అమ్మఒడిలో కోత

ABN , First Publish Date - 2022-06-26T06:39:22+05:30 IST

అమ్మఒడి లబ్ధిదారుల జాబితాల్లో ప్రభుత్వం కోత వేసింది.

అమ్మఒడిలో కోత
నగరంలోని ఓ సచివాలయంలో అమ్మఒడి తుది జాబితాను చూస్తున్న లబ్ధిదారులు

రకరకాల కారణాలు చూపి ఏరివేత

గత ఏడాది కంటే 11,521 మేర తగ్గిన లబ్ధిదారుల సంఖ్య

ఏడాది ఏడాదికి పెరగాల్సింది పోయి తగ్గడంపై ఉపాధ్యాయ వర్గాల్లో విస్మయం

ఉమ్మడి జిల్లాలో అర్హులు 3,98,483 మంది తల్లులు

రూ.518,02,79,000 సాయం 

విశాఖ జిల్లాలో 1,75,065, అనకాపల్లిలో 1,58,722

అల్లూరి జిల్లాలోని పాడేరు డివిజన్‌లో 64,646

అర్హులైన విద్యార్థుల వివరాలపై అధికారుల గోప్యత

తల్లుల ఖాతాల్లో సొమ్ములు జమ రేపు


విశాఖపట్నం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి):


అమ్మఒడి లబ్ధిదారుల జాబితాల్లో ప్రభుత్వం కోత వేసింది. రేషన్‌ కార్డులో విద్యార్థి పేరు లేకపోవడం, హాజరు శాతం తగ్గడం, నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉండడం, కుటుంబంలో నెలకు 12 వేలకు మంచి వేతనం పొందే వ్యక్తి ఉండడం, 300 యూనిట్‌లు మించి విద్యుత్‌ వినియోగించడం, సాగు భూమి మూడు ఎకరాలకు మించి ఉండడం, విద్యార్థి తల్లికి బియ్యం కార్డు లేకపోవడం వంటి కారణాలను  చూపిస్తూ వేలాది మందిని అనర్హులుగా ప్రకటించింది.

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పథకానికి అర్హులైన తల్లుల జాబితా శనివారం సాయంత్రం విద్యా శాఖకు చేరింది. దీని ప్రకారం 3,98,483 మంది తల్లుల ఖాతాల్లో రూ.13,000 వంతున ఈ నెల 27వ తేదీన రూ.518,02,79,000 జమ కానున్నది. గత ఏడాదితో పోల్చితే లబ్ధిదారులు 11,521 మంది తగ్గారు.వాస్తవంగా ఏటేటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సాయం అందుకోవలసిన తల్లుల సంఖ్య పెరగాలి. కానీ అందుకు భిన్నంగా 11,000 పైచిలుకు తగ్గించడంపై ఉపాధ్యాయ వర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. 

ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో అనేక రకాల కారణాలు చూపి లబ్ధిదారుల జాబితాల్లో కోత వేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏకైక తల్లులు (యూనిక్‌ మదర్స్‌)గా 3,98,483 మంది తేలారు. విశాఖ జిల్లాలో 1,75,065 మంది, అనకాపల్లి జిల్లాలో 1,58,722, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు డివిజన్‌లో గల 11 మండలాల్లో 64,646 మందిని అర్హులుగా గుర్తించారు. కాగా 2019-20లో తొలిసారి అమ్మఒడి సాయం అందించారు. ఆ సంవత్సరం 5,75,378 మంది విద్యార్థులు అర్హత సాఽధించగా వారిలో 3,91,822 మంది తల్లులు (యూనిక్‌ మదర్స్‌)కు రూ.15 వేలు వంతున రూ.587.37 కోట్లు సాయం అందించారు. ఆ తరువాత ఏడాది అంటే 2020-21లో 6,30,386 మంది విద్యార్థులు అర్హులుగా నిర్ధారణ కావడంతో 4,10,004 మందిని యూనిక్‌ మదర్స్‌గా ఎంపిక చేశారు. సాయం రూ.15 వేల నుంచి రూ.14 వేలకు తగ్గించడంతో 4,10,004 మందికి రూ.574 కోట్లు అందించారు. ఈ నేపథ్యంలో గడచిన రెండేళ్లతో పోల్చితే ఉమ్మడి జిల్లాలో విద్యార్థుల సంఖ్య పెరగాల్సి ఉంది. డైస్‌ డేటా మేరకు ఒకటి నుంచి పదో తరగతి వరకు జిల్లాలో 6,91,604 మంది విద్యార్థులు ఉన్నారు. వీరితోపాటు లక్ష మంది వరకు ఇంటర్‌ విద్యార్థులు ఉంటారు. ఒకటి నుంచి ఇంటర్‌ వరకూ అధిక ఆదాయం వున్న వారిని మినహాయించినా అర్హులైన విద్యార్థులు దాదాపు 6.5 లక్షల మంది వుంటారని ఉపాధ్యాయులు అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం సాయం పొందాల్సిన తల్లుల సంఖ్య నాలుగున్నర లక్షలు వుండాలని  విశ్లేషిస్తున్నారు. అయితే శనివారం సాయంత్రం జిల్లాల వారీగా అర్హుల జాబితా ప్రకటించినా ఎంతమంది విద్యార్థులు పథకానికి అర్హత సాధించిందీ విద్యా శాఖగానీ, జిల్లా యంత్రాంగం గానీ చెప్పడం లేదు. 


విశాఖ జిల్లాలో 1,75,065 మందికి అర్హత

విశాఖ జిల్లాలో 1,75,065 మంది తల్లులను అమ్మఒడి పథకం లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఆనందపురం మండలంలో 6,496 మందిని, భీమునిపట్నం రూరల్‌ మండలంలో 6,521,  భీమిలి (జీవీఎంసీ పరిధి)లో 4,555, జీవీఎంసీలో 1,48,966, పద్మనాభం మండలంలో 5,348, పెందుర్తి మండలంలో 3,174 మందిని అర్హులుగా గుర్తించారు. విశాఖ జిల్లాలో 2020-21లో 1,65,572 మంది తల్లులకు అమ్మఒడి రాగా, 2022లో 1,75,065 మంది అర్హత సాధించారని డీఈవో చంద్రకళ తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఏడాదితో పోల్చితే 5.73 శాతం పెరిగారని పేర్కొన్నారు. అయితే ఎంతమంది విద్యార్థులు అమ్మఒడికి అర్హత సాధించారనే విషయం ప్రకటనలో ప్రస్తావించలేదు. 

Updated Date - 2022-06-26T06:39:22+05:30 IST