ప్రతిపక్షాలతో అమీతుమీ

ABN , First Publish Date - 2021-07-28T08:48:35+05:30 IST

‘మెహంగాయీ కో సమాప్త్ కరో, మంత్రీకో బర్ఖాస్త్ కరో’ (ధరలను అదుపులో పెట్టండి, మంత్రిని తొలగించండి) అన్న ప్లకార్డులతో బిజెపి సభ్యులు యుపిఏ ప్రభుత్వ హయాంలో...

ప్రతిపక్షాలతో అమీతుమీ

‘మెహంగాయీ కో సమాప్త్ కరో, మంత్రీకో బర్ఖాస్త్ కరో’ (ధరలను అదుపులో పెట్టండి, మంత్రిని తొలగించండి) అన్న ప్లకార్డులతో బిజెపి సభ్యులు యుపిఏ ప్రభుత్వ హయాంలో నినాదాలు చేసి పార్లమెంటును స్తంభింప చేశారు. అంతేకాదు, ధరల పెరుగుదలపై వారు వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టి ఓటింగ్‌కు పట్టుబట్టారు. ‘ధరలను అదుపుచేయడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’ అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ అన్నారు. ‘వాయిదా తీర్మానం లేకుండా ఊరికే చర్చిస్తే ప్రయోజనమేముంది, సభ కేవలం వక్తృత్వ క్లబ్‌గా మారిపోతుంది’ అని ఆహ్లూవాలియా అన్నారు.


యుపిఏ రెండో విడత ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బిజెపి లోక్‌సభలో 37 శాతం సమయాన్ని స్తంభనలతో వృథా చేసింది. కామన్‌వెల్త్ క్రీడలు, 2జీ కుంభకోణం, బొగ్గు బ్లాకుల కేటాయింపు, వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలు, ముంబైలో ఆదర్శ్ హౌజింగ్ సొసైటీ ఫ్లాట్ల కేటాయింపు, లోక్‌పాల్ బిల్లు వంటి అనేక అంశాలపై రోజుల తరబడి సభా కార్యకలాపాల్ని భగ్నం చేసింది. కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రుల రాజీనామాలను డిమాండ్ చేసింది. 2010 బడ్జెట్ సమావేశాల్లో యుపిఏ ప్రభుత్వం ఆర్థిక బిల్లులను ఆమోదింపచేయడం తప్ప మరే పనినీ చేపట్టలేకపోయింది. 2013 ఫిబ్రవరి- మార్చి మధ్య జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 163 గంటల్లో 146 గంటల సమయం గాలిలో కొట్టుకుపోయింది. ఒకరకంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వారే నాడు 15వ లోక్ సభ సమావేశాలు సజావుగా సాగకుండా అడ్డుపడ్డారు. ఇప్పుడు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్న మాదిరే నాడు చైర్మన్‌గా ఉన్న హమీద్ అన్సారీ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఏ చర్చా జరగలేదు. ప్రత్యేక ప్రస్తావనలు కానీ, జీరో అవర్ ప్రస్తావనలు కానీ చేపట్టలేదు. మౌఖికంగా ఏ ప్రశ్నలకూ జవాబు లభించలేదు. ఏ అనుబంధ ప్రశ్నల్నీ లేవనెత్తలేదు’ అని అన్సారీ వ్యాఖ్యానించారు.


‘కొన్ని సార్లు సభా వ్యవహారాలు సరిగా సాగకపోవడం కూడా ఫలితాలను ఇస్తుంది’ అని 2010 శీతాకాల సమావేశాల్లో 2జీ కుంభకోణంపై ప్రతిపక్షాల నిరసన గురించి వ్యాఖ్యానిస్తూ సీనియర్ బిజెపినేత లాల్ కృష్ణ ఆడ్వాణీ అన్నారు. ‘పార్లమెంట్‌ను సాగనీయకుండా చేయడం ఒక ప్రజాస్వామ్య పద్ధతి’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ అంటే, ‘పార్లమెంట్‌ను అడ్డుకోవడం ద్వారా మేము దేశానికి ఒక సందేశం పంపాం’ అని అరుణ్ జైట్లీ అన్నారు. ప్రభుత్వం పార్లమెంట్‌లో జవాబుదారీతనాన్ని అవలంబించకుండా చర్చల పేరుతో దానికి తెరవేయాలనుకంటే ప్రతిపక్షాలు కూడా తమకున్న సాధనాలతో ప్రభుత్వం ముసుగు తొలగించడం న్యాయపూరితమైనదేనని ఆయన వాదించారు. ‘మేము పనికి అవరోధం కల్పించడం లేదు. మేము చేస్తున్నది కూడా గొప్ప పనే..’ అని జైట్లీ ఒక పత్రికకు రాసిన వ్యాసంలో చెప్పారు.


