భారం.. మీదే..!

ABN , First Publish Date - 2021-10-08T05:50:31+05:30 IST

అమూల్‌ పాలసేకరణ పంచాయతీ కార్యదర్శులకు కష్టాలను తెచ్చిపెడుతోంది.

భారం.. మీదే..!

  12 మంది కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు

పాలు పోసేందుకు ఆసక్తి చూపని పశుపోషకులు 

 వారికి అవగాహన కల్పించడం లేదంటూ కార్యదర్శులపై చర్యలు

 ఉన్నతాధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు  

 తమను బలిచేయడం సరికాదంటున్న సంఘ నేతలు 

  

అమూల్‌ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. బలవంతంగానైనా అమూల్‌ కేద్రానికి ఉత్పత్తిదారులు పాలుపోసేలా చర్యలు చేపడుతోంది. కానీ.. గ్రామాల్లోని అమూల్‌ సేకరణ కేంద్రాలకు పాలుపోసేందుకు పశుపోషకులు అంతగా ఆసక్తి కనపరచకపోవడం ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పిస్తోంది. పాలసేకరణ బాధ్యతలు మోస్తున్న పంచాయతీ కార్యదర్శులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ 12మందికి జిల్లా పంచాయతీ అధికారి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ అంశం పంచాయతీ వర్గాలలో కలకలం సృష్టించింది. 


నరసరావుపేట, అక్టోబరు7: అమూల్‌ పాలసేకరణ పంచాయతీ కార్యదర్శులకు కష్టాలను తెచ్చిపెడుతోంది. పాలసేకరణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఉన్నతాధికారులు ప్రత్యక్ష చర్యలకు పూనుకున్నారు. కలెక్టర్‌, ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినటప్పటికీ కార్యదర్శులు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించకపోవటం వలన అమూల్‌ ప్రాజెక్టు కింద పాలసేకరణ ఆశించిన స్థాయికి చేరుకోలేదని నోటీసుల్లో జిల్లా పంచాయతీ అధికారి పేర్కొన్నారు. కేటాయించిన విఽధులు అమలులో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారని డీపీవో నోటీసులో తెలియజేశారు. పశుపోషకులు అమూల్‌కు ఎలాగైనా పాలుపోయాలి.. లేదంటే పరోక్షంగా సంక్షేమ పథకాలు నిలిపివేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతుండటంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భయపెట్టినా, బతిమిలాడినా అమూల్‌కు పాలు పోసేందుకు ఉత్పత్తిదారులు ముందుకు రావడంలేదు.  


షోకాజ్‌ నోటీసులు వీరికే..

 డీపీవో షోకాజ్‌ నోటీసులు జారీచేసిన కార్యదర్శుల వివరాలు ఇలా ఉన్నాయి.. శావల్యాపురం మండలం పొట్లూరు, వేల్పూరు, చినకంచర్ల, శావల్యాపురం, నరసరావుపేట మండలం చింతలపాలెం, సత్తెనపల్లి మండలం గుజ్జర్లపూడి, ధూళిపాళ్ళ, ముపాళ్ళ మండలం నార్నెపాడు, మాదల, నకరికల్లు మండలం చీమలమర్రి, త్రిపురాపురం, యడ్లపాడు కార్యదర్శులకు నోటీసులు జారీ అయ్యాయి. మీపై శాఖాపరమైన చర్యలు ఎందుకు తీసుకోనకూడదో నోటీసు అందిన వారంలోగా లిఖితపూర్వక సంజాయిషీని తెలియపరచాలని, లేని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని డీపీవో సదరు కార్యదర్శులకు స్పష్టం చేశారు. కార్యదర్శులను నోడల్‌ అధికారులుగా నియమించి మరీ పాలసేకరణ బలవంతంగా చేయాలని ప్రయత్నిస్తున్నా ఉత్పత్తిదారులు అమూల్‌కు పాలు పోయకపోవడం ఉనతాధికారులకు మింగుడు పడటంలేదు. మరికొందరు కార్యదర్శులపై కూడా పాలసేకరణ విషయంలో చర్యలు తీసుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది. 

  

 ఉద్యోగులను బలిపెట్టడం సబబేనా?

గుజరాతీ సంస్థ అయిన అమూల్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను బలిచేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగని చర్య అని సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌  అన్నారు.అమూల్‌కు పాల సేకరణలో విఫలమయ్యారనే కారణంతో 12 మంది పంచాయతీ సెక్రటరీలకు షోకాజ్‌ నోటీస్‌లు ఇవ్వడం ఏంటన్నారు. అమూల్‌కు పాలు పోస్తే నష్టపోతామని రైతులు గుర్తించి ఆ సంస్థను రాష్ట్రంలోని అన్నీ చోట్ల తిరస్కరించారన్నారు. అమూల్‌ను రాష్ట్రంలో విస్తరించేందుకు ప్రభుత్వం వేలకోట్ల ప్రజాధనం వెచ్చించడంపై హైకోర్టులో కేసులు నడుస్తున్నాయని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తుందన్నారు. ఇప్పటికే సంగం డెయిరీ లాంటి సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూసి ప్రభుత్వం భంగపడిందన్నారు. ప్రభుత్వానికి చేతనైతే తమ కంటే మెరుగైన ధరను, బోనస్‌లను అందించి, అమూల్‌కు పాలు సేకరించాలని, ఉద్యోగులను ఒత్తిడి చేస్తే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు.

 

మమ్మల్ని బాధ్యులను చేయొద్దు

 అమూల్‌కి పాలు పోయడం ప్రజలకు ఇష్టం లేదని, దానికి తమను బలి చేయడం సరికాదని ఏపీ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైవీడీ ప్రసాద్‌ ఆక్షేపించారు. గురువారం జిల్లాలో 12 మంది పంచాయతీ కార్యదర్శులకు డీపీవో కేశవరెడ్డి షోకాజ్‌ నోటీసులు జారీ చేయడంపై ఆయన స్పందించారు.  అమూల్‌ పాల సొసైటీల స్థలసేకరణ, భవన నిర్మాణాల కోసం పంచాయతీ కార్యదర్శులు అహర్నిశలు కష్టపడ్డారని చెప్పారు. అయితే కొన్ని చోట్ల అమూల్‌కి పాలు పోయడం ప్రజలకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శులు ఎంత అవగాహన కల్పించినా వారు మనస్సు మార్చుకోవడం లేదన్నారు. మాకు సంబంధం లేని పనులు కూడా మాతో చేయిస్తున్నారని చెప్పారు. పంచాయతీ భవనాల పెయింటింగ్స్‌ విషయంలోనూ సెక్రెటరీలతో ఖర్చు పెట్టించి ఇప్పుడు బిల్లులు చెల్లించడం లేదన్నారు. పంచాయతీ కార్యదర్శులను షోకాజ్‌ నోటీసుల పేరుతో వేధించడం సరికాదని, ఈ విషయాన్ని డీపీవోకు నివేదించామన్నారు. తక్షణమే షోకాజ్‌ నోటీసులు వెనక్కు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. 

Updated Date - 2021-10-08T05:50:31+05:30 IST