పల్లెకు వరం ‘అమృత్‌ సరోవర్‌’

ABN , First Publish Date - 2022-05-24T05:47:19+05:30 IST

చెరువులను పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ కాకతీయను అమలు చేసినట్టే కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే తరహాలో మిషన్‌ అమృత్‌ సరోవర్‌ పేరుతో కార్యక్రమాన్ని అమలు చేయబోతోంది. ఈ పథకం కింద ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొదటి విడతగా మొత్తం 450 చెరువులను ఎంపిక చేశారు. వీటిలో 50 శాతం చెరువులు మిషన్‌ కాకతీయ కింద గతంలో మరమ్మతు చేసినవే. కాకపోతే అవన్నీ ఇప్పుడు దెబ్బతిని ఉన్నాయి. మిషన్‌ కాకతీయ కింద అభివృద్ధి చేయనివి ఉమ్మడి జిల్లాలో ఇంకా చాలా చెరువులు ఉన్నాయి.

పల్లెకు వరం ‘అమృత్‌ సరోవర్‌’

దెబ్బతిన్న చెరువుల మరమ్మతులకు కేంద్రం నూతన పథకం
ఉమ్మడి జిల్లాలో 450 ఎంపిక
రూ.40 కోట్ల వ్యయంతో కొత్తరూపు
ఉపాధి హామీ పథకం కింద పనులు
వచ్చే ఆగస్టు 15 నాటికి పూర్తి



హనుమకొండ, మే 23 (ఆంధ్రజ్యోతి): చెరువులను పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ కాకతీయను అమలు చేసినట్టే కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే తరహాలో మిషన్‌ అమృత్‌ సరోవర్‌ పేరుతో కార్యక్రమాన్ని అమలు చేయబోతోంది. ఈ పథకం కింద ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొదటి విడతగా మొత్తం 450 చెరువులను ఎంపిక చేశారు. వీటిలో 50 శాతం చెరువులు మిషన్‌ కాకతీయ కింద గతంలో మరమ్మతు చేసినవే. కాకపోతే అవన్నీ ఇప్పుడు దెబ్బతిని ఉన్నాయి. మిషన్‌ కాకతీయ కింద అభివృద్ధి చేయనివి ఉమ్మడి జిల్లాలో ఇంకా చాలా చెరువులు ఉన్నాయి.

మిషన్‌ అమృత్‌ సరోవర్‌ కింద ఎంపిక చేయడంలో వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ కార్యక్రమం కింద జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ బాగా దెబ్బతిన్న, తక్షణమే పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నా, వాటి ఆయకట్టు పరిధి ప్రాతిపదికగా ఒక్కో జిల్లా నుంచి 125 నుంచి 150 చెరువులను గుర్తించి ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేంద్రం ప్రాథమికంగా ఒక్కో జిల్లా నుంచి 75 చెరువులను ఎంపిక చేసింది. ఈ పథకం ద్వారా జాతీయ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్‌) నిధులతో ఎంపిక చేసిన చెరువుల్లో పూడికతీత, కట్టల బలోపేతం, తూములు, మత్తళ్ల మరమ్మతు లాంటి పనులు చేస్తారు. అవకాశం ఉన్నచోట కొత్త చెరువులు నిర్మిస్తారు. ఇందుకోసం ప్రతీ చెరువుకు రూ.లక్ష నుంచి రూ.10లక్షల దాకా ఖర్చు చేస్తారు.

గ్రామాలకు వరం

చెరువుల పరిస్థితి తిరిగి యథాస్థితికి రావడంతో వాటిని మరమ్మతులు చేయాలని రైతుల నుంచి వినతులు అందుతున్నాయి. ఈలోగా కేంద్రం దేశ వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణకు అమృత్‌ సరోవర్‌ పథకాన్ని తీసుకువచ్చింది. అమృత్‌ సరోవర్‌ పథకం గ్రామాలకు వరంగా మారనుంది. ఈ పథకం కింద ఎంపిక చేసిన చెరువులను ఈజీఎ్‌సలో అభివృద్ధి చేస్తారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా కేంద్రం కోరింది. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు గతంలో మిషన్‌ కాకతీయ కింద చేపట్టని చెరువులతో పాటు ఈ పథకం కింద అభివృద్ధి చేసినప్పటికీ నాసిరకం పనుల వల్ల తిరిగి దెబ్బతిన్న చెరువులను కూడా ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపారు.

