తాలిబన్ల దాడులను ఆపండి : ఐరాసకు సలేహ్ లేఖ

ABN , First Publish Date - 2021-09-05T19:46:21+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లోని పంజ్‌షీర్‌లో తాలిబన్ల దురాగతాలపై వేగంగా, ఔదార్యంతో

తాలిబన్ల దాడులను ఆపండి : ఐరాసకు సలేహ్ లేఖ

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌లోని పంజ్‌షీర్‌లో తాలిబన్ల దురాగతాలపై వేగంగా, ఔదార్యంతో స్పందించాలని ఆ దేశ ఆపద్ధర్మ అధ్యక్షునిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ కోరారు. పంజ్‌షీర్‌లో తాలిబన్ల దుశ్చర్యల వల్ల పెద్ద ఎత్తున మానవతావాద సంక్షోభం ఏర్పడిందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఐక్య రాజ్య సమితికి, ఇతర అంతర్జాతీయ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. 


అమ్రుల్లా సలేహ్ ఐక్య రాజ్య సమితికి రాసిన లేఖలో, పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో తాలిబన్ల దాడిని నిరోధించేందుకు చేయగలిగినదంతా చేయాలని ఐక్య రాజ్య సమితి, అంతర్జాతీయ సమాజాలను కోరుతున్నామన్నారు. అదృశ్యమైనవారిని, ఇతరులను కాపాడటం కోసం రాజకీయ పరిష్కారానికి చర్చలను ప్రోత్సహించాలని కోరుతున్నట్లు తెలిపారు. దాదాపు 2,50,000 మంది నిరాశ్రయులయ్యారని, వీరిలో మహిళలు, బాలలు, వృద్ధులు ఉన్నారని తెలిపారు. కాబూల్ తాలిబన్ల వశమైన తర్వాత ఇతర ప్రాంతాల నుంచి సుమారు 10 వేల మంది పంజ్‌షీర్ లోయకు వచ్చారని తెలిపారు. వీరంతా మసీదులు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల్లో తలదాచుకుంటున్నారని చెప్పారు. ఆకలి, పోషకాహార లోపం వల్ల వీరు జీవించడం కోసం అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. వారికి తక్షణం ప్రాథమిక ఉపశమనం అవసరమని తెలిపారు. 


పంజ్‌షీర్‌లో అమ్రుల్లా సలేహ్ నేతృత్వంలోని దళాలు తాలిబన్లను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ఈ లోయపై పట్టు సాధించేందుకు ఇరు వర్గాలు పోరాడుతున్నాయి. తాలిబన్లపై పోరాడుతున్న చిట్ట చివరి ప్రావిన్స్ ఇదే. ప్రముఖ ఆఫ్ఘన్ కమాండర్ అహ్మద్ షా మసూద్ కుమారుడు అహ్మద్ మసూద్, అమ్రుల్లా సలేహ్ తాలిబన్లపై పోరాడుతున్న దళాలకు నాయకత్వం వహిస్తున్నారు. వీరి నేతృత్వంలోని ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ అధికార ప్రతినిధి ఫహీం దష్తి ట్విటర్ వేదికగా తెలిపిన వివరాల ప్రకారం, పంజ్‌షీర్‌లో దాదాపు 600 మంది తాలిబన్లు మరణించారు, సుమారు 1,000 మందికి పైగా నిర్బంధంలో ఉన్నారు. వీరిలో కొందరు లొంగిపోయారు. అయితే తాము ముందుకు దూసుకెళ్తున్నామని తాలిబన్లు ప్రకటించారు. 


Updated Date - 2021-09-05T19:46:21+05:30 IST