Advertisement

గనిలో ఘోరం

May 9 2021 @ 00:11AM
మృతదేహాలను ఆటోలో తరలిస్తున్న దృశ్యం

మామిళ్లపల్లి సమీపంలో మందుగుండు పేలుళ్లు  

ఆరేడు కి.మీల వరకు ప్రకంపనలు

పది మంది కూలీల మృత్యువాత

చెల్లాచెదురుగా మృతదేహాల శరీర భాగాలు 

ఘటన స్థలంలో భయానక పరిస్థితి 

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ, ఎమ్మెల్సీ 

క్వారీని నిర్వహిస్తున్నది ఓ వైసీపీ నాయకుడు


ఒక్కసారిగా భారీ విస్ఫోటనం.. ఆకాశమెత్తు లేచిన పొగలు.. చుట్టుపక్కలున్న వారి చెవులు దిమ్మెర్లెత్తిపోయేలా శబ్దం.. ఆరేడు కి.మీ దూరం వినిపించిన శబ్దంతో అందరూ ఉలికిపడ్డారు. సమీపంలోని కలసపాడు మండలం మామిళ్ల పల్లెవాసులు భూంకంపం వచ్చిందేమో అనే భయంతో ఇళ్లలోంచి బయటకు వచ్చారు. ముగ్గురాళ్ల గనివద్ద మిన్నంటుతున్న పొగను చూసి భయపడ్డారు. ధైర్యంచేసి కొందరు అక్కడకు వెళ్లారు. అక్కడి దృశ్యాన్ని చూసిన వారి గుండెలు నీరైపోయాయి. మృతదేహాలు.. కాదు కాదు.. మాంసపు ముద్దలు.. చేతులొకచోట కాళ్లొకచోట తలలొకచోట.. ఏ భాగం ఎవ్వరిదో తెలీదు.. ఒకరు కాదు ఇద్దరు కాదు.. మొత్తం పదిమంది మృత్యువాతపడ్డారు. 


కడప, మే 8 (ఆంధ్రజ్యోతి): ఉదయం 9 గంటలు.. కరోనా వ్యాప్తి వల్ల జనం ఇళ్లకే పరిమితమయ్యారు. పలువురు రైతులు పొలం పనులకు వెళ్లారు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఒక్క క్షణంలో భారీ శబ్దం. ఆకాశంలో మేఘాల్లా ఆవరించిన పొగ.. ఆరేడు కి.మీలకు పైగా వినిపించిన శబ్దతరంగాలు. ఏం జరిగింది..? జనం ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.. మామిళ్లపల్లి గ్రామానికి 3 కి.మీల దూరంలో క్వారీలో ఎగిసిపడుతున్న మంటలు.. ఆకాశానికి తాకేలా పొగ. అక్కడికి వెళ్లేందుకు సాహసించగలరా.. కొందరు ధైర్యం చేసి అటువైపు అడుగులు వేశారు. ఘటనా స్థలానికి 200 మీటర్ల దూరంలో మృతదేహాల రక్తపు ముద్దలు కనిపించాయి. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. పది మంది మృతిచెందారు. ఈ ఘటనలో కలసపాడు మండలానికి చెందిన బత్తల ప్రసాద్‌ (40), పులివెందుల నియోజకవర్గం వేముల మండలానికి చెందిన సుబ్బారెడ్డి (40), బాలగంగులు (35), వెంకటరమణ (25), వెంకటేష్‌ (25), ఈశ్వరయ్య (45), గంగిరెడ్డి (50), లక్ష్మిరెడ్డి (60), అబ్దుల్‌ (30), పోరుమామిళ్లకు చెందిన డ్రైవర్‌ కొరివి ప్రసాద్‌ మృతి చెందారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఎస్పీ కేకేఎన అన్బురాజన, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పది మంది మృతిచెందినట్టుగా మైనింగ్‌శాఖ అధికారులు శనివారం రాత్రి ప్రకటించారు.


మందుగుండు దించుతుండగా ఘటన

శనివారం ఉదయం ఏపీ27బీఎస్‌8863 ఇతియోస్‌ వాహనం తెలుగుగంగ కట్ట మీదుగా క్వారీకి చేరుకుంది. అప్పుడు సమయం ఉదయం 9. గంటలు. ఆ సమయంలో 11 మంది కూలీలు అక్కడ ఉన్నారు. నీళ్ల కోసం ఇద్దరు క్వారీ నుంచి బయటకు వెళ్లారు. డ్రైవర్‌తో పాటు 9 మంది కూలీలు ఉన్నారు. ఆ కూలీలు వాహనంలో నుంచి జిలటిన స్టిక్స్‌, పేలుళ్లకు ఉపయోగించే మందుగుండు దించుతుండగా.. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయాయి.


