
తెలంగాణ విమోచన సభలో ఏం జరిగింది? మోటా భాయ్ సభలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది ఎవరు? ఈటెల చెవిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం చెప్పారు? నేతలంతా పదే, పదే ఎన్నికల గురించి మాట్లాడటం దేనికి సంకేతం? అనే ఆసక్తికర విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్సైడ్లో చూద్దాం.
నిర్మల్ బీజేపీ సభపై రాజకీయ వర్గాల్లో చర్చ
నిర్మల్ లో బీజేపీ నిర్వహించిన తెలంగాణ విమోచన సభపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. పేరుకు విమోచన సభ అయినా.. ఎన్నికల ప్రచార సభగా మారిందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఈ సభలో ఈటల రాజేందర్ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈటెల రాజేంద్రకు బీజేపీ అధిష్టానం తగిన గుర్తింపు ఇవ్వడం లేదని గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి అమిత్ షా తెరదించారు. పార్టీ మొత్తం ఈటెల వెంట ఉంటుందనే సంకేతాన్ని ఈ వేదిక ద్వారా పంపారు.

ఈటెల రాజేందర్ ప్రసంగానికి ముందు.. గమ్మత్తు పరిణామం
ఈటెల రాజేందర్ ప్రసంగించడానికి లేవగానే ఓ గమ్మత్తు పరిణామం చోటు చేసుకుంది. ఈటెలతో పాటు అక్కడే వేదికపై ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా లేచారు. ఈటెల దగ్గరకు వెళ్లి, ఆయన చెవిలో భారతమాతాకి జై అంటూ ప్రసంగం ప్రారంభించమని చెప్పారు. ఇది వేదిక ముందున్న అందరికీ అర్థం అయింది. దీంతో భారతమాతాకీ జై అంటూ ఈటెల తన ప్రసంగాన్ని మొదలుపెట్టి.. చివరికి భారతమాతాకీ జై అంటూనే ముగించారు. అయితే కిషన్ రెడ్డి అలర్ట్ వెనక పలు రాజకీయ కారణాలున్నట్లు తెలుస్తోంది.

ఈటెలకు బీజేపీలో ఉండటం ఇష్టం లేదా!?
వాస్తవానికి హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో ఈటెల రాజేందర్ పార్టీ లైన్ లో కాకుండా.. వ్యక్తిగతంగానే ఓట్లు అడుగుతున్నారన్న చర్చ కొంత కాలంగా సాగుతోంది. పార్టీ నినాదాలైన జై శ్రీరాం, భారతమాతాకీ జై, వందేమాతరం లాంటివి ఈటెల పలకడం లేదని.. ఆయనకు అసలు బీజేపీలో ఉండటం ఇష్టం లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీ ఈ పరిణామాలను అనుకూలంగా మలుచుకుంటూ బీజేపీపై దాడి చేస్తోంది. ఈ దాడికి, ప్రచారాలకు తెరదించేలా కిషన్ రెడ్డి వ్యూహత్మకంగా ఈటెలతో భారతమాతాకి జై కొట్టించినట్లు చర్చ సాగుతోంది.

2023లో తెలంగాణలో అధికారంలోకి బీజేపీ..!
మరోవైపు సభలో తెలంగాణ విమోచన దినోత్సవం కన్నా ఎక్కువగా రానున్న ఎన్నికలపైనే నేతల ప్రసంగాలు కొనసాగాయి. అమిత్ షా తో పాటు నేతలందరూ 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ్ యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని, మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు చుట్టివచ్చేలా చేపట్టిన యాత్రతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు పునాదిగా ఉపయోగపడుతుందన్నారు. అలాగే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని సీట్లనూ మోదీకి కానుకగా ఇస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. అమిత్ షా ఎన్నికల ఊసెత్తడం వెనక భారీ వ్యూహం ఉన్నట్లు చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్న అంచనాతోనే బీజేపీ అలర్ట్ అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల ప్రచార సభగా మారిన విమోచన సభ
మొత్తానికి తెలంగాణ విమోచన సభ కాస్త.. ఈటెల రాజేందర్ ను ప్రమోట్ చేసేందుకు బాగా ఉపయోగ పడింది. అటు పార్టీ క్యాడర్ లోనూ జోష్ నింపింది. ఈటెల -బీజేపీకి మద్య గ్యాప్ ఉందన్న ప్రచారానికి తెరదించినట్లైంది. అయితే, బీజేపీ సీనియర్ల ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.