అమృత మహోత్సవ ప్రతిబింబం!

ABN , First Publish Date - 2022-01-27T08:02:15+05:30 IST

పరిమిత జనం అయితేనేం.. విదేశీ అతిథిగణం లేకపోతేనేం.. ఈసారీ భారత గణతంత్ర వేడుకలు అట్టహాసంగా సాగాయి! రక్షణ పరంగా భారత శక్తి సామర్థ్యాలు ప్రపంచ యవనికపై మరోసారి ఆవిష్కృతమయ్యాయి...

అమృత మహోత్సవ ప్రతిబింబం!

అట్టహాసంగా భారత గణతంత్ర వేడుకలు.. 75 యుద్ధ విమానాలతో వాయుసేన ఫ్లై పాస్ట్‌ 

 తొలిసారి కాక్‌పిట్‌, పైలట్‌ వ్యూతో దృశ్యాలు

 కరోనాతో 5వేల మంది సమక్షంలోనే వేడుకలు


న్యూఢిల్లీ, జనవరి 26: పరిమిత జనం అయితేనేం.. విదేశీ అతిథిగణం లేకపోతేనేం.. ఈసారీ భారత గణతంత్ర వేడుకలు అట్టహాసంగా సాగాయి! రక్షణ పరంగా భారత శక్తి సామర్థ్యాలు ప్రపంచ యవనికపై మరోసారి ఆవిష్కృతమయ్యాయి. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకొంటూ.. వందేళ్ల స్వాతంత్య్ర వేడుకల నాటికి వివిధ రంగాల్లో అభివృద్ధి, స్వావలంబన దిశగా సాగుతున్న భారత్‌ వైపు ఇతర దేశాలు సంభ్రమాశ్చర్యాలతో చూశా యి. మునుపెన్నడూ లేని విధంగా ప్రత్యేక స్థాయిలో రాఫెల్‌, జాగ్వర్‌ తదితర ఫైటర్‌ జెట్స్‌తో వాయుసేన నిర్వహించిన ఫ్లై పాస్ట్‌ వీక్షకులను మరో ప్రపంచంలో విహరింపజేసింది! నేతాజీ 125వ జయంతి నేపథ్యంలో ప్రత్యేకంగా రూపొందించిన శకటం సహా పలు శకటాలు రాజసంగా సాగాయి! 73వ గణతంత్ర వేడుకలు ఢిల్లీ రాజ్‌పథ్‌లో బుధవారం ఘనంగా జరిగాయి. సాయుధ దళాలు 21 తుపాకులతో సమర్పించిన సైనిక వందనాన్ని స్వీకరించిన అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జాతీయ జెండాను ఎగురవేయడంతో ఉత్సవాలు మొదలయ్యాయి. పరేడ్‌ 30 నిమిషాలు ఆలస్యంగా ఉదయం 10:30కు మొదలైంది. అంతకుముందు ప్రధాని మోదీ, జాతీ య యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు నివాళులర్పించా రు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేవలం 5వేల మంది ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. గత 20 ఏళ్లలో ఇదే స్వల్ప హాజరు. 


ఫ్రంట్‌లైన్‌ వర్కర్లే ‘ప్రత్యేక అతిథులు’

‘ఆజాదీకి అమృత్‌ మహోత్సవ్‌’ సందర్భంగా రాజ్‌పథ్‌లో సాగిన శకటాల ప్రదర్శనలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ శకటం ఆకట్టుకుంది. ఇక దేశీయంగా రూపొందించిన తేజస్‌, సబ్‌మరైన్‌ చోదక వ్యవస్థ(ఏఐపీ)పై శకటాలను రక్షణ పరిశోధన, డీఆర్‌డీవో ప్రదర్శించింది. భారత తపాలా విభాగం, మహిళల స్వయం సమృద్ధి అంశమ్మీద రూపొందించిన శకటాన్ని ప్రదర్శించింది. స్వచ్ఛభారత్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్క ర్లు, ఆటో రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, శకటాలకు రూపకల్పన చేసిన కార్మికులకు ‘ప్రత్యేక అతిథుల’ హోదా లో పెద్ద పీట వేయడం ఆకట్టుకుంది. 1999 కార్గిల్‌ యుద్ధంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి పరంవీర్‌ చక్ర పురస్కారాలు పొందిన మేజర్‌ యోగేందర్‌ సింగ్‌ యాదవ్‌, సుబేదార్‌ సంజయ్‌ కుమార్‌, అశోక్‌ చక్ర పురస్కారాలు సాధించిన కల్న ల్‌ డీ శ్రీరామ్‌ కుమార్‌ వరుసగా మూడు జీపుల్లో మార్చ్‌పాస్ట్‌ నిర్వహించారు. బీఎ్‌సఎ్‌ఫకు చెందిన సీమా భవానీ ఆధ్వర్యం లో ప్రత్యేక బృందం మోటార్‌ సైకిల్‌పై చేసిన విన్యాసం ఆకట్టుకుంది. కాగా.. జమ్మూ కశ్మీర్‌లో 2020 ఆగస్టులో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన పోలీసు అధికారి బాబూ రామ్‌కు అశోక చక్ర ప్రకటించారు. ఈ పురస్కారాన్ని ఆయన భార్య రీనా రాణి, కుమారుడు మానిక్‌కు రాష్ట్రపతి అందజేశారు. 