మందుగుండు 150 కిలోలకు పైనే..

క్వారీలో ముగ్గురాళ్లు వెలికి తీసేందుకు భూగర్భంలో తవ్వకాలు చేస్తున్నారు. ఒక్కో షిప్టులో 10-15 మంది చొప్పున రెండు షిప్టుల్లో కూలీలు పనిచేస్తున్నారు. భూగర్భంలో 200 మీటర్ల వరకు తవ్వకాలు చేసి వ్యర్థాలను బయటకు తీస్తారు. ఆ తర్వాత ఘాతాలు (రంధ్రాలు) వేసి అందులో మందుగుండు సామగ్రి అమర్చి బ్యాటరీల సహాయంతో పేలుళ్లను జరుపుతారు. పేలుళ్ల అనంతరం క్రేన్ల సాయంతో ముగ్గురాళ్లు బయటకు తెచ్చి వాటిని వివిధ సైజుల్లో పగులకొట్టి సిమెంటు పరిశ్రమకు రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పేలుళ్ల కోసం వేంపల్లి గోదాము నుంచి దాదాపు 150 కిలోలకు పైగా మందుగుండు తెచ్చారని సమాచారం. దీన్ని దించే సమయంలోనే ఈ పేలుడు జరిగింది. వేంపల్లి నుంచి పెండ్లిమర్రి, కడప, చెన్నూరు, మైదుకూరు, పోరుమామిళ్ల పట్టణాలతో పాటు లింగంపల్లి, మహబూబ్‌నగర్‌ గ్రామాల మధ్యలో మందుగుండు రవాణా చేస్తున్నారు. రవాణా సమయంలో ఆయా పట్టణాల్లో అనుకోని పేలుళ్లు సంభవిస్తే.. భారీ జన నష్టం సంభవించి ఉండేదని అందరూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.


నిబంధనలు పాటించకనే..

కలసపాడు మండలం మామిళ్లపల్లి గ్రామానికి 3 కి.మీల దూరంలో సర్వే నెంబర్‌.1,133లో 30హెక్టార్లలో ముగ్గురాళ్ల గనులు ఉన్నాయి. ఈ క్వారీని ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య సతీమణి కస్తూరిబాయికి 2001 నవంబర్‌ 2న 20 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. 2013లో ఆమె నుంచి మైదుకూరు నియోజకవర్గం బి. మఠం మండలానికి చెందిన వైసీపీ నేత నాగేశ్వరరెడ్డి జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ) తీసుకున్నారు. ప్రస్తుతం ఈ క్వారీని ఆయనే నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్‌ వరకు అనుమతులు ఉన్నాయి. అయితే.. ఈ క్వారీని అధికారులు 2019 జనవరి 15, అక్టోబర్‌ 18, 2020 ఆగస్టు 21న తనిఖీ చేశారు. ఏపీఎంఎంసీ నిబంధనల ప్రకారం కౌలుదారుడు నిబంధనలు అతిక్రమించడంతో ఈ లీజును రద్దు చేయాలని 2020 సెప్టెంబర్‌ 26న లేఖ నెంబర్‌ 3423/ఎం1/2002 కింద గనుల భూగర్భవనరుల శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఈ మేరకు బి.మఠం మండలానికి చెందిన ముడుమాల పోలిరెడ్డి ఆర్టీఐ కింద అడిగిన దానికి కడప మైనింగ్‌ ఏడీ రవిప్రసాద్‌ సమాధానం ఇచ్చారు. పర్యావరణ అనుమతులు కూడా లేవని అందులో పేర్కొన్నారు. అదేరోజు ఈ క్వారీని రద్దుచేసి ఉంటే ఈ దుర్ఘటన జరిగేది కాదు. 


బాధితులకు న్యాయం చేస్తాం : ఎమ్మెల్సీ

కలసపాడు/కాశినాయన, మే 8: కలసపాడు మండలంలో సంభవించిన భారీ పేలుడుతో మృతిచెందిన బాధితుల కుటుంబాలకు న్యాయం చేస్తామని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అన్నారు. మామిళ్లపల్లె వద్ద ముగ్గురాళ్ల గనుల వద్ద శనివారం ఉదయం జరిగిన పేలుడుతో పదిమంది మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలాన్ని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎస్పీ కేకేఎన అన్బురాజన, మైదుకూరు డీఎస్పీ విజయ్‌కుమార్‌, పోరుమామిళ్ల, మైదుకూరు సీఐలు, పోలీసులు పరిశీలించారు. ఈ  సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ మృతిచెందిన ప్రతి ఒక్కరి కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.


