జిల్లాలో ‘అమూల్‌’ పాలసేకరణ

ABN , First Publish Date - 2020-12-03T05:37:43+05:30 IST

జిల్లాలో ‘అమూల్‌’ పాల సేకరణ ప్రారంభమైంది.

జిల్లాలో ‘అమూల్‌’ పాలసేకరణ
వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌ ప్రసంగాన్ని వీక్షిస్తున్న కలెక్టర్‌ భరత్‌గుప్తా

వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించిన సీఎం జగన్‌ 


మదనపల్లె రూరల్‌, డిసెంబరు 2: జిల్లాలో ‘అమూల్‌’ పాల సేకరణ ప్రారంభమైంది. మదనపల్లె మండలం వేంపల్లె రైతుభరోసా కేంద్రం వేదికగా అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్సులో సీఎం జగన్‌ ప్రారంభించారు. జిల్లాలో 24లక్షల లీటర్ల పాలకు పైగా పాలసేకరణ ఉందని, 9.5 లక్షల పాడి ఆవులున్నాయని సీఎంకు కలెక్టర్‌ భరత్‌గుప్తా వివరించారు. మదనపల్లె, రామసముద్రం మండలాల్లోని 100 గ్రామాల్లో పాలసేకరణ జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా వేంపల్లెకు చెందిన మహిళా రైతు రాజేశ్వరి మాట్లాడుతూ.. మదనపల్లె చుట్టుపక్కల గ్రామాల్లోని ఆవుపాలల్లో అమూల్‌కు కావాల్సిన ఎస్‌ఎన్‌ఎఫ్‌ (8.3) కంటే తక్కువగా ఉందని తీసుకోవడం లేదని చెప్పారు. దీంతో ప్రైవేటు డెయిరీలకే పోయాల్సి వస్తోందన్నారు. అమూల్‌ వాళ్లతో మాట్లాడి పాలు తీసుకునేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేసీ వీరబ్రహ్మం, సబ్‌కలెక్టర్‌ ఎం.జాహ్నవి, ట్రైనీ కలెక్టర్‌ విష్ణుచరణ్‌, పశుసంవర్ధకశాఖ జేడీ వెంకట్రావు, అమూల్‌ ప్రతినిధి అనిల్‌ గోకుల్‌ కృష్ణ,  ఎంపీడీవో లీలామాధవి, తహసీల్దారు కుప్పుస్వామి, పశుసంవర్థకశాఖ డీడీ రమేష్‌, ఏడీ శ్రీధర్‌రెడ్డి, ఏపీఎం సురేష్‌కుమారెడ్డి, డెయిరీ మేనేజర్‌ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T05:37:43+05:30 IST