‘అమ్మఒడి’ ఒక మిథ్యే!

ABN , First Publish Date - 2022-09-16T06:23:36+05:30 IST

మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అరకొరగా అమలు చేసి, 95 శాతం హామీలను నెరవేర్చామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోంది...

‘అమ్మఒడి’ ఒక మిథ్యే!

మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అరకొరగా అమలు చేసి, 95 శాతం హామీలను నెరవేర్చామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోంది. నవరత్నాలపై జగన్మోహన్ రెడ్డి చెప్పిన గొప్పలన్నీ ఆచరణలో నీటి మూటలుగా మిగిలిపోయాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వంచనాత్మకమైనవే. గత ప్రభుత్వాలు అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలను రద్దు చేసి పేర్లు మార్చి కొత్త పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎన్నికల ముందు వివిధ వర్గాల ప్రజలకు బేషరతు హామీలు–పథకాలు ప్రకటించి, అధికారంలోకి వచ్చాక అనేక నిబంధనలు విధించి వీలైనంత మేర లబ్ధిదార్ల సంఖ్యను కుదించి ఆ మేరకు ఖర్చు తగ్గించుకుంటున్నారు. బడుగు, బలహీనవర్గాలకు ప్రభుత్వం చెప్పేది కొండంత, చేసేది గోరంత.


ప్రతి విద్యార్థికి ఏటా లక్ష నుంచి లక్షన్నర వరకు ఖర్చు చేసి మేనమామలా ఉంటానని హామీనిచ్చి కంసమామలా తయారయ్యారు జగన్. గత ప్రభుత్వాలు అమలుచేసిన స్కాలర్‌షిప్స్‌కు గండికొట్టి అమ్మఒడి పథకాన్ని తెచ్చి అద్భుతాలు సృష్టిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్నది. గత ప్రభుత్వం స్కాలర్‌షిప్స్‌ను ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అందరికీ వర్తింపజేసింది. కాని ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఇంట్లో కేవలం ఒక్క విద్యార్థికి మాత్రమే అమలు చేస్తున్నది. అంతేకాదు ఒక ఇంట్లో అమ్మఒడి వస్తుంటే అదే ఇంట్లో జగనన్న విద్యా దీవెన (ఫీజ్ రీయింబర్స్‌మెంట్) వర్తించదు. అమ్మఒడి అమలు తీరు చూస్తే అంతా మిథ్యే అని చెప్పాలి. అడ్డమైన నిబంధనలు విధించి అమ్మఒడిని ఆంక్షల సుడిగా మార్చారు. ప్రభుత్వం అస్తవ్యస్తమైన విధానాలతో విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది.


మూడేళ్లుగా అమ్మఒడి పథకంలో లబ్దిదారుల కుదింపును పరిశీలిస్తే ఆ పథకానికి ఎంతలా అంటకత్తెర వేశారో అర్థమవుతుంది. అమ్మఒడి ద్వారా 80 లక్షల మందికి నగదు ఇవ్వాల్సి ఉంది. కానీ 2019–20లో, 42,80,823 మందికి, 2020–21లో 44,48,865 మందికి, 2022–23లో 43,96,402 మందికి మాత్రమే ఇచ్చారు. 2019–20లో అమ్మఒడి కింద రూ.15,000 ఇస్తే, 2020–21లో రూ.14,000, 2022–23లో రూ.13,000 మాత్రమే ఇచ్చారు. అమ్మఒడి ద్వారా ప్రభుత్వానికి 2019–20లో రూ.6,349 కోట్లు ఖర్చు అయితే, నాన్నబుడ్డి ద్వారా రూ.20,046 కోట్లు ఆదాయం వచ్చింది. 2020–21లో అమ్మఒడికి రూ.6,673 కోట్లు ఖర్చు అయితే, నాన్నబుడ్డి ద్వారా రూ.20,895 కోట్లు ఆదాయం వచ్చింది. అదేవిధంగా 2022– 23లో రూ.6,595 కోట్లు ఖర్చు అయితే 2020–21లో రూ.25,482 కోట్లు ఆదాయం వచ్చింది. అంటే మూడేళ్లలో అమ్మఒడికి ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.19,617 కోట్లు మాత్రమే. అయితే మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి మూడేళ్లలో రూ. 66,423 కోట్లు ఆదాయం వచ్చింది. అంటే ఎవరి డబ్బుతో అమ్మఒడి పథకం అమలు చేస్తున్నారో అర్థం అయిందా? వాస్తవాలు ప్రజలు గుర్తించాలి.


