అమూల్‌ లాభాలు అక్కచెల్లెమ్మలకే

ABN , First Publish Date - 2020-12-03T08:52:09+05:30 IST

‘రాష్ట్రంలో అమూల్‌ రావడం వల్ల లీటరు పాల ధర రూ.5 నుంచి రూ.7 వరకు పెరుగుతుంది. దీనివల్ల ప్రైవేటు డెయిరీలు కూడా కచ్చితంగా రేట్లు పెంచుతాయి.

అమూల్‌ లాభాలు అక్కచెల్లెమ్మలకే

పాలు పోసిన పది రోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు..

ఏడాదికి రెండు విడతలుగా బోనస్‌ చెల్లింపు

9,899 గ్రామాల్లో బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, ఆటోమేటిక్‌ పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు

తొలి విడతలో 3 జిల్లాల్లోని 400 గ్రామాల్లో పాల సేకరణ..

దశలవారీగా మహిళలకు డెయిరీ యూనిట్లు

ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్‌.. అమూల్‌ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభం

దశలవారీగా మహిళలకు డెయిరీ యూనిట్ల పంపిణీ 

ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్‌ 


అమరావతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో అమూల్‌ రావడం వల్ల లీటరు పాల ధర రూ.5 నుంచి రూ.7 వరకు పెరుగుతుంది. దీనివల్ల ప్రైవేటు డెయిరీలు కూడా కచ్చితంగా రేట్లు పెంచుతాయి. అమూల్‌ ఎక్కువ రేటుకు పాలను కొనుగోలు చేయడమే కాకుండా ఏపీలో వచ్చే లాభాలన్నింటినీ కూడా ఏడాదికి రెండు విడతల్లో బోన్‌సగా అక్కచెల్లెమ్మలకే చెల్లిస్తారు’ అని సీఎం జగన్‌ ప్రకటించారు. ఏపీ-అమూల్‌ ప్రాజెక్ట్‌ తొలిదశను బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ ‘అమూల్‌ దేశంలోనే కాదు. ప్రపంచంలో పోటీ పడే కంపెనీ. అమూల్‌ ఒక సహకార ఉద్యమం. అమూల్‌తో మా ఒప్పందం సహకార రంగంలోని డెయిరీల పునరుద్ధరణ, వాటి బలోపేతానికి దోహదపడుతుంది. అమూల్‌కు ఓనర్లు ఎవరూ లేరు. పాలు పోసే అక్కచెల్లెమ్మలే ఓనర్లు. పాల సేకరణ తర్వాత 10రోజుల్లోనే రైతుల ఖాతాలకు డబ్బులు జమ అవుతాయి.  అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం వల్ల జరిగే మేలు ఇదే’ అని చెప్పారు. ‘అమూల్‌తో ఒప్పందం అమలు కోసం రూ.3వేల కోట్లతో 9,899 గ్రామాల్లో బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, ఆటోమేటిక్‌ పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో బీఎంసీయూలో 2వేల లీటర్ల పాలు నిల్వ చేయవచ్చు.


ఇవన్నీ ఈ రోజు గురించి కాదు. మరో శతాబ్దం పాటు మనవాళ్లకు శాశ్వతంగా ఉండాలన్న ఆలోచనతో చేస్తున్నాం’ అని సీఎం తెలిపారు. తొలి విడతలో కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని 400 గ్రామాల్లో  పాల సేకరణ ప్రారంభమై, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామని వెల్లడించారు. ‘4.69 లక్షల మంది మహిళలు పాడి యూనిట్లు అడిగారు. అధిక పాల దిగుబడి ఇచ్చే గేదెలు, ఆవుల కొనుగోలుకు సహాయ సహకారాలు అందిస్తాం. ఈ నెల 10న 2.49 లక్షల మేకలు, గొర్రెల యూనిట్లు ప్రారంభిస్తాం’ అని జగన్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రామచంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి, కన్నబాబు, అప్పలరాజు, సీఎస్‌ నీలం సాహ్ని, అగ్రిమిషన్‌ వైస్‌చైర్మన్‌ నాగిరెడ్డి, అమూల్‌ ఎండీ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ సోథీ, అమూల్‌ డెయిరీ ఎండీ అమిత్‌వ్యా్‌స, సబర్‌ డెయిరీ ఎండీ పటేల్‌, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇర్మా డైరెక్టర్‌ సశ్వత ఎన్‌. బిస్వాస్‌ మాట్లాడారు. 


పాడి రైతులతో ముఖాముఖి

పులివెందుల: ఏపీ-అమూల్‌ పాలవెల్లువ పథకంలో భాగంగా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని నల్లపురెడ్డిపల్లె, రామిరెడ్డిపల్లె గ్రామాల్లోని మహిళా పాడి రైతులతో సీఎం జగన్‌ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు సీఎంకు నల్లపురెడ్డిపల్లెకు చెందిన మహిళా పాడి రైతు అశ్విని కృతజ్ఞతలు తెలిపారు. దాణాకు, పశువుల షెడ్డుకు రుణాలు ఇప్పించాలని కోరగా ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.

Updated Date - 2020-12-03T08:52:09+05:30 IST