పంగూరులో వృద్ధుడి దారుణహత్య

ABN , First Publish Date - 2021-11-27T06:10:36+05:30 IST

చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో ఓ వృద్ధుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన శుక్రవారం ఏర్పేడు మండలంలో చోటు చేసుకుంది.

పంగూరులో వృద్ధుడి దారుణహత్య
రక్తమడుగులో పడి ఉన్న నారాయణ మృతదేహం

ఏర్పేడు, నవంబరు 26: చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో ఓ వృద్ధుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన శుక్రవారం ఏర్పేడు మండలంలో చోటు చేసుకుంది. రేణిగుంట డీఎస్పీ కథనం మేరకు... ఏర్పేడు మండలం పంగూరు గిరిజనకాలనీకి చెందిన కుంభ నారాయణ(59) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు భార్య వెంకటలక్ష్మి, కుమార్తె నాగమ్మ, కుమారులు శాంతన్‌రాజు, శాలినీరాజ్‌ ఉన్నారు. కాగా, ఆయన ఇంటి పక్కనే ఉన్న వరుసకు మేనమామ అయిన నాగరాజు నాలుగేళ్ల కిందట అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఓ ఆలయానికి వెళ్లగా, పొరుగింటిలో ఉన్న వ్యక్తి చేతబడి చేశాడని అక్కడి వ్యక్తులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయమై నారాయణ, నాగరాజు కుటుంబాలు రెండేళ్లుగా గొడవపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల నడుమ రాజీయత్నం చేసేందుకు వారంకిందట స్థానిక కులపెద్దలు పంచాయితీ నిర్వహించారు. నాగరాజు కుటుంబంపై చేతబడి చేయలేదంటూ డిసెంబరు 6వతేది గ్రామదేవత ఎదుట సత్యప్రమాణం చేయాలని కులపెద్దలు నిబంధన పెట్టారు. ఆ మేరకు అమ్మవారి ఆలయంలో తాను ప్రమాణం చేయడానికి సిద్ధమని నారాయణ తేల్చిచెప్పారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి భోజనం చేసిన నారాయణ ఇంటి పక్కనున్న చర్చిలో నిద్రించేందుకు వెళ్లాడు. అయితే శుక్రవారం ఉదయం ఎంతకూ నారాయణ రాకపోవడంతో చిన్న కుమారుడు శాలినీరాజ్‌ చర్చి వద్దకు వెళ్లాడు. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న తండ్రిని చూసి భోరుమన్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడి వెళ్లి, గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో నారాయణను గొంతు కోసి దారుణంగా చంపినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న రేణిగుంట డీఎస్పీ రామచంద్ర, ఏర్పేడు సీఐ శ్రీహరి సిబ్బందితో కలసి గిరిజనకాలనీకి వెళ్లి వృద్ధుడి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, నాగరాజు, ఆయన కుమారులు వెంకటేష్‌, సతీష్‌, గిరిజనకాలనీకి చెందిన రాజా, వెంకటేష్‌, అబ్బాస్‌లు నారాయణను చంపి ఉండవచ్చని మృతుడి భార్య వెంకటలక్ష్మి, ఆయన కుమారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆరుగురు పరారీలో ఉండడంతో, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీహరి తెలిపారు. వీరందరినీ త్వరలో అరెస్టు చేసి, హత్య వెనుక గల కారణాలు తేలుస్తామని చెప్పారు. 

Updated Date - 2021-11-27T06:10:36+05:30 IST