నగదుపైనే మక్కువ

ABN , First Publish Date - 2021-05-21T05:18:00+05:30 IST

అమ్మఒడి పథకం అమల్లో భాగంగా నగదుపైనే విద్యార్థుల తల్లిదండ్రులు మక్కువ చూపుతున్నారు. ల్యాప్‌టాప్‌లపై కొంతమందే ఆసక్తి చూపారు. విద్యార్థులంతా బడిబాట పట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘అమ్మఒడి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. చిన్నారులను బడికి పంపించేలా ప్రోత్సహించినందుకు విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి రూ.15వేల చొప్పున జమ చేస్తోంది. ప్రస్తుతం కొవిడ్‌ కల్లోలం రేపుతున్న క్రమంలో ఆన్‌లైన్‌ తరగతులకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అమ్మఒడి పథకం కింద నగదు లేదా ల్యాప్‌టాప్‌ అందజేయాలని నిర్ణయించింది. దీంతో ‘మీకు నగదు కావాలా? ల్యాప్‌టాప్‌ కావాలా?.. నిర్ణయం మీదే’ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఐచ్ఛికాలు ఇచ్చింది. దీనిపై విద్యాశాఖ అధికారులు అభిప్రాయాలు సేకరించగా, ఎక్కువ మంది తల్లిదండ్రులు నగదు వైపే మొగ్గు చూపారు.

నగదుపైనే మక్కువ

ల్యాప్‌టాప్‌లపై కొందరికే ఆసక్తి

 కొలిక్కి వచ్చిన ‘అమ్మఒడి’ కసరత్తు

(ఇచ్ఛాపురం రూరల్‌)

అమ్మఒడి పథకం అమల్లో భాగంగా నగదుపైనే విద్యార్థుల తల్లిదండ్రులు మక్కువ చూపుతున్నారు. ల్యాప్‌టాప్‌లపై కొంతమందే ఆసక్తి చూపారు. విద్యార్థులంతా బడిబాట పట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘అమ్మఒడి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. చిన్నారులను బడికి పంపించేలా ప్రోత్సహించినందుకు విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి రూ.15వేల చొప్పున జమ చేస్తోంది. ప్రస్తుతం కొవిడ్‌ కల్లోలం రేపుతున్న క్రమంలో ఆన్‌లైన్‌ తరగతులకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అమ్మఒడి పథకం కింద నగదు లేదా ల్యాప్‌టాప్‌ అందజేయాలని నిర్ణయించింది. దీంతో ‘మీకు నగదు కావాలా? ల్యాప్‌టాప్‌ కావాలా?.. నిర్ణయం మీదే’ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఐచ్ఛికాలు ఇచ్చింది. దీనిపై విద్యాశాఖ అధికారులు అభిప్రాయాలు సేకరించగా, ఎక్కువ మంది తల్లిదండ్రులు నగదు వైపే మొగ్గు చూపారు. పాఠశాలలు, కళాశాలల వారీగా వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. పాఠశాలల నుంచి అందిన సమాచారం క్రోడికరిస్తే జిల్లాలో 9 నుంచి 12 తరగతుల విద్యార్థులు 1,10,772 మంది ఉండగా,  31,794 మంది ల్యాప్‌టాప్‌లు కోరుకున్నారు. 73,114 మంది నగదు కావాలని అడిగారు. ఇంకా ఈ పథకానికి 5,864 మంది అనర్హులుగా తేలారు. ల్యాప్‌టాప్‌ కావాలని 28.70 శాతం మంది మొగ్గు చూపారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు మాత్రం యథాతథంగా తల్లుల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. 


ల్యాప్‌టాప్‌పై తగ్గిన ఆసక్తి : 

పేరున్న కంపెనీలకు చెందిన ల్యాప్‌టాప్‌లు విద్యార్థులకు అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయినా ఆ స్థాయిలో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి స్పందన కరువైంది. దీనికి కారణం వారిలో నెలకొన్న కొన్ని భయాలే కావొచ్చని అధికారులు భావిస్తున్నారు. ల్యాప్‌టాప్‌ మరమ్మతులకు గురైతే దాన్ని బాగుచేయడం, గ్యారంటీ పీరియడ్‌, పనిచేసే సామర్థ్యం, ఇతరత్రా అపోహలే కారణమని భావిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం పూచీ మాదని ప్రకటించింది. మరమ్మతులకు గురైన ల్యాప్‌టాప్‌ సచివాలయాలకు అందజేస్తే నిర్ణీత గడువులోగా బాగు చేసి ఇస్తామని చెప్పింది. సర్వీసింగ్‌ చేసే కేంద్రాలను మండల కేంద్రాల్లో తెరిచేలా చూస్తామని తెలిపింది. అయినా చాలామంది నగదుపైనే మొగ్గు చూపడం గమనార్హం. ఇదిలా ఉండగా, గత 15 నెలలుగా విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మధ్యలో కొన్ని నెలలు పాఠశాలలకు వెళ్లినా కరోనా రెండో దశ వ్యాప్తిలో మళ్లీ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆన్‌లైన్‌ తరగతులకు చాలామంది విద్యార్థులు సెల్‌ఫోన్లు లేక ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికి ల్యాప్‌టాప్‌ అవసరమవుతాయని భావించి.. కొంతమంది తల్లిదండ్రులు వాటిపై ఆసక్తి చూపారు. 


 కోరుకున్నదే ఇస్తాం

అమ్మఒడి పథకానికి సంబంధించి జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు వివరాలు సేకరించి ఆన్‌లైన్‌ చేశాం. కొన్ని పాఠశాలల్లో ఎక్కువ మంది ల్యాప్‌టాప్‌ కోరుకున్నారు. మొత్తంగా చూస్తే నగదుకే ఎక్కువ మంది మొగ్గు చూపారు. తల్లిదండ్రులు కోరుకున్న మేరకు కొంతమందికి ల్యాప్‌టాప్‌లు, మరికొందరికి నగదు అందజేస్తాం. 

- వాసుదేవరావు, ఈవైఈవో, టెక్కలి

Updated Date - 2021-05-21T05:18:00+05:30 IST