అమృత కాలం సరే, వర్తమానం మాటేమిటి?

Published: Wed, 04 May 2022 02:11:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అమృత కాలం సరే, వర్తమానం మాటేమిటి?

భారతదేశం అభివృద్ధిలో వెలిగిపోతోందని, టెక్నాలజీ, స్టార్టప్‌ల విప్లవం నడుస్తోందని, రానున్న 25ఏళ్ల అమృత్ కాలంలో సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల ఎక్కడకు వెళ్లినా చెప్పుతున్నారు. జర్మనీలో భారతీయుల ముందు కూడా ఆయన ఇవే మనోభావాలను వ్యక్తం చేశారు. పనిలో పనిగా కాంగ్రెస్ హయాంలో దళారీలే ప్రజలకు చేరాల్సిన నిధులలో అత్యధిక మొత్తాన్ని కబళించేవారని పరోక్షంగా ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు.


స్వాతంత్ర్యం వచ్చి 75సంవత్సరాలు పూర్తయిన రీత్యా రానున్న పాతికేళ్ల కాలంలో సాధించాల్సిన లక్ష్యాలను ప్రధానమంత్రి స్వయంగా ఉల్లేఖించి, అందుకు తగ్గట్లుగా పనిచేయాలని ప్రోత్సహించడం ఆహ్వానించదగిన విషయమే. అయితే నిజంగా మనం అమృత్ కాలానికి తగ్గట్లుగా పనిచేసేందుకు సన్నద్ధంగా ఉన్నామా, అందుకు మనం ఎదుర్కోవాల్సిన సవాళ్లేమిటి అన్న విషయం చర్చించవలిసి ఉంటుంది. కొవిడ్‌తో సంభవించిన ఆర్థిక నష్టాలను భర్తీ చేసుకునేందుకే భారతదేశానికి దాదాపు 12 సంవత్సరాలు పడుతుందని, గత మూడేళ్లలో రూ. 50 లక్షల కోట్లు కోల్పోయామని భారతీయ రిజర్వ్ బ్యాంకు తాజా నివేదిక స్పష్టం చేసిన రీత్యా మోదీ ప్రకటించిన అమృత్ కాలంలో దాదాపు సగం సమయం ఈ నష్టాల భర్తీకే పడుతుందని మనం గ్రహించక తప్పదు.


