Advertisement

విషాద ఘట్టంలో అమరావతి

Oct 21 2020 @ 03:16AM

నవ్యాంధ్రలో రాజధాని ‘రణం’ జరుగుతున్నా, కేంద్రప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శించటం గమనార్హం. ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణానికి దేశ ప్రధాని శ్రీకారం చుట్టిన శంకుస్థాపన శిలాఫలకం ఉద్యమాలకు వేదికగా మారటం సీమాంధ్రుల దురదృష్టంగానే భావించాలి. రాజధానిని కాపాడుకోవలసిన ఆవశ్యకతని మూడు ప్రాంతాల సీమాంధ్రులు గుర్తించగలిగినపుడే ‘మూడు ముక్కలాట’ వంటి ఓట్ల రాజకీయాలకు తెరపడుతుంది.


అక్టోబరు 22వ తేదీ. సీమాంధ్రలో 13 జిల్లాల ప్రజలు మరువలేని, మరచిపోలేని గొప్ప రోజు. సీమాంధ్రుల చరిత్రకే ఆ రోజు గర్వ కారణం కూడా. ఎందుకంటే, రాజధాని లేని సీమాంధ్రులు అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకున్న రోజు అదే. సరిగ్గా ఐదేళ్ళ క్రితం 2015 అక్టోబర్‌ 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా రాజధాని గ్రామమైన అమరావతిలోని ఉద్దండరాయుని పాలెం విచ్చేశారు. దేశంలోని పుణ్యనదుల నుండి పవిత్ర నదీ జలాలను, మట్టిని ఆయన తీసుకువచ్చారు. దేశ ప్రజల సాక్షిగా, సీమాంధ్ర ప్రజల సమక్షంలో రాజధాని మహాక్రతువుకు శంకుస్థాపన చేశారు. ప్రధానితోపాటు అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అన్ని పక్షాల రాజకీయ ప్రముఖులు ఈ రాజధాని మహా యజ్ఞానికి హాజరయ్యారు. భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ల నుంచి మత పెద్దల మంత్రోచ్ఛారణలు, జైన, బౌద్ధ ప్రవక్తల బోధనలు మిన్నంటాయి. ఐదున్నర కోట్ల సీమాంధ్ర ప్రజల రాజధాని నిర్మాణ సంకల్ప బలానికి, సంతృప్తికి రాజధాని నిర్మాణ శ్రీకార ప్రక్రియ జయ జయ ధ్వానాల మధ్య దిగ్విజయంగా పూర్తిచేసారు. రాజధాని అమరావతి నిర్మాణంలో రెండు బలమైన అంశాలను ఏ ఒక్కరూ కాదనలేరు. అలాంటి సాహసం కూడా చేయలేరు. వీటిలో ఒకటి 56 ఏళ్ళపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను, రాష్ట్ర విభజన కారణంగా సీమాంధ్ర ప్రజలు కోల్పోవటం. తత్ఫలితంగా సీమాంధ్రకు రాజధాని ఆవశ్యకత ఏర్పడటం. రెండోది రాజధాని లేని ఏపీకి అప్పటి ప్రభుత్వ కోరిక మేరకు 29 గ్రామాలకు చెందిన 28,881 మంది రైతులు 34,324 ఎకరాలను భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) పద్ధతిలో ప్రతిఫలం ఆశించకుండా త్యాగం చేయటం. అంటే రాజధాని కోల్పోయి గాయపడ్డ సీమాంధ్రకు అమరావతి రైతులు ముందుకు వచ్చి తరతరాల స్వార్జిత పంటపొలాలను రాజధాని నిర్మాణానికి ఇవ్వటం దేశ చరిత్రలోనే అద్భుత ఘట్టం. అలాంటి రాజధాని అమరావతిని ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వై.యస్‌.జగన్మోహనరెడ్డి కాలదన్నటం, ‘మూడుముక్క లాట’తో అమరావతిపై కత్తిదుయ్యటం మహా దుర్మార్గం. నిజానికి రాజధాని అమరావతిపై జగన్‌ కక్ష కడతారని, రాష్ట్ర ప్రజలు భావించలేదు. స్వపార్టీ ఎమ్మెల్యేలు 13 జిల్లాల సీమాంధ్రకు 3 రాజధానుల ఫార్ములాను తెరపైకి తెస్తారని ఊహించనూ లేదు. అయినా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఏకపక్షంగా,  మూడు రాజధానుల నిర్ణయాన్ని గత ఏడాది డిసెంబర్‌ 17న అసెంబ్లీలో