అమరావతే రాజధాని... కేంద్రం ఒప్పుకుంది: జీవీఎల్

ABN , First Publish Date - 2021-12-19T00:01:16+05:30 IST

ఏపీ రాజధాని అమరావతేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ విషయాన్ని ఒప్పుకుందని ఆయన స్పష్టం చేశారు.

అమరావతే రాజధాని... కేంద్రం ఒప్పుకుంది: జీవీఎల్

అనంతపురం: ఏపీ రాజధాని అమరావతేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ విషయాన్ని ఒప్పుకుందని ఆయన స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలనతో రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి తీసుకుపోయారని విమర్శించారు. రెండు దశాబ్దాలుగా చేసిన అప్పులకంటే వైసీపీ రెండున్నరేళ్ల పాలనలోనే రెట్టింపు అప్పులు చేశారన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ. 25800 కోట్లు ఖర్చు చేసిందని జీవీఎల్ తెలిపారు.


రాష్ట్రంలో మూడు కారిడార్‌లు, 5 పారిశ్రామిక నగరాల అభివృద్ధికి 80 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర వాటా నిధులు ఇప్పటికీ మంజూరు చేయలేదని ఆయన విమర్శించారు. ఉపాధిహామీ పథకానికి దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులను ఏపీకి కేంద్రం ఇచ్చిందని తెలిపారు. కృష్ణా, గోదావరి బోర్డుల ఏర్పాటుకు డీపీఆర్‌లు ఇవ్వాలని కోరినా... ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని తప్పుబట్టారు. ఈ ఏడాదిలోనే రెవెన్యూలోటు పూడ్చడంలో భాగంగా రూ.11,600 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తున్నా... జగన్‌ అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని దివాలా స్థాయికి తీసుకెళ్లారని జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. 

Updated Date - 2021-12-19T00:01:16+05:30 IST