అమృత్‌.. ఆలస్యం

ABN , First Publish Date - 2022-05-25T05:16:15+05:30 IST

పట్టణాల్లో ప్రజలు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు తాగునీరు, మురుగునీరు. వీటి వల్ల ప్రజల ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి.

అమృత్‌.. ఆలస్యం
అమృత్‌ కింద నరసరావుపేటలో నిర్మాణంలో ఉన్న రక్షిత మంచి నీటి పథకం ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌

పథకం అమల్లో నిర్లక్ష్యం

ఆరేళ్లుగా సాగుతున్న పనులు

సుదూరంగానే పట్టణ ప్రజారోగ్యం

చిలకలూరిపేట మున్సిపాల్టీలో నిధుల కొరత

నరసరావుపేటలో 68.41 శాతం పనులే పూర్తి


నరసరావుపేట, మే 24: పట్టణాల్లో ప్రజలు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు తాగునీరు, మురుగునీరు. వీటి వల్ల ప్రజల ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి. ఈ పరిస్థితుల్లో పరిశుభ్రమైన తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ అభివృద్ధి చేసి ప్రజారోగ్యాన్ని సంరక్షించాలని కేంద్ర ప్రభుత్వం అమృత్‌ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ప్రజలకు మౌళిక వసతులు కల్పించేందుకు తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ అభివృద్ధి పనులకు ఈ పథకంలో ప్రాధాన్యం ఇచ్చారు. తాగునీరు, పారిశుధ్యం మెరుగుదలతో ప్రజలకు మెరుగైన ఆరోగ్యం కల్పించాలన్నదే అమృత్‌ పథకం లక్ష్యం. ఈ పథకం పనుల్లో నిర్లక్ష్యం తాండవిస్తుండటంతో పథకం లక్ష్యాలు నీరుగారిపోతున్నాయి. జిల్లాలోని   చిలకలూరిపేట, నరసరావుపేట పట్టణాలకు అమృత్‌ కింద 2015, 2016 ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో ఆయా మున్సిపాల్టీల్లో రక్షిత మంచి నీటి పథకాల విస్తరణ, మురుగునీటి పారుదల వ్యవస్థ అభివృద్ధి పనులు చేపట్టారు. అమృత్‌ పథకం అమల్లోకి వచ్చిన 9 నుంచి 18 నెలల్లో నరసరావుపేట, చిలకలూరిపేట మున్సిపాల్టీల్లో 15 నుంచి 18 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఆరేళ్లు గడిచినా పనులు పూర్తి చేయడంలో పుర పాలకులు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్నాయి.


నత్తతో పోటీ పడుతున్న పనులు

చిలకలూరిపేట మున్సిపాల్టీలో అమృత్‌ పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. ఇక్కడ పనులు నత్త నడక కన్నా నిదానంగా సాగుతున్నాయి. దీంతో ప్రజలు తాగునీరు, మురుగు కష్టాలతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మునిసిపాల్టీలో రూ.149.92 కోట్ల విలువైన పనులు చేపట్టారు. మునిసిపల్‌ వాటా నిధులు చెల్లించే పరిస్థితి లేదు. దీంతో మున్సిపల్‌ ఆస్తులు తనకా పెట్టి రూ.43 కోట్లు ఏపీయుఎఫ్‌ఐడీసీ నుంచి రుణం తీసుకున్నారు. అయినా నిధుల కొరతతో పనులు ముందుకు సాగడంలేదు. రూ.7.70 కోట్ల వ్యయంతో 4975 కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యం కాగా సుమారు 2000 మాత్రమే ఇచ్చారు. పంపింగ్‌ మెయిన్‌, డిస్ట్రిబ్యూషన్‌ పైపులైన్లు, ఈఎన్‌ఎస్‌ఆర్‌ నిర్మాణ పనుల్లో 76.06 శాతమే పూర్తి చేశారు. సాగర్‌ ప్రధాన కాల్వ నుంచి పట్టణానికి నీటిని సరఫరా చేసేందుకు రూ.132.11 కోట్లతో పైపులైన్‌ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పనులు 37.44 శాతమే పూర్తయ్యాయి. మురుగునీటి పారుదల వ్యవస్థ అభివృద్ధిలో భాగంగా రూ.10.10 కోట్లతో 5 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ఓగేరు వాగు సమీపంలో చేపట్టిన ఎస్‌టీపీ పనులు కేవలం 10.03 శాతం పనులు పూర్తయ్యాయి. ఇక జిల్లా కేంద్రమైన నరసరావుపేట మున్సిపాల్టీలో రూ.18.11 కోట్ల వ్యయంతో తాగునీటి పథకం పనులు చేపట్టగా రూ.5.08 కోట్ల పైపులైన్‌ నిర్మాణం చేశారు. తాగునీటి కుళాయిలు, నీటి సరఫరా పైపులైన్‌, ఓవర్‌ హెడ్‌ ట్యాంకు పనుల్లో 68.41 శాతం మాత్రమే పూర్తయ్యాయి. అమృత్‌ పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం తాండవిస్తున్నదన్న విమర్శలున్నాయి. పనులు పూర్తి చేస్తే ఆయా మున్సిపాల్టీలలో తాగునీరు, మురుగునీటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. రెండు నుంచి మూడు నెలలో పనులు పూర్తి చేస్తామని కమిషనర్లు ఉన్నతాధికారులకు నివేదికలు అందజేశారు. ఆ ప్రకారం పనులు పూర్తి చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.  

 

Updated Date - 2022-05-25T05:16:15+05:30 IST