అమ్మఒడి.. కొందరికే...?

ABN , First Publish Date - 2022-06-29T06:18:22+05:30 IST

‘పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లీ భయపడొద్దు... పిల్లలను బడికి పంపితే చాలు ఏటా రూ.15 వేలు ఇస్తాం..’ ఇదీ అమ్మఒడి పథకం ద్వారా ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భరోసా. తొలి ఏడాది అర్హులైన తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేశారు. రెండో ఏడాది పాఠశాలల్లో పారిశుధ్యం కోసం అంటూ వెయ్యి రూపాయలు కోత విధించి రూ.14 వేలు మాత్రమే జమ చేశారు. ఈ ఏడాది మరో వెయ్యి రూపాయలు కోత విధించి రూ.13 వేలు మాత్రమే జమ చేశారు.

అమ్మఒడి.. కొందరికే...?

జిల్లాలో భారీగా తగ్గిన లబ్ధిదారులు

గత ఏడాది 2.68 లక్షలు 

ఈ ఏడాది 1.87 లక్షల మంది మాత్రమే

కడప(ఎడ్యుకేషన్‌), జూన్‌ 28: ‘పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లీ భయపడొద్దు... పిల్లలను బడికి పంపితే చాలు ఏటా రూ.15 వేలు ఇస్తాం..’ ఇదీ అమ్మఒడి పథకం ద్వారా ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భరోసా. తొలి ఏడాది అర్హులైన తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేశారు. రెండో ఏడాది పాఠశాలల్లో పారిశుధ్యం కోసం అంటూ వెయ్యి రూపాయలు కోత విధించి రూ.14 వేలు మాత్రమే జమ చేశారు. ఈ ఏడాది మరో వెయ్యి రూపాయలు కోత విధించి రూ.13 వేలు మాత్రమే జమ చేశారు. అయితే రెండేళ్లు పథకం ద్వారా లబ్ధిపొందిన కుటుంబాల్లోని కొందరిని మూడోసారి సాయానికి అనర్హులుగా చూపారు. మూడో విడత సాయాన్ని సోమవారం ముఖ్యమంత్రి విడుదల చేశారు. అర్హుల జాబితాలు రూపొందించినా.. ఈసారి ఆ బాధ్యత విద్యాశాఖకు కాక గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించారు. ఈ అర్హుల, అనర్హులు చిట్టాలో పలు కారణాలు పేర్కొంటూ చాలా మందిని పథకానికి దూరం చేయడంపై ఆక్షేపణ ఎదురవుతోంది. జిల్లాలో గత ఏడాది 2,68,076 మందికి రూ.402.11 కోట్లు లబ్ధి చేకూరగా.. ఈ ఏడాది 1,87,742 మందిని మాత్రమే అర్హులుగా ఎంపిక చేశారు. వీరి ఖాతాల్లో రూ.13 వేల చొప్పున రూ.281.61 కోట్లు జమ అయింది.

అర్హుల జాబితాలోనూ అలజడి..

అర్హుల జాబితాలో కొందరివి యాక్టివ్‌.. మరికొందరివి యాక్టివ్‌ లేనట్లు చెబుతున్నారు. బ్యాంకు ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం లేవని పేర్కొన్నారు. ఈకేవైసీ పెండింగ్‌లో ఉందని... మరి కొందరిని హోల్డులో పెట్టారు. తల్లి చనిపోయిన కేసుల్లో తండ్రి/ సంరక్షకుని పేరుతో కొత్త బ్యాంక్‌ ఖాతాలు ప్రారంభించకపోవడం, సర్టిఫికెట్‌ సమర్పించుకోవడం కూడా కారణాలుగా చెబుతున్నారు.

పేదల చుట్టూ.. ఆంక్షల ఉచ్చు 

ఒక్కో సచివాలయ పరిధిలో 20 నుంచి 60 మందికి తక్కువ లేకుండా అనర్హుల జాబితాలో చేరారు. కొవిడ్‌ వేళ పిల్లలను బడికి పంపడానికి తల్లిదండ్రులు వెనుకాడగా.. కొందరి హాజరు 75 శాతం కంటే తగ్గింది. ఎండల తీవ్రతతో విద్యుత్‌ యూనిట్ల వాడకం పెరిగింది. ప్రభుత్వ సాయంతో సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలు సైతం ఇంటి విస్తీర్ణం కారణంగా... కొందరు కుటుంబం పెద్ద కావడంతో పైన మరో ఇల్లు కట్టుకున్నా విస్తీర్ణం పెరిగి ఇరుకున పడ్డారు. కొత్తగా బియ్యం కార్డు పొందారని, ఉన్న కార్డులో సైతం పేర్లు, వయసుల్లో తేడాలు ఉన్నాయని అనర్హత వేటు వేశారు.


మూడు విడతల్లో అమ్మఒడి నిధుల విడుదల ఇలా...

సంవత్సరం   విద్యార్థులు  నిధులు

2019-20 2,55,587 రూ.383.38 కోటు

2020-21 2,68,076 రూ.402.11 కోట్లు

2021-22 1,87,742 రూ.281.61 కోట్లు


అనర్హతకు చూపుతున్న కారణాలివే..

- విద్యార్థుల హాజరు 75 శాతం లేదు 

- విద్యార్థి తల్లి పేరు రేషన్‌కార్డులో లేదు

- విద్యుత్‌ వినియోగం సగటున 300 యూనిట్ల కంటే ఎక్కువ

- పట్టణంలో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఇల్లు

- 3 ఎకరాలు అంతకంటే ఎక్కువ సాగు భూమి

- కుటుంబంలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి.. రూ.12 వేల కంటే ఎక్కువ జీతం రావడం

- నాలుగు చక్రాల వాహనం ఉండడం.

Updated Date - 2022-06-29T06:18:22+05:30 IST