ఒడి చేరేనా?

ABN , First Publish Date - 2022-05-20T06:23:29+05:30 IST

ఒడి చేరేనా?

ఒడి చేరేనా?

అమ్మఒడి అమలు తీరుపై అనుమానాలెన్నో..

ఇంతవరకు పూర్తికాని లబ్ధిదారుల జాబితా

అర్థంలేని నిబంధనలతో తల్లుల అవస్థలు

రోజుకొక మెలికతో తికమక


అమ్మఒడి అవస్థల సుడిలా మారింది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి నిబంధనలు అడ్డుగోడలై నిలుస్తున్నాయి. విద్యా సంవత్సరం సమీపిస్తున్నా లబ్ధిదారుల జాబితా సిద్ధం కాకపోవడం, అర్థంలేని నిబంధనలు విధించడం.. వెరసి ఈ ఏడాది అమ్మఒడి అమలు తీరు అస్తవ్యస్తంగా మారింది. 


గుడివాడ, మే 19 : అమ్మఒడి లబ్ధిదారుల ఎంపికలో కొత్తగా విధించిన నిబంధనలు ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్థుల హాజరుతో పాటు మరికొన్ని షరతులు పెట్టారు. తల్లుల ఖాతా పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (పీపీసీఐ)కి అనుసంధానం చేయాలని విధించిన నిబంధన లబ్ధిదారులను కలవరానికి గురిచేస్తోంది. గతంలో అమ్మఒడి అందుకున్న లబ్ధిదారులు కూడా సరిచూసుకోవాలా, లేదా అనే విషయంపై అవగాహన లేకపోవడంతో అంతా గందరగోళంగా మారింది.

అందరికీ అందడం అనుమానమే

ప్రస్తుత విద్యా సంవత్సరానికి మాత్రం అమ్మఒడి అందరికీ అందుతుందో లేదో చెప్పలేని పరిస్థితి ఉంది. తాజా నిబంధనలే దీనికి కారణమని చెప్పొచ్చు. గతంలో అర్హులైనప్పటికీ నిరాశ తప్పేలా లేదు. పిల్లల హాజరు 75 శాతం ఉండాలనడం, విద్యుత్‌ వినియోగం ఆరు నెలల సగటు 300 యూనిట్లు దాటకూడదనే నిబంధన, గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల ఆదాయ నిబంధన, పట్టణ పరిధిలో వెయ్యి అడుగులకు మించి స్థలం ఉండకూడదనే నిబంధనలు తెరపైకి తెచ్చారు. ప్రధానంగా హాజరు శాతం, విద్యుత్‌ వినియోగం వంటి అంశాలు అమ్మఒడి అందుకోవడానికి ప్రతిబంధకాలుగా పరిణమించాయని చెప్పొచ్చు. కరోనా, బ్లాక్‌ ఫంగస్‌ భయంతో విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో పాఠశాలలకు ఎక్కువగా వెళ్లలేదు. జిల్లాలోని మెజారిటీ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులే హాజరయ్యారని తెలిసిందే. విద్యుత్‌ వినియోగం విషయానికి వస్తే.. వినియోగించిన విద్యుత్‌ కంటే బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని ఫిర్యాదులు ఉన్నాయి. వాటిని సరి చేయించుకోవడమంటే తలప్రాణం తోకకు రావాల్సిందే. 

ఎన్‌పీసీఐ నిబంధనతో అవస్థలు

ఎన్‌పీసీఐ అనుసంధాన నిబంధన పలువురికి అవస్థలు తెచ్చిపెడుతోంది. గతంలో తల్లుల ఖాతా నెంబరు, సంబంధిత బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ వివరాలు సేకరించి నగదు జమ చేసేవారు. ప్రస్తుతం ఖాతాలు ఎన్‌పీసీఐకి అనుసంధానమైతేనే నిధులు జమ అవుతాయనే నిబంధన విధించడం తలనొప్పులు తెచ్చిపెడుతోంది. లబ్ధిదారులైన తల్లులకు సాంకేతిక అంశాలపై అవగాహన అంతగా ఉండదనే విషయం విదితమే. ఎన్‌పీసీఐకి అనుసంధానం చేసిన ఖాతా నెంబరునే స్కూల్‌ లాగిన్‌కు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఏ ఖాతా ఎన్‌పీసీఐకు అనుసంధానమైందో లేదో చెప్పడం కష్టంగా మారింది. జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌, డ్వాక్రా అకౌంట్‌.. ఇలా ఎక్కువ శాతం మహిళలకు రెండు, మూడు బ్యాంకుల్లో ఖాతాలు ఉంటున్నాయి. ఏ ఖాతాకు తమ మొబైల్‌ నెంబరు, ఆధార్‌ నెంబరు అనుసంధానం చేశారనే విషయంతో పాటు ఎన్‌పీసీఐ అనుసంధానం చేసుకోవాలో తెలియక వారంతా బ్యాంకు అధికారులను సంప్రదిస్తున్నారు. బ్యాంకుల నుంచి సరైన రీతిలో సమాధానాలు రాక అయోమయంలో పడిపోయారు.

లబ్ధిదారుల ఎంపికలో అస్పష్టత

ఉమ్మడి జిల్లాలో అమ్మఒడికి 7,27,219 మంది విద్యార్థులకు గానూ, 5,58,731 మందిని ఎంపిక చేశారు. 1,31,292 మందిని అనర్హులుగా ప్రకటించారు. ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో 56,917 మంది అర్హతలను పరిశీలించాల్సిందిగా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సంబంధిత పాఠశాల హెచ్‌ఎంల నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ప్రభుత్వానికి నివేదికలు సమర్పించింది. వారిలో ఎంతమంది అర్హులవుతారో తేలాల్సి ఉంది. జూన్‌లోపు ఎన్‌పీసీఐ నమోదు పూర్తి చేయకపోయినా లబ్ధిదారులకు అమ్మఒడి అందదని తెలుస్తోంది. దీనిని బట్టి ఎంపిక చేసిన 5.58 లక్షల మందిలో ఎంతమంది అర్హులుగా మిగులుతారో వేచి చూడాలి. గత ఏడాది ఫిబ్రవరిలో తల్లుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ చేయాల్సి ఉన్నా జూన్‌కు వాయిదా వేశారు. తాజా మార్గదర్శకాల ప్రకారం వడపోసిన తర్వాతే నిధుల విడుదల ఉంటుందని విద్యాశాఖ అధికారులే పేర్కొంటున్నారు. నిబంధనలు తమకు వర్తింపజేసుకునేలా తల్లిదండ్రులు బ్యాంకులు, సంబంధిత సచివాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. 


మార్గదర్శకాల ప్రకారమే అమ్మఒడి

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే అమ్మఒడి ఖాతాల్లో జమ అవుతుంది. ఎన్‌పీసీఐ ఖాతాతో పాటు ఇతర నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు చేయాల్సి ఉంది. పథకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాం. అర్హులైన ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

- తాహెరా సుల్తానా, డీఈవో, కృష్ణాజిల్లా


Updated Date - 2022-05-20T06:23:29+05:30 IST