ఏ ముక్క ఎవరిదో దేవుడా?

పోరుమామిళ్ల, మే 8: ఏ ముక్క ఎవరిదో ఆనవాలు ఎలా తెలిసేది దేవుడా? ఏమిటీ దారుణ పరిస్థితి అని గంగాయపల్లె వాసి బత్తల ప్రసాద్‌ భార్య జ్యోతి గద్గద స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు. మామిళ్లపల్లె క్వారీలో జరిగిన భారీ విస్ఫోటనంలో పదిమంది అక్కడికక్కడే మృతిచెందారు. వారి అవయవాలు గుర్తుపట్టలేని విధంగా మాంసం ముద్దల్లా పడి ఉన్నాయి. కలసపాడు మండలం గంగాయపల్లెకు చెందిన బత్తల ప్రసాద్‌ (35) శరీరం తునాతునకలై అవయవాలు చెల్లాచెదురై విగత జీవుడయ్యాడు. విషయం తెలుసుకున్న మృతుని భార్య జ్యోతి సంఘటన స్థలానికి చేరుకుని భోరున విలపించింది. 


మధ్యాహ్నానికి ఇంటికి వస్తానని వెళ్లాడు..

పేలుడులో మృతి చెందిన పోరుమామిళ్లలోని శ్రీరామ్‌నగర్‌ కాలనీ వాసి కొరివి ప్రసాద్‌ (34) డ్రైవరుగా జీవనం సాగించేవాడు. శనివారం తెల్లవారు ఝామున పులివెందులకు వెళ్లాడని, మధ్యాహ్నానికల్లా ఇంటికి తిరిగి వస్తాడని ఎదురు చూసిన భార్య ఝాన్సీకి పిడుగులాంటి వార్త తెలిసింది. దీంతో ఇద్దరు పిల్లలు సాయితేజ, శన్వితలను పట్టుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. కొరివి ప్రసాద్‌కు మూడేళ్ల కిత్రం తల్లిదండ్రులు మరణించారు. అతని అన్న కూడా కువైతలో మృతి చెందాడు.


ఆరుగురు వేముల మండల వాసులు

వేముల, మే 8: కలసపాడు మండలం మామిళ్లపల్లె ముగ్గురాయి క్వారీ వద్ద జరిగిన పేలుడులో చనిపోయిన వారిలో ఆరుగురు వేముల మండలానికిచెందిన వారున్నారు. వీరు మూడు నెలలుగా గనిలో పనులు చేస్తున్నారు. నెలకోమారు ఇంటికి వచ్చివెళ్లేవారు. బచ్చయ్యగారిపల్లెకు చెందిన ఈశ్వరయ్య(45)కు భార్య యశోద, కొడుకు శ్రీహరి, కూతురు అంజలి, రంగోరిపల్లెకు చెందిన కల్లూరు బాలగంగిరెడ్డి(50)కి భార్య నాగమల్లేశ్వరమ్మ, కొడుకులు గంగాధర్‌రెడ్డి, సీతారామిరెడ్డి, వి.కొత్తపల్లెకు చెందిన చాకలి బాలగంగులు(35)కు భార్య అంజనమ్మ, కొడుకులు మనోజ్‌, మహేష్‌, వి.కొత్తపల్లెకు చెందిన పొన్నతోట లక్ష్మీనారాయణరెడ్డి(60)కి భార్య సరస్వతమ్మ, కొడుకు రవిశేఖర్‌, వేములకు చెందిన షేక్‌ అబ్దుల్‌ (30)కు భార్య హైరూన, నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఐదు  కుటుంబాల్లోని యజమానులతో పాటు సుబ్బారెడ్డి (40) మరణించడంతో ఆ కుటుంబంలోను, గ్రామాల్లోను విషాదఛాయలు అలుముకున్నాయి. పేలుడులో మృతిచెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని టీడీపీ నేత, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన పార్థసారధిరెడ్డి, టీడీపీ నాయకులు హేమాద్రిరెడ్డి, బ్రహ్మయ్యలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి

పుట్టా సుధాకర్‌యాదవ్‌ డిమాండ్‌

మైదుకూరు, మే 8: ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లాలో అక్రమంగా మైనింగ్‌ నడపటం, అధికారుల నిరక్ష్యంతో పదిమంది అభాగ్యులు మృత్యువాత పడ్డారని, వీరికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించి, ప్రమాద ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని టీటీడీ మాజీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం సాయంత్రం ఆయన హైదరాబాదు నుంచి వర్చువల్‌లో విలేకరులతో మాట్లాడారు. అధికారుల నిర్లక్ష్యంతోనే మృత్యువాత పడ్డారని, విశాఖలోని ఎల్‌జీలో జరిగిన ఘటనలో చనిపోయిన కుటుంబాలకు సీఎం జగన్‌ కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించినట్లుగా ఇక్కడ కూడా ఒక్కొక్కరికి కోటి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.