‘‘పిల్లలను బడులకు పంపకుండా పనులకు పంపుతున్నారని అమ్మఒడి పథకం పెట్టారు. పిల్లలను బడికి పంపితే తల్లికి రూ.15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే రూ.15,000, ఇద్దరి బిడ్డలను బడికి పంపితే రూ.30,000 తల్లికి సంవత్సరానికి జగన్ రెడ్డి ఇస్తారు’’ అని జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి ఎన్నికల్లో ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక, అవసరం తీరాక, అమ్మఒడి లబ్దిదారుల సంఖ్యను తగ్గించి, ఖర్చు తగ్గించుకున్నారు.


లబ్దిదారుల కుదింపు కోసం అమ్మఒడి పథకానికి ఏడు ఆంక్షలు విధించారు, రూరల్‌లో రూ.10వేలు, అర్బన్‌లో రూ.12వేలు నెలకు ఆదాయం మించకూడదు, మాగాణి 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాలు మించకూడదు. కరెంట్ 300 యూనిట్లు మించకూడదు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. ఫోర్ వీలర్ ఉండకూడదు, ఆదాయ పన్ను చెల్లించిన వారికి వర్తించదు. 1000 చదరపు అడుగుల కంటే తక్కువ ఆస్తి ఉండాలి. ఇలా అడ్డదిడ్డమైన ఆంక్షలతో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించారు. అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కొత్త కొత్త సమస్యలు తెస్తున్నారు. బ్యాంకుల్లో వారి ఖాతాలకు ఆధార్‌తో లింక్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బ్యాంకులకు అకౌంట్లను ఆధార్‌తో లింక్ చేసుకున్నా, అవి లింక్ కాలేదని కొందరికి డబ్బులు నిలిపేశారు. పట్టణాల్లో స్థలం లేకపోయినా ఉందని, కారు లేకపోయినా ఉందని చూపించి సంఖ్యను కుదించారు. సాధారణంగా ఏదైన కొత్త పథకానికి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు ప్రవేశపెట్టాలి అలా కాకుండా జగన్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్‌ల నుంచి నిధులు మళ్లించారు.


‘అమ్మఒడిని ఇప్పటి వరకు జనవరిలో ఇస్తున్నారు. అలా కాకుండా 2022–23విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఇస్తాం’ అని ప్రకటించారు. అంటే జనవరిలో ఇచ్చే రూ.6,500 కోట్లను జూన్‌లో ఇస్తారు. జనవరిలో అమ్మఒడి ఇవ్వడం కొనసాగిస్తే 2022 జనవరి, 2023 జనవరి. 2024 జనవరి అంటే మూడేళ్ల పాటు ఇవ్వాలి. జనవరి నుంచి జూన్‌కు మార్చడంతో 2022 జూన్‌, 2023 జూన్‌ రెండేళ్లే ఇస్తారు. 2024 జూన్ నాటికి ఎన్నికలు పూర్తి అవుతాయి. కాబట్టి ఆ ఏడాది అమ్మఒడి ఉండదు. ఏదిఏమైనా ప్రభుత్వం ఇక అమ్మఒడిని ఇచ్చేది 2023–24 ఒక్క ఏడాది మాత్రమే.