ఇవాళ పార్లమెంట్ పవిత్రతను ప్రతిపక్షాలు కాలరాస్తున్నాయని, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాయని గగ్గోలు పెడుతున్న బిజెపి నేతలు ఒక్క సారి వెనక్కి తిరిగి గత కాలంలోని పార్లమెంట్ రికార్డులను పరిశీలిస్తే తాము కూడా అంత వివేకంగా వ్యవహరించలేదన్న విషయం అర్థమవుతుంది. పోనీ, అప్పటికంటే ఇప్పుడు మెరుగైన ప్రభుత్వం అధికారంలో ఉన్నదని చెప్పడానికి వీలు లేదు. యుపిఏ హయాంలో ధరలు ఆకాశానికి చేరితే ఇప్పుడున్న ధరలు అంతరిక్షాన్ని తాకుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ అప్పటితో పోలిస్తే అధఃపాతాళానికి దిగజారింది. ఇవాళ పెట్రోల్, డీజిల్‌తో సహా ఆకాశానికంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలను, తమకు జవాబుదారీ లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని చూస్తే ఎంత తీవ్ర నిరసన తెలిపినా సరిపోదనే అనిపిస్తుంది.


2011 ఫిబ్రవరిలో లోక్‌సభలో జీఎస్టీని అమలు చేసేందుకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడితే దాన్ని బిజెపియే బలంగా అడ్డుకున్నది. బిజెపి ఒత్తిడిపైనే ఆ బిల్లును స్థాయీ సంఘానికి నివేదించారు. మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా నేతృత్వంలో స్థాయీ సంఘం ఈ బిల్లును చర్చించి 2013 ఆగస్టులో సమర్పించిన నివేదికలో కొన్ని సవరణలు సూచించింది. ఈ సవరణలను ప్రవేశ పెట్టిన తర్వాత కూడా బిజెపి ఆ బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ఈ బిల్లును అమలు చేసేందుకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆర్జినెన్స్ జారీ చేస్తే గుజరాత్‌కు ప్రతి ఏడాది రూ.14వేల కోట్ల నష్టం వస్తుందని అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ అభ్యంతరం వ్యక్తపరిచారు. కొవిడ్ మూలంగా ఆర్థిక కార్యకలాపాలు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసి కూడా ఇదే మోదీ ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి తర్వాత రాష్ట్రాలకు జీఎస్టీ నష్టపరిహారం ఇవ్వలేమని చేతులెత్తేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ నష్టపరిహారమే రూ.2.69 లక్షల కోట్లుంటుందని, అందులో రూ.1.58 లక్షల కోట్లు రాష్ట్రాలు అప్పులు చేయాల్సి ఉంటుందని ఒక అంచనా.


