అమ్మోఒడి.. ఆంక్షలు

ABN , First Publish Date - 2021-11-09T04:48:46+05:30 IST

అమ్మఒడి పథకానికి సంబంధించి అర్హులను కుదించే చర్యల్లో ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాదికి సంబంధించి హాజరును ఈ పథకానికి లింక్‌ చేసింది.

అమ్మోఒడి.. ఆంక్షలు
విద్యార్థుల నుంచిబయోమెట్రిక్‌ హాజరు తీసుకుంటున్న ఉపాధ్యాయులు

అమ్మఒడికి హాజరు లింకు 

75 శాతం హాజరు ఉంటేనే అర్హులు

విద్యార్థుల హాజరు లెక్కింపు ప్రారంభం 

పాఠశాలల్లో బయోమెట్రిక్‌ పరికరాల కొరత 

కొత్త నిబంధనతో అనర్హుల సంఖ్య పెరిగే అవకాశం


గుంటూరు(విద్య), నవంబరు 8: అమ్మఒడి పథకానికి సంబంధించి అర్హులను కుదించే చర్యల్లో ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాదికి సంబంధించి హాజరును ఈ పథకానికి లింక్‌ చేసింది. అమ్మబడికి అర్హత సాఽధించాలంటే విద్యార్థులకు తప్పనిసరిగా 75 శాతం హాజరు ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 8 నుంచే పాఠశాలల్లో విద్యార్థుల హాజరు లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రకారం ఈ నెల 8 నుంచి ఏప్రిల్‌ 30 వరకు మొత్తం 130 పనిదినాలు ఉంటాయి. ఇందులో 98 రోజుల పాటు విద్యార్థులు తప్పని సరిగా పాఠశాలకు వచ్చి ఉండాల్సిందే. ఈ హాజరును విద్యార్థుల నుంచి బయోమెట్రిక్‌ విధానంలో సేకరించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమైంది. అయితే ఇందుకు తగిన ఏర్పాట్లు ఉన్నాయా లేవా అని కూడా చూడకుండా బయోమెట్రిక్‌ హాజరు అమలు చేసేందుకు సిద్ధమవడంపై ఉపాధ్యాయుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే అమల్లో ఉన్న యాప్‌ల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో బయోమెట్రిక్‌ హాజరుకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పవేమోనని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్‌ పరికరాల కొరత ఉన్నట్లు ఉపాధ్యాయుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా ప్రవేశ పెట్టిన 3, 4, 5 తరగతుల విలీనం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ విద్యార్థుల హాజరుపై అనేక సందేహాలున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్టూడెంట్‌ అటెండెన్స్‌ యాప్‌లు కొన్ని చోట్ల సిగ్నల్స్‌ లోపం కారణంగా పనిచేయడం లేదు. ఇప్పటికే అనేక యాప్‌ల్లో సమాచారం నమోదుతో ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇప్పుడు విద్యార్థుల హాజరుతో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితిలో ఉపాధ్యాయులు ఒత్తిడి ఎదుర్కొంటున్నారని సంఘాల నాయకులు చెబుతున్నారు. 


6.13 లక్షల మందికి 3.90 లక్షల మందికే..

జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో 5.10 లక్షల మంది విద్యార్థులు నమోదై ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో 2.71 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో మొత్తం 6.13 లక్షల మంది అమ్మఒడి పథకానికి తొలుత అర్హత సాఽధించారు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి అనే నిబంధనతో సుమారు 3.90 లక్షల మందికే లబ్ధి చేకూరింది. జిల్లాలో రెండేళ్ల నుంచి అనర్హత పేరుతో ఎంతోమంది ఈ పథకం నుంచి దూరమయ్యారు. విద్యుత్‌ బిల్లు 300 దాటిందని, పరిమితికి మించి వ్యవసాయ భూములు ఉన్నాయని, ఆదాయపన్ను కడుతున్నారని, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయని.. తదితర కారణాలతో అనేకమందికి అమ్మఒడి అందకుండా చేశారు. ఆయా అంశాల్లో అనేక లోపాలున్నాయని ఇందుకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. ఈ క్రమంలో తాజాగా 75 శాతం హాజరు నిబంధనతో మరింతమంది అనర్హత సాఽధించే ప్రమాదం పొంచి ఉంది. హాజరు లింకుతో 3.90 లక్షల మంది విద్యార్థుల్లో ఎంతమంది అర్హత సాధిస్తారో వేచిచూడాలి. 


Updated Date - 2021-11-09T04:48:46+05:30 IST