నూతన విద్యా విధానమంటే ప్రామాణికాలతో కూడినదిగా ఉండాలి. ప్రజలను మభ్యపెట్టి ఇంగ్లీష్ మీడియమనే భ్రమలో ఉంచి, రాజకీయంగా లబ్ధిపొందాలనే దురుద్దేశం తప్ప విద్యావ్యవస్థను బాగుపరచాలన్న ధ్యాసైతే ఏలికల్లో లేదు. ప్రభుత్వ బడుల్లో బోధన, నాణ్యత నేతిబీరలో నెయ్యి చందమైంది. పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం దారుణంగా పడిపోవడం ఆందోళనకరం. రాష్ట్ర వ్యాప్తంగా 6,15,908 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే, వారిలో 2,01,627 మంది విద్యార్థులు ఫెయిల్‌ కావడం అంటే దాదాపుగా 33 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాలేదు. గడిచిన 20 ఏళ్ల కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు పరీక్షల్లో పెయిల్ కావడం ఇదే మొదటిసారి. 71 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించకపోవడం, 31 ప్రైవేటు, 18 ఎయిడెడ్‌ పాఠశాలలు కూడా సున్నా శాతంతో సరిపెట్టడం అంటే విద్యారంగ పరిస్థితి ఎంత దయనీయంగా తయారయిందో అర్థమవుతుంది.


ప్రభుత్వ పనితీరుకు తగ్గట్లుగానే చదువుల నాణ్యత నేలబారుగా మారింది. విద్యారంగానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నదని ఆర్భాటపు ప్రకటనలు ఇస్తున్నా, క్షేత్రస్థాయిలో విద్యార్థులను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు కనీస సౌకర్యాలు లేక కునారిల్లుతున్నాయి. కొన్ని గ్రామాల్లో శిథిలమైన పాఠశాలల్లో విద్యను బోధిస్తున్నారు. నాడు–నేడు కింద దళితవాడల్లో నూతన పాఠశాలల భవన నిర్మాణాలు కేవలం కాగితాలకే పరిమితం కావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవి చాలవన్నట్లు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్బీకే కేంద్రాలు, సచివాలయాలు ఏర్పరిచిన విధానం ప్రభుత్వ పాఠశాలల్లో విద్య పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి తేటతెల్లమౌతుంది.


ఆర్థిక స్తోమతలేని తల్లితండ్రులు తమ పిల్లల విషయంలో పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలపైనే ఆధారపడి ఉన్నారు. తాగునీటి సౌకర్యం లేకపోవడం, మరుగుదొడ్ల సమస్య, క్రీడా ప్రాంగణాలకు స్థలం కొరత, ప్రహరీలు లేక భద్రతా సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఏది ఏమైనా విద్యా వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోంది. నూతన జాతీయ విద్యావిధానం పేరుతో జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యను నాశనం చేయడం సమర్థనీయం కాదు. 2018లో శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పాదయాత్రలో ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తామని జగన్‌రెడ్డి హామీ ఇచ్చారు. నేడు అందుకు విరుద్ధంగా ఏకోపాధ్యాయ పాఠశాలలను అమలుచేస్తున్నారు.


2018–19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాణ్యమైన విద్యలో 3వ స్థానంలో ఉంటే, నేడు 19వ స్థానానికి దిగజార్చారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించటం చేతగాక నేడు కమిషన్ల కోసం బైజూస్ విద్యా విధానం అమలు చెయ్యబోతున్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నప్పటికీ ఇంతవరకు ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. వాటి కోసం లక్షలాది మంది ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన వారు వేచి చూస్తున్నారు. పాఠశాలల విలీనం వల్ల 11వేల ఉపాధ్యాయ పోస్టులు తగ్గిపోయే ప్రమాదముంది. జాతీయ విద్యా విధానమంటూ విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా పాఠశాలల విలీనం, చేపట్టడం సమర్ధనీయం కాదు.


అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సీపీఎస్ రద్దు హమీని నిలబెట్టుకోవాలని అడిగిన ఉపాధ్యాయులను అవమానాలపాలు చేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగే ఆచార్యులకు కీర్తి ప్రతిష్ఠల్లా భావించే అవార్డులు, రివార్డులను సైతం వారు త్రుణీకరించారంటే సీపీఎస్ రద్దును ఉపాధ్యాయులు ఎంత బలంగా కోరుకుంటున్నారో ప్రభుత్వం అర్థం చేసుకోవాలి.

ఆలపాటి రాజేంద్రప్రసాద్

మాజీ మంత్రి

Updated Date - 2022-09-16T06:23:36+05:30 IST