ప్రభుత్వాలు అన్ని రంగాల్లో విజయం సాధించాలని ఎక్కడా లేదు. యుపిఏ హయాంలో జరిగిన వైఫల్యాలను ఎండకట్టేందుకు నాడు ప్రతిపక్ష స్థానంలో ఉన్న బిజెపి హంగామా సృష్టించినందువల్లే ఇవాళ అధికారంలో ఉన్నది. నాటి కుంభకోణాలను తీవ్ర స్థాయిలో చిత్రించి మోదీ చేసిన ప్రచారం వల్లే ప్రధానమంత్రి కాగలిగారు. నాడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బిజెపితో పాటు పార్లమెంట్‌లో గందరగోళం సృష్టించిన ప్రతిపక్షాలు (వామపక్షాలతో సహా) ఇవాళ కాంగ్రెస్‌తో కలిసి బిజెపికి వ్యతిరేకంగా రణగొణధ్వనులు సృష్టిస్తున్నాయి. మరి తేడా ఎక్కడుంది? ఎందుకో గాని గతంలో అధికార పక్షానికీ, ప్రతిపక్షాలకూ మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఇప్పుడు ఏమాత్రం లేవనిపిస్తోంది. ప్రతిపక్షాలు సంఘర్షణాయుత వైఖరి అవలంబించడం ప్రజాస్వామ్యంలో సహజం. కాని ఇప్పుడు ప్రభుత్వమే సంఘర్షణాయుత వైఖరిని అవలంభిస్తోంది. ప్రతిపక్షాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం, కీలక చట్టాలు, నిర్ణయాల విషయంలో వాటిని విశ్వాసంలోకి తీసుకోవడం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ద్వారానో, సభాపతుల ద్వారానో విపక్ష సభ్యులను తమ వైపుకు తిప్పుకోవడం, కాని పక్షంలో ప్రధానమంత్రే చర్చలకు ఆహ్వానించడం ఒక ప్రజాస్వామిక సంప్రదాయం. కానీ మోదీ హయాంలో ఈ సంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చి ప్రతిపక్షాలతో అమీతుమీ తేల్చుకోవడానికే సిద్ధపడినట్లు స్పష్టమవుతోంది. ఒక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంతో ఎలా వ్యవహరించాలో బిజెపికి, ముఖ్యంగా మోదీకి అర్థమైనట్లు లేదు. గతంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కమల్ నాథ్ ఉన్నప్పుడు ఆయన వద్దకు వచ్చిన ఏ ప్రతిపక్ష నేత అయినా మెత్తబడి వెళ్లిపోయేవారు. ఆ ప్రతిపక్ష నేతకు బంగళా కేటాయింపు విషయంలోనో, మరే సమస్య పరిష్కారం విషయంలోనో కమల్ నాథ్ తోడ్పడేవారు. వెంకయ్యనాయుడు పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతి అవలంబించారు. జీఎస్టీ విషయంలో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు 2017లో ఆయన సోనియాగాంధీని కూడా కలుసుకున్నారు. కాని మోదీకి ఇలాంటి పద్ధతులు నచ్చవన్న విషయం రానురానూ వెల్లడైంది. మోదీ రెండో సారి గెలిచిన తర్వాత ఆయన వైఖరి మరింత కఠినంగా మారింది. అది ఎన్నికల్లో విజయం సాధించడం వల్ల వచ్చిన అహంభావమో, లేక ఎన్నికల్లో ఏ రకంగానైనా గెలవగలమని వచ్చిన ధీమాయో కావచ్చు. ప్రజలకు సంబంధించిన, రాష్ట్రాల ప్రయోజనాలతో ముడివడి ఉన్న కీలక చట్టాల్ని ఆర్డినెన్స్‌ల రూపంలో తేవడం, వాటిని పెద్దగా చర్చ లేకుండా ఆమోదింపచేయడం, పార్లమెంటరీ కమిటీల ప్రాధాన్యత తగ్గించడం ఒక ఎత్తు అయితే, ప్రతిపక్ష నేతల్ని, ముఖ్యమంత్రుల్ని నియంత్రించడం కోసం ప్రభుత్వాలను మార్చడం, మొత్తం ప్రతిపక్షాలనే తుడిచిపెట్టేందుకు రకరకాల ఏజెన్సీలను ప్రయోగించడం మరో ఎత్తు. ఆత్మనిర్భర్, స్వదేశీ విధానాల గురించి చెప్పుకునే ప్రభుత్వం స్వదేశీ నిరసనను భగ్నం చేయడం కోసం విదేశీ ఏజెన్సీల నిఘాను వాడుకున్నారన్న తాజా ఆరోపణలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. రాను రానూ ప్రతిపక్షాల పరిస్థితి గదిలో బంధించిన పిల్లుల్లా మారింది. బహుశా అందుకే వారు కసిగా కనిపిస్తున్నారు. ప్రధాని తన నూతన మంత్రివర్గాన్ని పరిచయం చేయడాన్ని అడ్డుకోవడానికి కూడా అదే కారణం. ప్రజాస్వామ్యంలో ఏమర్యాదలూ పాటించని ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు మర్యాదగా వ్యవహరించాలని ఆశించడంలో అర్థం లేదు.


భారత ప్రజాస్వామ్య చరిత్రలో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఇంత తీవ్రంగా పరస్పర శత్రువుల్లా వ్యవహరించిన సందర్భాలు గతంలో లేవనే చెప్పాలి. ఈ వాతావరణానికి ఆస్కారం కల్పించింది ప్రధానంగా నరేంద్రమోదీ అవలంబిస్తున్న వైఖరే కావచ్చు. ఒక వ్యక్తి కేంద్రీకృత ప్రజాస్వామ్యంగా దేశాన్ని మార్చాలనుకోవడం వల్లే ఈ పరిణామం జరిగి ఉండవచ్చు. పార్లమెంట్ జరగకపోతేనేం, గందరగోళం మధ్య బిల్లులను ఆమోదింప చేసే సంస్కృతి ఎప్పుడో ప్రారంభమైంది. పార్లమెంటరీ ప్రమాణాలు దిగజారుతున్నాయని బాధపడేవారు ఈ దిగజారుడు బిజెపి ప్రతిపక్షంగా ఉన్నప్పుడే ప్రారంభమైందని, అది మోదీ హయాంలో మరింత క్షీణ దశకు చేరిందని గ్రహించాలి. భారత దేశంలో ప్రజాస్వామ్యం ఒక మేడిపండు మాత్రమేనని ఇవాళ సామాన్య మానవుడికి కూడా తెలుసు.


ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Updated Date - 2021-07-28T08:48:35+05:30 IST