డ్వాక్రా మహిళల సభ్యత్వ నగదు స్వాహా

ABN , First Publish Date - 2022-07-07T05:26:02+05:30 IST

స్వయం సహాయక సంఘాల మహిళలు పైసా పైసా కూడబెట్టుకుని చెల్లించిన సభ్యత్వ నగదు గోల్‌మాల్‌ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

డ్వాక్రా మహిళల సభ్యత్వ నగదు స్వాహా
డ్వాక్రా గ్రూపులతో సమావేశమైన వెలుగు ఏపీఎం జీవన్‌

వీవోఏ, సీసీలు రూ.3లక్షలు కాజేశారంటున్న సభ్యులు

యడ్లపాడు, జూలై 6: స్వయం సహాయక సంఘాల మహిళలు పైసా పైసా కూడబెట్టుకుని చెల్లించిన సభ్యత్వ నగదు గోల్‌మాల్‌ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఐదేళ్లుగా జరుగుతున్న ఈ వ్యవహారం బుధవారం బయటపడడంతో డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలలోకి వెళితే.. మండలంలోని బోయపాలెం గ్రామంలోని 53 డ్వాక్రా గ్రూపులున్నాయి. ఆయా గ్రూపులలోని 530 మంది సభ్యులు గ్రామ సమాఖ్యలో సభ్యులుగా ఉన్నారు. వీరు ఏటా సమాఖ్య సభ్యత్వం కింద ఒక్కొక్కరు రూ.250 చొప్పున యానిమేటర్‌(వివోఏ)కు చెల్లించారు. అయితే యానిమేటర్‌, సీసీలు సభ్యుల నుంచి తీసుకున్న సభ్యత్వ నగదుకు రశీదులు ఇవ్వకపోగా ఆ నగదును బ్యాంకులో కూడా జమచేయలేదు. సభ్యత్వ రుసుం చెల్లింపు విషయమై ఏపీఎం డ్వాక్రా మహిళలతో సమావేశం నిర్వహించారు. 2015-16 నుంచి ఇప్పటివరకు 53 సంఘాలకు సంబంధించి రూ.3లక్షలు సభ్యత్వ రుసుం బకాయి ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుత సంవత్సరంతో కలిపి పెండింగ్‌ మొత్తాన్ని చెల్లించాలని లేకుంటే మీ ఖాతాల నుంచి జమచేసుకుంటామన్నారు. అయితే మహిళలు తాము ఏటా చెల్లిస్తూనే ఉన్నామని, పెండింగ్‌ ఏమీ లేదని ఏపీఎంకు తెలిపారు. ఈ విషయమై వీవోఏను పిలిపించి ఆరా తీయగా తాను వసూలు చేసిన మొత్తాలను సీసీకి అందజేశానని, రశీదులు కూడా ఇచ్చానని చెప్పారు. దీనితో ఆగ్రహించిన మహిళలు తమకు ఎలాంటి రశీదులు ఇవ్వలేదని, వీవోఏనే కాజేసిందని ఆరోపించారు. దీనితో మహిళలకు, అధికారులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు  ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. దీనితో శాంతించిన డ్వాక్రా మహిళలు వీవోఏ, సీసీలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమయ్యారు. 

 

Updated Date - 2022-07-07T05:26:02+05:30 IST