పందుల సాయంతో విమాన ప్రమాదాల నివారణ.. ఎయిర్‌పోర్టు అధికారుల కొత్త ప్రయోగం!

ABN , First Publish Date - 2021-11-26T03:47:03+05:30 IST

ఎయిర్‌పోర్టు సమీపంలో చెట్లు, లేదా పొలాలు ఉన్న సందర్భాల్లో విమానాలకు పక్షుల బెడద మరింత ఎక్కువగా ఉంటుంది. అమస్టర్‌డ్యామ్‌లోని షిపోల్ ఎయిర్‌పోర్టు సరిగ్గా ఇటువంటి సమస్యనే ఎదుర్కొంటోంది. అయితే..అక్కడి అధికారులు ఈ సమస్యకు ఓ వినూత్న పరిష్కారాన్ని ప్రతిపాదించారు. అవే పందులు..!

పందుల సాయంతో విమాన ప్రమాదాల నివారణ.. ఎయిర్‌పోర్టు అధికారుల కొత్త ప్రయోగం!

ఇంటర్నెట్ డెస్క్: పక్షుల వల్ల విమానాలకు ప్రమాదమన్న విషయం తెలిసిందే! ముఖ్యంగా టేకాఫ్ సమయంలో విమానం ఇంజిన్‌లోకి పక్షులు దూసుకుపోతే..ఇంజిన్లు ఆగిపోయి విమానం కుప్పకూలిపోయే అవకాశం ఉంది. ఇక ఎయిర్‌పోర్టు సమీపంలో చెట్లు, లేదా పొలాలు ఉన్న సందర్భాల్లో విమానాలకు పక్షుల బెడద మరింత ఎక్కువగా ఉంటుంది.  అమస్టర్‌డ్యామ్‌లోని షిపోల్ ఎయిర్‌పోర్టు సరిగ్గా ఇటువంటి సమస్యనే ఎదుర్కొంటోంది. అయితే..అక్కడి అధికారులు ఈ సమస్యకు ఓ వినూత్న పరిష్కారాన్ని ప్రతిపాదించారు.  అవే పందులు..! 


అవును.. పందుల సాయంతో పక్షులకు చెక్ పెడదామనుకుంటున్నారు అక్కడి అధికారులు. ఈ ఉపాయం అనుకున్న ఫలితాన్ని ఇస్తుందో లేదో తెలుసుకునేందుకు ఓ పైలట్ ప్రాజెక్టును కూడా ప్రారంభించారు. ఇందులో భాగంగా పందులను పెంచే ఓ కంపెనీని సంప్రదించి..కొన్ని పందులను రన్‌వే చుట్టూ ఉన్న పొలాల్లోకి వదిలారు. ఆ పొలాల్లోని వ్యవసాయ వ్యర్థాలను ఆరగించడమే ఈ సూకరాల పని. ఈ వ్యర్థాల కోసం పక్షులు పోలాలవైపు వస్తూ విమానాలకు సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. దీంతో.. ఎయిర్ పోర్టు అధికారులు పందులను రంగంలోకి దింపారు. ఆ వ్యవసాయ వర్థాలన్నిటినీ పందులు తినేస్తే..పక్షులు అటువైపు కన్నెత్తి కూడా చూడవని, ప్రమాదాలు తగ్గిపోతాయని వారు భావిస్తున్నారు. ఆ కంపెనీ సిబ్బందే దగ్గరుండి మరీ పందులను పర్యవేక్షిస్తున్నారు. మరి వీరి ప్రయోగం ఆశించిన ఫలితాలను ఇస్తుందో లేదో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.

Updated Date - 2021-11-26T03:47:03+05:30 IST