ప్రకటించారు. అప్పటికే రాజధాని నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 10 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాయి. పరిపాలనకు అవసరమైన సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి, హైకోర్టు, రహదారి సౌకర్యం, విద్యుత్‌ సౌకర్యం వంటి ప్రధాన అవసరాలను పూర్తిచేసాయి. పలు భవన సముదాయాలను 60% నుండి 90% వరకు పూర్తిచేసారు. అయినా కూడా వీటి అన్నింటినీ లెక్కపెట్టకుండా ముఖ్యమంత్రి జగన్‌ అమరావతిపై పలు అబద్ధాలను, అసత్యాలను ప్రచారం చేసారు. ఎడారి అని ఒకరు, స్మశానం అని మరొకరు, ఒక సామాజిక వర్గం అని ఒకరు, వరదలొస్తాయని ఇంకొకరు, ఆఖరికి ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ అని ఇలా వంద అబద్ధాలను ప్రచారం చేశారు. ప్రభుత్వాలు మారితే రాజధానులు మారతాయన్న అసత్యాన్ని సత్యం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు మొదలు పెట్టిన నాటినుండి అమరావతి రైతులు ఉద్యమ బాట పట్టారు. 29 గ్రామాలలోను దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసుకొని గాంధేయ మార్గంలో ముఖ్యంగా మహిళలు ఉద్యమానికి నడుం కట్టారు. ధర్మపోరాటానికి దిగిన రైతు ఉద్యమంపై ప్రభుత్వం దూకుడుగానూ, కర్కశంగానూ పోలీసు పాదం మోపింది. గ్రామాలు పోలీసు కవాతులతో, పదఘట్టనలతో మారుమ్రోగాయి. మహిళలను అవమానించారు. పలు పేర్లుపెట్టి ఎగతాళి చేసారు. అమరావతి రైతులు ఒకపక్క దీక్షలు కొనసాగిస్తూనే, మరోపక్క న్యాయపోరాటానికి దిగారు. ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానులు, సిఆర్‌డిఏ రద్దు బిల్లులను వ్యతిరేకిస్తూ దాదాపు 230కు పైగా ప్రజావ్యాజ్యాలను దాఖలు చేసారు. రాష్ట్ర ప్రజలతోపాటు దేశ ప్రజలు కూడా తమ న్యాయమైన సమస్యను గుర్తించేలా ఢిల్లీ వెళ్ళి మరీ పోరాటం చేసారు. రాజధాని అమరావతికి పలు రాజకీయ పక్షాలు, పలు బహుజన సంఘాలు మద్దతుగా నిలిచాయి. అమరావతిలో భూములిచ్చిన రైతుల గణాంకాలను ప్రజలముందు ఉంచి ప్రభుత్వ తప్పుడు ప్రచారాన్ని పటాపంచలు చేశాయి. ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లు ముఖ్యమంత్రి మొండివైఖరి చిలికి చిలికి గాలివానగా మారి న్యాయవ్యవస్థనే సవాలు చేసే అనాలోచిత నిర్ణయాల దిశగా సాగిందని కూడా చెప్పవచ్చు. రాజధానికి నోచుకోని నవ్యాంధ్రలో రాజధాని ‘రణం’ జరుగుతున్నా, కేంద్రప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శించటం గమనార్హం. ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణానికి దేశ ప్రధాని శ్రీకారం చుట్టిన శంకుస్థాపన శిలాఫలకం ఉద్యమాలకు వేదికగా మారటం సీమాంధ్రుల దురదృష్టంగానే భావించాలి. రాజధానిని కాపాడుకోవలసిన ఆవశ్యకతని మూడు ప్రాంతాల సీమాంధ్రులు గుర్తించగలిగినపుడే ‘మూడు ముక్కలాట’ వంటి ఓట్ల రాజకీయాలకు చరమగీతం పాడవచ్చు. అప్పటి వరకు రాజధాని అమరావతి రక్షణ కొరకు ప్రాంతీయ భావోద్వేగాలకు అతీతంగా ఐక్య పోరాటం చెయ్యటం సీమాంధ్రుల బాధ్యతగానే పరిగణించాలి.

పోతుల బాలకోటయ్య

అమరావతి బహుజన జెఎసి కన్వీనర్‌

(అక్టోబర్‌ 22: అమరావతి శంకుస్థాపనకు ఐదేళ్ళు)

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.