ఫ్లై పాస్ట్‌  అద్భుతః 

గాల్లోకి ఎగిరిన విమానంలోంచి పక్కనే దూసుకెళ్తున్న మిగతా విమానాలు కనిపిస్తే? దూదిపింజల్లాంటి మేఘాలపై నుంచి వరుస పెట్టి ఆ గాలి మోటార్లు చేస్తున్న విన్యాసాలు చూసే భాగ్యం కలిగితే? గణతంత్ర వేడుకల సందర్భంగా వాయుసేన నిర్వహించిన ‘ఫ్లై పాస్ట్‌’లో ఈ అరుదైన, ప్రత్యేక దృశ్యాలను వీక్షకులు తిలకించి ఆనందాశ్చర్యాలకు లోనయ్యా రు. భారత్‌ 75 ఏళ్ల సాతంత్య్ర సంబరాలు జరుపుకొంటున్న వేళ వాయుసేనకు చెందిన 75 విమానాలు ‘ఫ్లై పాస్ట్‌’ నిర్వహించాయి ఆ దృశ్యాలను మొట్టమొదటిసారిగా కాక్‌పిట్‌, పైల ట్‌ వ్యూ కోణంలో చూపించారు. ఇందుకు 59 కెమెరాలు, 160 సిబ్బందితో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మిగ్‌-17, రాఫెల్‌ యుద్ధ విమానాలు, చినూక్‌ హెలికాప్టర్లు చేసిన విన్యాసాలు వీక్షకులకు ఒళ్లు గగుర్పొడిచేలా చేశాయి. రాఫెల్‌ జెట్‌ను నడిపిన మొట్టమొదటి మహిళా పైలట్‌,  ఫ్లైట్‌ లెఫ్టెనెంట్‌ శివాంగి సింగ్‌ ఉత్సవాల్లో పాల్గొన్నారు. గణతంత్ర ఉత్సవాల్లో ఆ దశకొచ్చేసరికి ఓ భావోద్వేగ సన్నివేశం చోటు చేసుకుంది. అది రాష్ట్రపతి బాడీగార్డ్‌ కమాండెంట్స్‌లోని నల్ల అశ్వమైన విరాట్‌! రాష్ట్రపతి కోవింద్‌, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌.. ఆ అశ్వరాజం వద్దకొచ్చి అప్యాయంగా నిమిరారు! 18 ఏళ్ల సర్వీసు అందించిన గుర్రానికి వీడ్కోలు పలికారు. జనవరి 15న ఆర్మీడే సందర్భంగా విరాట్‌కు ‘చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాప్‌ కమాండేషన్‌’ను ఇచ్చారు. ఈ కమాండేషన్‌ పొందిన తొలి అశ్వం విరాటే! 


కేరళలో జాతీయ జెండాకు అవమానం

కేరళలో ఆ రాష్ట్ర పోర్టులు, పురావస్తు శాఖ మంత్రి అహ్మద్‌ దేవర్‌కోవిల్‌ త్రివర్ణపతాకాన్ని తలకిందులుగా ఎగురవేశారు. ఈ ఘటనపై బీజేపీ భగ్గుమంది. జాతీయ జెండా కు అవమానం జరిగిందని, తన పదవికి అహ్మద్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. ఇందులో తనతప్పేమీ లేదని, జెం డాను సిద్ధం చేసింది అధికారులేనని, తాను కేవలం ఎగురవేశానని మంత్రి వివరణ ఇచ్చారు. ఇక.. కశ్మీర్‌లో సైనిక బలగాలు అత్యంత పొడవైన జాతీయ జెండాను ఆవిష్కరించాయి. చినార్‌ కోర్‌ ఆధ్వర్యం లో షోపియాన్‌ జిల్లాలో 150 అడుగుల జెండాను ఆవిష్కరించారు.


మోదీ.. బ్రహ్మకమల్‌ క్యాప్‌ 

కుర్తా మీద మణిపురీ సంప్రదాయ కోటుతో, ఉత్తరాఖండ్‌కే ప్రత్యేకమైన బ్రహ్మకమలం బొమ్మ ఉన్న టోపీతో ప్రధాని మోదీ వస్త్రఽధారణ గణతంత్ర ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిరుటి గణతంత్ర ఉత్సవాల్లో ఆయన గుజరాత్‌ జామ్‌గఢ్‌కు చెందిన ప్రత్యేక టోపీని ధరించారు. ప్రతి స్వాతంత్య్ర, గణతంత్ర ఉత్సవాలకు విభిన్న టర్బన్లు ధరించడాన్ని మోదీ సంప్రదాయంగా మలచుకున్నారు.





సీజేఐ జస్టిస్‌ రమణ

న్యూఢిల్లీ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): గణతంత్ర దినోత్సవం సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ బుధవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి సుప్రీం కోర్టు అధికారులు తదితరులు హాజరయ్యారు. కాగా, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ జాతీయ జెండాను ఎగురవేశారు.






లాల్‌చౌక్‌ క్లాక్‌ టవర్‌పై రెపరెపలు

శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లోని చరిత్రాత్మక క్లాట్‌ టవర్‌పై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. సామాజిక కార్యకర్త సాజిద్‌ యూసుఫ్‌ షా, సాహిల్‌ బషీర్‌ భట్‌ సహా పదుల సంఖ్యలో మద్దతుదారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లాక్‌ టవర్‌ మీద మువ్వన్నెల జెండా ఎగరడం 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అప్పట్లో బీజేపీ నేత మురళీ మనోహర్‌ జోషి తొలిసారిగా ఎగురవేశారు. కశ్మీర్‌ వ్యాప్తంగా బుధవారం ఉదయం జెండా పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. షేర్‌-ఎ-కశ్మీర్‌ క్రికెట్‌ మైదానంలో జమ్మూ కశ్మీర్‌ లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ సలహాదారు ఆర్‌ఆర్‌ భట్నాగర్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసులు, పారామిలటరీ బృందాలు కవాతు నిర్వహించాయి. సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Updated Date - 2022-01-27T08:02:15+05:30 IST