దేశంలో ప్రస్తుతం నెలకొన్న దుర్భర పరిస్థితికి అనేక కారణాలున్నాయి. పెద్ద నోట్ల రద్దు, కొవిడ్ మహమ్మారి, ప్రభుత్వ ఆర్థిక విధానాల నుంచి, ఉక్రెయిన్‌పై రష్యా దాడి వంటి అంతర్జాతీయ పరిణామాల వరకూ ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇవాళ అన్నిటికన్నా పెద్ద సమస్య నిరుద్యోగం. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) తాజా నివేదిక ప్రకారం దాదాపు 45 కోట్ల మంది నిరుద్యోగులు సరైన ఉద్యోగావకాశాలు లేక తల్లడిల్లిపోతున్నారు. దేశంలో 85 శాతం కార్మికులు అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నందువల్ల ఎన్ని కోట్ల మంది ఉపాధి కోల్పోయారో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. మౌలిక ప్రజా సేవల రంగంలో కూడా ఉపాధ్యాయులు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత కొట్టొచ్చినట్లు కనపడుతోంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం చూస్తే మన దేశంలో విద్యార్థులు–టీచర్లు, వైద్య సిబ్బంది–రోగుల నిష్పత్తి ఎంతో తక్కువ. ప్రతి ఐదుగురు కాలేజీ గ్రాడ్యుయేట్లలో ఒక్కరు నిరుద్యోగిగా మిగిలిపోతున్నారని సిఎంఐఇ తెలిపింది. గత ఏడాది భారతీయ రైల్వేలో 35వేల గుమాస్తా ఉద్యోగాల కోసం కోటీ 20లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఏప్రిల్ డేటా ప్రకారం పట్టణాల్లో నిరుద్యోగ శాతం 9.22 ఉంటే, గ్రామాల్లో అది 7.29 శాతానికి చేరుకున్నదని తెలిపింది. గ్రామీణ ఉపాధి పథకం క్రింద నమోదు చేసుకున్న వారిలో సగం మంది మాత్రమే క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. సంవత్సరానికి 80రోజుల పని లభించిన కుటుంబాలు కేవలం 6శాతం మాత్రమేనని గణాంక వివరాలు చెబుతున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా ఒక ఆందోళనకరమైన పరిణామం మన దేశంలో నెలకొంటోంది. ఉద్యోగాలు దొరుకుతాయన్న నమ్మకం లేక లక్షలాది మంది భారతీయులు, ముఖ్యంగా మహిళలు పనికోసం వెతుక్కోవడమే మానేశారని ఒక అంచనా. ఇలాంటి వారి సంఖ్య రోజురోజుకూ పెరగడం ఆర్థిక, సామాజిక సంక్షోభానికి సూచికగా నిపుణులు భావిస్తున్నారు. గత అయిదేళ్లలో వీరి సంఖ్య 40 నుంచి 46 శాతానికి పెరిగింది. ప్రతి రోజూ యువకులు కూలీపనుల కోసం, ఉద్యోగాల కోసం ముందుకు వస్తున్నా వారికి ఉద్యోగాలు కల్పించే స్థితి దేశంలో లేదని, ఒక దశ తర్వాత వారు పనికోసం అన్వేషించడం కూడా మానుకుంటారని అంటున్నారు. ఏటా దాదాపు 50లక్షల మంది చదువుకున్న యువత ఉద్యోగాలు అన్వేషిస్తోందని, కాని వారికి ఉద్యోగాలిచ్చేవారే లేరని తెలుస్తోంది. కరోనా సమయంలో టైలరింగ్, బ్యూటీపార్లర్లు, స్టేషనరీ షాపులు వంటి అనేక చిన్న, సూక్ష్మ మధ్య తరహా సంస్థలు మూతపడ్డాయి. యువతుల్లో సగం మంది పని దొరకని వారో, లేక పనికోసం వెతుక్కోకుండా ఉండిపోయిన వారో ఉన్నారు. సిఎంఐఇ డేటా ప్రకారం వ్యవసాయేతర ఉద్యోగాలు 2022 మార్చి నాటికి కోటీ 67 లక్షలు పడిపోగా, వ్యవసాయంలో పనిచేసే వారు కోటీ 53లక్షల మంది పెరిగారు. ప్రభుత్వం ఇచ్చే రేషనే లేకపోతే నిరుద్యోగం అగ్ని పర్వతంలా బద్ధలయేదని అనే వారు కూడా ఉన్నారు. దేశంలో 80కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలను సరఫరా చేస్తున్నామని ప్రభుత్వమే చెప్పుకుంటోంది. అసలు ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు తిండిగింజల కోసం చేయిచాచవలిసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వ్యవసాయ సంక్షోభమూ విస్మరించదగిన పరిస్థితిలో లేదు. జాతీయ క్రైమ్ రికార్డు బ్యూరో ప్రకారం రైతుల ఆత్మహత్యలూ పెరుగుతున్నాయి. తాజాగా పంజాబ్‌లో అప్పులు, పంటల వైఫల్యం వల్ల ఒకే నెలలో 15మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.


పెరుగుతున్న ఇంధన, ఎరువుల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులు, మధ్యతరగతి జీవనాన్ని దుర్భరంగా మార్చి వేశాయనడంలో సందేహం లేదు. రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతానికి చేరుకుంటే టోకు ధరల ద్రవ్యోల్బణం 15 శాతం మేరకు ఉంటుందని ఆర్థిక నిపుణుల అంచనా. తాను తన జీవితంలో ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం ఏనాడూ చూడలేదని, ఇది ప్రభుత్వానికి హెచ్చరిక అని దేశంలో వేగంగా కొనుగోలు చేసే వినియోగ వస్తువుల గ్రూపు (ఎఫ్ఎంసిజి) హిందూస్తాన్ యూనీలీవర్ అధినేత సంజీవ్ మెహ్రా అనడం గమనార్హం. అత్యధిక నిరుద్యోగం, వ్యయాలు విపరీతంగా పెరిగిపోవడం, ఆదాయాలు పడిపోవడం, వంటనూనెల నుంచి ఆటోమొబైల్స్ వరకు అన్నిటి ధరలు పెరగడం వల్ల వినియోగదారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారని, ఆచి తూచి ఖర్చు పెట్టాల్సి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలోకంటే ఎక్కువగా భారతీయులు ఇప్పుడు ఆహారం, వైద్యంపై ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. కరోనాకు ముందున్న ప్రైవేట్ వినియోగం ఇంకా యథాస్థితికి రాలేదు. జీడీపీలో 55 శాతం వినియోగం వల్లే వస్తుందన్న విషయం చాలా మందికి తెలుసు.


ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దేశంలో కార్పొరేట్ కంపెనీల లాభాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 4వేల లిస్టెడ్ కంపెనీల నికర లాభాలు గతంలో ఎన్నడూ లేనంతగా 57.6 శాతం అంటే రూ. 5.31 లక్షల కోట్లకు పెరిగిపోయాయి. ప్రభుత్వం ఇచ్చే భారీ పన్ను మినహాయింపుల్ని పొందుతున్నప్పటికీ, మొత్తం ఆర్థిక వ్యవస్థ పరిస్థితికీ కార్పొరేట్ల పరిస్థితికీ ఎక్కడా పొంతన లేదు. మొత్తం జీడీపీ అభివృద్ధి రేటు పడిపోతుంటే కార్పొరేట్ అభివృద్ధి రేటు పెరుగుతోంది. మరో వైపు ఉత్పాదక, సేవారంగాల పరిస్థితీ అంత ఆశాజనకంగా లేదు. ఇలా ఎందుకు జరుగుతుందో సర్కార్ జవాబు చెప్పాల్సి ఉన్నది.


భారీ లాభాలు ఆర్జించే యూనీకార్న్ స్టార్టప్‌లతో సహా దేశంలో స్టార్టప్‌లు పెరిగిపోతున్నాయని ప్రధానమంత్రి జర్మనీలో చెప్పుకున్నారు. కాని రోజురోజుకూ మూతపడే స్టార్టప్‌లు కూడా పెరిగిపోతున్నాయి. వాటి గురించి ఎవరూ మాట్లాడరు. 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2019లో ప్రకటించారు. 2022 నాటికి భారత జీడీపీ 3.1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు మాత్రమే ఉన్నది. మరో రెండేళ్లలో లక్ష్యాన్ని సాధించగలమా అన్నది చూడాల్సి ఉన్నది. 2017 నుంచి ప్రతి ఏడాదీ జీడీపీ పెరుగుదల తగ్గుతూ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇది ఒక సవాలే. క్రూడాయిల్ ధరలు ఇలాగే పెరుగుతూ పోతే, జీడీపీ తగ్గడమే కాని పెరిగే అవకాశాలు లేవని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుతానికి బ్యారెల్ క్రూడాయిల్ ధర దాదాపు 105.17 డాలర్లు కాగా, అది 2025 నాటికి మరో 66 డాలర్లు పెరుగుతుందని అంచనా. మన చమురు అవసరాలకు విదేశాలపై ఆధారపడివున్న పరిస్థితుల్లో క్రూడాయిల్ ధరలు పది శాతం పెరిగితే భారత జీడీపీ 0.2 శాతం పడిపోతుందని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మన రూపాయి గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోయింది. ఆసియాలో అత్యంత బలహీనంగా ఉన్న కరెన్సీ మన రూపాయే అని వేరే చెప్పనక్కర్లేదు.


25 సంవత్సరాల సంగతి అటుంచి, ఈ పూట గడవడం, రానున్న ఏడాదిలో ద్రవ్యోల్బణాన్ని, నిరుద్యోగాన్ని ఎలా అరికట్టడం, ఆర్థిక మాంద్యాన్ని అరికట్టడం ఎలా సాధ్యమో మనం ఇప్పుడు ఆలోచించుకోవాలి. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు అప్పుల విషవలయంలో ఉన్నాయి. గత 15ఏళ్లలో ఎన్నడూ లేనంతగా, రాష్ట్రాల సగటు రుణ భారం గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 31.3 శాతానికి పెరిగింది. దేశంలోని 31 రాష్ట్రాల్లో 27 రాష్ట్రాల అప్పుల నిష్పత్త్తి విపరీతంగా పెరిగిపోయింది. భారత్ రుణభారం మార్చి 2022 నాటికి జీడీపీలో దాదాపు 59శాతం చేరుకున్నదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖే పార్లమెంట్‌లో అంగీకరించింది. ఎన్నికల్లో విజయం సాధించినంత సులభంగా ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం అంత సులువు కాదని మోదీ ప్రభుత్వానికి ఇప్పటికే తెలిసి ఉండాలి. ఒక పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతిపక్షాల వైఫల్యం, ప్రజల భావోద్వేగాలు మొదలైనవి కారణమవుతాయి. అమృత్ కాలం గురించి అందమైన స్వప్నాలను సృష్టించినంత మాత్రాన ప్రస్తుత తమ దుస్థితిని ప్రజలు ఏ విధంగా మరిచిపోతారు?

అమృత కాలం సరే, వర్తమానం మాటేమిటి?

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.