అసమర్థ పాలనకు చరమగీతం పలకాలి

ABN , First Publish Date - 2022-05-18T06:44:19+05:30 IST

రాష్ట్రంలో అసమర్ధ పాలనకు చరమగీతం పలకాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు పిలుపునిచ్చారు.

అసమర్థ పాలనకు చరమగీతం పలకాలి
హసనాబాద్‌లో బాదుడే బాదుడులో పాల్గొన్న ఎరిక్షన్‌బాబు

పెద్ద దోర్నాల, మే 17: రాష్ట్రంలో అసమర్ధ పాలనకు చరమగీతం పలకాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు పిలుపునిచ్చారు. మండలంలోని హసనాబాద్‌ గ్రామంలో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామం సమీపంలోని కొండబోడుపై ఏర్పాటు చేసిన జగనన్న కాలనీని టీడీపీ బృందం సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడింది. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దాటినా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేని అసమర్ధుడు జగన్‌మోహన్‌రెడ్డి అని ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు ఆరోపించారు. ఆవాసం కాని చోట కొండ ప్రాంతాల్లో ఊరికి దూరంగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నామంటూ లక్షల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు. నిత్యావసర సరుకులు, పెట్రోలు, గ్యాస్‌, కరెంటు, ఆర్‌టీసీ బస్సు చార్జీలు అమాంతం పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని దుయ్యబట్టారు.రైతుల సంక్షేమం కోసం గతంలో ఉన్న ప్రభుత్వ పథకాలను రద్ధు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చి గద్దె నెక్కాకతుంగలో తొక్కారని విమర్శించారు. వ్యవసాయానికి ఊతమిచ్చేలా గత ప్రభుత్వం పని చేస్తే ఈ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు  బిగించి రైతులకు ఇబ్బందులు కల్గించే దిశగా చర్యలు తీసుకుందని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి కోసం తపించే నిత్య కృషీవలుడు చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, అందుకనుగుణంగా తనను అందరూ ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఏర్వ మల్లికార్జునరెడ్డి, నాయకులు షేక్‌.మాబు, షేక్‌ సమ్మద్‌భాష, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, ఆర్‌.సుబ్బరత్నం, దేసు నాగేంద్రబాబు, చంటి, వై.చంచయ్య, శ్రీనివాస్‌ యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-18T06:44:19+05:30 IST