాయిదా పడింది. ధరల పెరుగుదల సమస్యపై చర్చించాలని ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌ను రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు తిరస్కరించారు. ధరల పెరుగుదలపై చర్చకు అనుమతించకపోవడంతో కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, శివసేన సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ  సభ నుంచి వాకౌట్‌ చేశారు. కాగా.. దేశంలో ఆర్థిక సంక్షోభంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ డిమాండ్‌ చేశారు. ఈ సంక్షోభానికి బీజేపీదే బాధ్యతన్నారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో గెలిచిన తర్వాత దేశానికి ఇది వారి రిటర్ను గిఫ్ట్‌ అని ఎద్దేవా చేశారు.


Updated Date - 2022-04-05T09:59:45+05:30 IST