అమ్మఒడి అందేనా?

ABN , First Publish Date - 2022-06-26T04:49:37+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి లబ్ధిదారులకు భారీ షాక్‌ ఇచ్చింది. అమ్మఒడి పథకంలో అనేక ఆంక్షలు పెట్టి కోతలు విధించింది.

అమ్మఒడి అందేనా?

  1.  ఆంక్షలతో కొర్రీ 
  2. రూ.15వేలల్లో రూ.2వేలు కోత
  3. ఉమ్మడి జిల్లాలో అర్హులు 4,19,921 మంది
  4. ఈ నెల 27న తల్లుల ఖాతాల్లో జమ
  5. జాబితాలో పేర్లు లేని తల్లిదండ్రుల ఆవేదన 

కర్నూలు(ఎడ్యుకేషన్‌), జూన 25: రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి లబ్ధిదారులకు భారీ షాక్‌ ఇచ్చింది. అమ్మఒడి పథకంలో అనేక ఆంక్షలు పెట్టి కోతలు విధించింది. కర్నూలు ఉమ్మడి జిల్లాలో సాంకేతిక లోపాలతో పాటు అనేక కారణాలను చూపి చాలా మందిని అనర్హులుగా ప్రకటించింది. గతంలో రూ.14వేలు అందించగా ఈ సారి మరో వెయి కోత పెట్టి రూ.13వేలకు ఇచ్చేలా మార్పు చేశారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో రెండేళ్ల పాటు జనవరిలో అమ్మఒడి నగదు ఇచ్చిన ప్రభుత్వం ఈసారి జూనకు వాయిదా వేసింది. ఈ నెల 27వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో అమ్మఒడి సాయాన్ని ముఖ్యమంత్రి జగన బటన నొక్కి విడుదల చేయనున్నారు. 2024 మే నెలలోనే ఎన్నికలు రానున్నాయి. ఆ ఏడాది అమ్మఒడి పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం రాబోదని ప్రభుత్వ ఆలోచన.

 ఉమ్మడి జిల్లాలో 4,19,921 మంది అర్హులు: 

ఉమ్మడి జిల్లాలో అమ్మఒడి పథకం కింద పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల విద్యార్థులు మొత్తం 7.80 లక్షల మంది 1 నుంచి 12వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ యూనిక్‌ను ఆధారంగా చేసుకుని మొత్తం 4,19,921 మందిని అర్హులుగా గుర్తించారు. ఇందులో కర్నూలు జిల్లాలో పాఠశాల స్థాయిలో 2,16,999 మంది, జూనియర్‌ కళాశాలల స్థాయిలో 25,652 మంది మొత్తం కలిపి 2,42,651 మందిని అర్హులుగా గుర్తించారు. అలాగే నంద్యాల జిల్లాలో మొత్తం 1,77,270 మంది ఉన్నారు. ఇందులో పాఠశాలల స్థాయిలో 1,49,614 మంది కాగా, కళాశాలల స్థాయిలో 22,502 మందిని అర్హులుగా గుర్తించారు. వేలాది మందిని ఆంక్షలు విధించి అనర్హులుగా గుర్తించారు. మొదటి దఫా అమ్మఒడి వచ్చిన వారిలోనే కొంత మందికి రెండో దఫా  రాలేదు. తాజాగా మూడోదఫాలో అనేక ఆంక్షలు విధించడంతో జిల్లాలో వేలాది మంది అమ్మఒడి పథకానికి దూరమవుతున్నారు. ప్రభుత్వం ఏ లోపం చూపి ఆపేస్తుందో తెలియని గందరగోళ పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. 

అనర్హతకు కారణాలు ఇవే.. 

- కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం

- విద్యుత వినియోగం సగటున 300 యూనిట్ల కంటే ఎక్కువ వాడడం

- పట్టణ ప్రాంతాల్లో వెయి చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలంలో ఇళ్లు ఉండడం 

-  మెట్ట భూమి పదెకరాలు.. అంతకంటే ఎక్కువగా ఉండడం

-  విద్యార్థి, తల్లి పేర్లు రైస్‌ కార్డులో లేకపోవడం

-  విద్యార్థి, తల్లి ఆధార్‌ నెంబరు సరైనది కాదని..

-  ఈకేవైసీ అనుసంధానం కాలేదని..

 - జిల్లా విభజన తరువాత ఆధార్‌ మార్పు చేసుకోకపోవడం 


Updated Date - 2022-06-26T04:49:37+05:30 IST