అమ్మకు షాక్‌..!

ABN , First Publish Date - 2022-06-28T05:21:20+05:30 IST

రకరకాల కారణాలు చూపుతూ జిల్లాలో అమ్మఒడికి కోత విధించారు. వేలాది మందిని పథకానికి దూరం చేశారు. జాబితాలో పేర్లు గల్లంతు కావడంతో సచివాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు.

అమ్మకు షాక్‌..!
చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌

అమ్మఒడి లబ్ధిదారుల్లో భారీగా కోత 

చాలామందికి ఈసారి మొండిచేయి

నిబంధనల పేరుతో సగానికిపైగా తొలగింపు


ఏలూరు రూరల్‌, జూన్‌ 27 : రకరకాల కారణాలు చూపుతూ జిల్లాలో అమ్మఒడికి కోత విధించారు. వేలాది మందిని పథకానికి దూరం చేశారు. జాబితాలో పేర్లు గల్లంతు కావడంతో సచివాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. అమ్మఒడి పథకం అమ్మలకు షాక్‌ ఇచ్చింది. గత రెండు సార్లు వచ్చినా ఈ సారి మొండిచేయి చూపించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో 15 వేలు వేస్తామని హామీ ఇచ్చిన జగన్‌ తీరా సీఎం అయ్యాక పథకం అమలులో అడుగడుగునా మాట తప్పుతూ వస్తున్నారు. లక్షల మంది తల్లులకు బ్యాంకుల్లో  నగదు జమ చేయలేక లబ్ధ్దిదారులను క్రమ క్రమంగా ఏరిపారేస్తున్నారు. గతేడాది ఏకంగా పథకమే అమలు చేయలేదు. అంతకు ముందు 2019– 20 ఏడాదికి  6 లక్షల 18 వేల 925 మందికి 3 లక్షల 39 వేల 259 మందిని గుర్తించి 508.89 కోట్లు జమ చేశారు. 2020–21 ఏడాదికి 6 లక్షల 33 వేల 949 మంది విద్యార్థులకు 3 లక్షల 55 వేల 051 మందిని అర్హులుగా చేర్చి 532.57 కోట్లు జమ చేశారు. ఈ ఏడాది రెండు లక్షల 82 వేల 497 మంది విద్యార్థులకు ఒక లక్షా 84 వేల 239 మందికి 276.36 కోట్లు మాత్రమే జమ చేశారు. సగానికి పైగా తల్లులను పథకం లబ్ధి నుంచి తప్పించేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి అమ్మఒడి భారంగా పరిగణించింది. ఏదో సాకుతో అర్హులను కుదించడమే పనిగా పెట్టుకుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిలో సంక్షోభంలో చిక్కుకుపోవడంతో రక రకాల నిబంధనలు ప్రవేశపెట్టి లబ్ధిదారులను కుదించింది.


తల్లుల ఖాతాల్లో రూ.276 కోట్లు  

చెక్‌ అందించిన కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌

  నిరుపేదలకు కూడా ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్మోహన్‌రెడ్డి విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని మాజీ ఉప ముఖ్య మంత్రి ఆళ్ళ నాని అన్నారు. అమ్మఒడి కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్‌ విద్యార్ధుల తల్లుల ఖాతాలో నగదు జమ చేసే కార్యక్రమం సందర్భంగా జిల్లాకు చెందిన రూపక చెక్కును జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌తో కలిసి విద్యార్థుల తల్లులకు అందజేశారు. గాంధీనగర్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో అమ్మఒడి కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ విద్య ద్వారానే పేదరికం నిర్మూలన సాధ్యమన్నారు. ఏలూరు నియోజకవర్గంలోని 56 మంది తల్లుల ఖాతాలకు 76 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2.8 లక్షల మంది తల్లుల ఖాతాలో 276 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమన్నారు. మేయర్‌ నూర్జహాన్‌ మాట్లాడుతూ నాడు – నేడు కింద 12 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. డీఈవో  గంగాభవానీ, కమిషనర్‌ షేక్‌ సాహిద్‌, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, ఎన్‌ సుఽధీర్‌బాబు, కో ఆప్షన్‌ సభ్యుడు పెదబాబు, పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, తహసీల్దార్‌ సోమశేఖర్‌, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-06-28T05:21:20+05:30 IST