ఈ లెక్కన ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొదటి దశలో 450 చెరువులు ఎంపికయ్యాయి. వీటిలో 175 చెరువులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. ఇవన్నీ కొత్త చెరువులే. దీంతో పాటు కొత్త చెరువులను నిర్మిస్తారు. వరదనీరు ఎక్కువగా ప్రవహించే పల్లపు ప్రాంతాల్లో కుంటల నిర్మాణాన్ని కూడా చేపడతారు. వీటిని ఆగస్టు 15వ తేదీ లోగా అభివృద్ధి చేయాలని కేంద్రం ఆదేశించింది. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి ఈ ప్రాజెక్టు నూటికి నూరు శాతం అమలయ్యేలా ప్రణాళికలను రూపొందించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇప్పటికే దాదాపు 60 చెరువుల్లో పనులు ప్రారంభమయ్యాయి.

కొత్తవి, పాతవి
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 1600 చెరువులు ఉండగా ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేసి నాలుగు విడతల్లో 1100 చెరువులను అభివృద్ధి చేసింది. చాలా చోట్ల పనుల్లో నాణ్యత లేక అవి ఏడాది తిరక్కముందే కట్టలు తెగిపోవడంతో పాటు తూములు, మత్తళ్లు దెబ్బతిన్నాయి. ఎప్పటిలాగే తిరిగి పూడుకు పోయాయి. కొన్ని చెరువులకు మరమ్మతులు చేయకుండా కాంట్రాక్టర్లు బిల్లులు తీసుకున్నారు. మిషన్‌ కాకతీయ కింద కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయి. చాలా పనులను అధికార పార్టీకి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు బినామీ పేర్ల మీద చేపట్టి తూతూ మంత్రంగా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

సాగు, తాగునీరు
భూగర్భ జలాలు పెంచడం ద్వారా తాగు, సాగునీటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో చెరువులను అభివృద్ధి చేయడానికి కేంద్రం అమృత్‌ సరోవర్‌ స్కీంను తెచ్చింది. ఈ పథకం కింద ప్రతీ చెరువుకు కనిష్ఠంగా రూ.లక్ష నుంచి గరిష్ఠంగా రూ.10లక్షలు ఖర్చు చేయనున్నారు. అవసరమైతే 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా వినియోగించుకునే వెసులుబాటు కూడా కల్పించారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈ కొత్త పథకం కింద సుమారు రూ.35కోట్ల నుంచి రూ.40కోట్లు వెచ్చించే అవకాశాలున్నాయని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఎలాంటి యంత్రాలు వాడకుండా కేవలం ఉపాధి హామీ కూలీల ద్వారానే పనులు చేపడతారు. దీంతో వచ్చే వానాకాలం పంటల సాగు నాటికి వీలైనంతమేర కూలీలకు ఉపాధి పనులు దొరకనున్నాయి.

ఈ పథకం ద్వారా పనులు జరిగే ప్రతీ చెరువు కింద లక్ష పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. పనుల్లో భాగంగా చెరువు అడుగు భాగంలో 10వేల ఘనపుటడుగుల మేర నీటిని నిల్వ ఉండేలా కొలతలు ఇచ్చి ఆ మేరకు ఒండ్రు మట్టిని తీయనున్నారు. ఒండ్రు మట్టిని పొలాలకు తరలించుకునేందుకు, చెరువు కట్ట పటిష్టానికి ఉపయోగించనున్నారు. చెరువుల్లోని ఒండ్రు మట్టిని ఎటు తరలించాలి, దేనికి ఉపయోగించాలనే విషయంలో తుది నిర్ణయం గ్రామపంచాయతీలదే. కట్టపై పెరిగిన కంపచెట్లను తొలగిస్తారు. పనులు పూర్తయితే వచ్చే వానాకాలం చెరువులు జలకళను సంతరించుకోనున్నాయి.  గ్రామపంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అమృత్‌ సరోవర్‌ పనులు అమలవుతాయి. ఎంపిక చేసిన చెరువుల్లో పనులు పూర్తి చేసి కట్ట పటిష్టం చేశాక చెరువు కట్టపై స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15న జాతీయ జెండాను ఎగురవేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2022-05-24T05:47:19+05:30 IST