సమగ్ర విచారణ జరపాలి : రాజశేఖర్‌ 

బద్వేలు, మే 8: ముగ్గురాళ్ల గనిలో జరిగిన పేలుడు ఘటనపై సమగ్ర విచారణ జరపాలని టీడీపీ నియోజకవర్గ బాధ్యుడు డాక్టర్‌ ఓబుళాపురం రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఎలాంటి రక్షణ పద్ధతులు అవలంబించకుండా పేలుడు పదార్థాలను అమాయకులైన కూలీల ద్వారా తరలించడంతోనే వారు మృతి చెందారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చట్టానికి వ్యతిరేకంగా ఈ గని నడుపుతున్నారని ఆరోపించారు.


ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

రాజంపేట టౌన / కడప, మే 8 (ఆంధ్రజ్యోతి) : మామిళ్లపల్లె ముగ్గురాళ్ల గనుల్లో జరిగిన పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమే్‌షనాయుడు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుల ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మైన్స అధికారుల పర్యవేక్షణ లేదని, వారిని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.


మైనింగ్‌ లీజు రద్దుకు చర్యలు

కడప, మే 8 (ఆంధ్రజ్యోతి) : కలసపాడు మండలం మామిళ్లపల్లె సమీపంలో పేలుళ్లు జరిగిన బెరైటీస్‌ క్వారీ లీజు రద్దుకు చర్యలు తీసుకుంటామని గనులు భూగర్భ వనరుల శాఖ సహాయ సంచాలకులు బి.రవిప్రసాద్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మామిళ్లపల్లె గ్రామ పరిధిలోని సర్వే నెంబర్‌ 1,133లోని 30.696 హెక్టార్లలో మైనింగ్‌కు సి.కస్తూరిబాయికి 2001 నవంబరు 2 నుంచి 2021 నవంబరు 21 వరకు లీజు గడువు ఉందని తెలిపారు. ఈ మైనింగ్‌ నిర్వహణ కార్యకలాపాలను సి.నాగేశ్వరరెడ్డికి 2013 డిసెంబరు 31న జీపీఏ హోల్డర్‌గా హక్కులు ఇచ్చారని తెలిపారు. లీజుదారుడి అజాగ్రత్త వల్ల పేలుడు జరిగిందని, కార్మిక శాఖ నష్టపరిహార చట్టం 1923 ప్రకారం నిర్ణయించిన నష్టపరిహారాన్ని మృతి చెందిన కూలీల కుటుంబాలకు లీజుదారుల నుంచే ఇప్పిస్తామని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన లీజుదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పేలుడు పదార్థాలను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉపయోగించనందువల్ల చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు శాఖకు, మైనింగ్‌ డైరెక్టర్‌కు సూచించామని పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే గనులు భూగర్భ వనరుల శాఖ సంచాలకులు బీవీ వెంకటరెడ్డి, సహాయ సంచాలకులు బి.రవిప్రసాద్‌, కడప ఉప సంచాలకులు బాలాజీ నాయక్‌,  రీజనల్‌ విజిలెన్స స్క్వాడ్‌ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.


మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

మామిళ్లపల్లె సమీపంలో శనివారం జరిగిన పేలుడులో మృతిచెందిన బాధితుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.5లక్షలు పరిహారం ఇవ్వనున్నట్టు కలెక్టర్‌ హరికిరణ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధులను డిస్ర్టిక్ట్‌ మినరల్‌ ఫండ్స్‌ నుంచి ఇస్తామని తెలిపారు. దీంతో పాటు కార్మిక శాఖ నిర్ణయించిన నష్టపరిహారం అదనంగా చెల్లిస్తారని కలెక్టర్‌ వివరించారు. ఈ ఘనటపై విచారణకోసం జేసీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

 
పేలుడు సంభవించిన ప్రాంతంలో పైకి ఎగసిన పొగ


భర్త లేడని తెలిసి రోదిస్తున్న బత్తల ప్రసాద్‌ భార్య జ్యోతి


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.