ఎన్‌పీఎస్ నుండి పాక్షిక ఉపసంహరణ ఓకే...

ABN , First Publish Date - 2021-03-04T22:04:43+05:30 IST

నేషనల్ పెన్షన్ సిస్టం(ఎన్‌పీఎస్) నుండి పాక్షిక ఉపసంహరణ కోసం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) పలు మార్పులు చేసింది.

ఎన్‌పీఎస్ నుండి పాక్షిక ఉపసంహరణ ఓకే...

న్యూఢిల్లీ : నేషనల్ పెన్షన్ సిస్టం(ఎన్‌పీఎస్) నుండి పాక్షిక ఉపసంహరణ కోసం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) పలు మార్పులు చేసింది. పదవీవిరమణ తర్వాత మరింత ప్రయోజనముండేలా రిటైర్మెంట్ సేవింగ్ స్కీంగా మార్చేందుకు నిబంధనల్లో మార్పులు తెచ్చింది. గతంలో పెన్షన్ ఫండ్ నుండి పాక్షిక ఉపసంహరణకు ఎన్‌పీఎస్ నిబంధనలు అనుమతించేవి కావన్న విషయం తెలిసిందే. తాజాగా... మార్చిన నిబంధనల నేపధ్యంలో... పెన్షన్ ఫండ్ నుండి పాక్షిక ఉపసంహరణకు ఎన్‌పీఎస్ సభ్యులకు అవకాశం కల్పిస్తుంది. ఎన్‌పీఎస్ పాక్షిక ఉపసంహరణ కూడా మరింత సులభతరమవుతోంది. అయితే ఉపసంహరణకు సంబంధించి కొన్ని ముందస్తు షరతులుంటాయి.


ఉపసంహరణకు నిబంధనలివీ... 

ఎన్‌పీఎస్ సభ్యులకు మూడేళ్ల తర్వాత మాత్రమే పాక్షిక ఉపసంహరణకు అవకాశం లభిస్తుంది. ఇక... ఎంతమేరకు ఉపసంహరించుకోగలమన్న అంశానికి సంబంధించి పరిమితి ఉంది. ప్ర‌తీ స‌బ్‌స్క్రైబ‌ర్ త‌న కాంట్రిబ్యుషన్‌లో 25 శాతం వ‌ర‌కు ఉపసంహరణ చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకు రూ. 6 లక్షల కార్పస్ ఫండ్ ఉంటే అందులో రూ. 1.5 లక్షలను ఉపసంహరించుకోవచ్చు. ఇదివరకు ఎన్‌పీఎస్ సబ్‌స్క్రైబర్లకు పాక్షిక ఉపసంహరణకు అవకాశముండేది కాదు. ఇప్పుడు ఉపసంహరణకు అవకాశమున్నప్పటికీ, ప్రత్యేక సందర్భాలు, షరతులు ఉంటాయి.


ఎన్నిసార్లు తీసుకోవచ్చు ?

ప్రత్యేక పరిస్థితులుంటే అత్యవసర సందర్భాల్లో నగదును ఉపసంహరించుకోవచ్చు. ఉదాహరణకు పిల్లల పెళ్లిళ్ళు, చదువులు, ఆస్తుల కొనుగోలు, అనారోగ్యం, వైకల్యం వంటివి జరిగిన సందర్భాల్లో తీసుకోవచ్చు. ఎంత నగదుతీసుకోవాలనే పరిమితితో పాటు ఎన్నిసార్లు తీసుకోవాలనే పరిమితులు కూడా ఉన్నాయి. టెన్యూర్ మొత్తంలో మూడుసార్లు నగదును ఉపసంహరించుకోవచ్చు. అలాగే, ప్రతీ రెండు ఉపసంహరణల మధ్య కనీసం అయిదేళ్ల కాలపరిమితి ఉండాలి. అయితే అనారోగ్యం, చికిత్సవంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ కాలపరిమితి నుండి మినహాయింపు ఉంటుంది.

Updated Date - 2021-03-04T22:04:43+05:30 IST